మంచి కబురు! | Sakshi Editorial Article On Corona Virus Vaccine | Sakshi
Sakshi News home page

మంచి కబురు!

Published Fri, Oct 15 2021 12:36 AM | Last Updated on Fri, Oct 15 2021 12:37 AM

Sakshi Editorial Article On  Corona Virus Vaccine

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 2–18 సంవత్సరాల మధ్యవారికి కోవాగ్జిన్‌ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించవచ్చని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌నుంచి పూర్తిస్థాయిలో దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే ప్రపంచంలోనే తొలిసారి రెండేళ్లు, అంతకుపైబడిన పిల్లలకు టీకా వినియోగించే దేశంగా భారత్‌ నిలుస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను రూపొందించిన భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే మూడు దశల క్లినికల్‌ పరీక్షల డేటాను అందజేసింది. తుది దశ సమాచారం రావాల్సివుంది. జైకోవ్‌–డీ అనే టీకాకు సైతం అత్యవసర విని యోగానికి అనుమతులు లభించాయి. అయితే అది 12–18 సంవత్సరాల మధ్యవారి కోసం రూపొందించింది. అలాగే 5–18 మధ్య వయసున్న పిల్లలకు కార్బీవ్యాక్స్, 2–18 ఏళ్ల మధ్యవారికి తయారైన కోవోవ్యాక్స్‌లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి.  ఒకపక్క కరోనా మహమ్మారి మూడో దశ మన దేశంలోనూ విరుచుకుపడే అవకాశమున్నదని, ఈసారి ప్రధానంగా పిల్లలపైనే అది ప్రతాపం చూపబోతున్నదని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో వారి కోసం రూపొందించిన కోవాగ్జిన్‌ టీకా అందుబాటులోకి రాబోతుండటం దేశ ప్రజలకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. ఏడాదిన్నరకుపైగా పాఠశాలలు మూతబడి, ఆన్‌లైన్‌లో మాత్రమే చదువులు సాగుతున్న తీరు అత్యధిక శాతంమంది పిల్లలను చదువులకు పూర్తిగా దూరం చేసింది. ఒక అంచనా ప్రకారం 5 కోట్ల మంది పిల్లలు ఆన్‌లైన్‌ చదువులకు అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు కొనుక్కునే స్థోమత లేక పూర్తిగా వెనకబడ్డారు. ఇక క్రీడా శిక్షణ సంస్థలు, కోచింగ్‌ కేంద్రాలు వగైరాలు కూడా చాన్నాళ్లుగా మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే వాటిని మళ్లీ తెరుస్తున్నారు. బడులు తెరుచుకున్నా ఇప్పటికీ తమ పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు సందేహిస్తూనే ఉన్నారు. ఇంటికే పరిమితమైతే పిల్లల చదువు లకు మాత్రమేకాక... వారి మానసిక, శారీరక ఎదుగుదలకూ అది అవరోధమవుతుందని వారికి తెలుసు. అలాగని ప్రాణాలకు ముప్పు పొంచివుందన్న భయాందోళనలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. ఇక బడుల్లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది. మాస్క్‌లు ధరించటం, శాని టైజర్‌ వాడకం, దూరం పాటించడం తదితరాలతో తరగతి గదులు కూడా గతంలో మాదిరి స్వేచ్ఛా యుత వాతావరణానికి దూరమైనాయి. బడులకు వెళ్లొస్తున్నారన్న మాటేగానీ... అంతా సవ్యంగా ఉందో లేదోనన్న చింత అటు పిల్లలకూ, ఇటు తల్లిదండ్రులకూ కూడా ఉంటున్నది. పిల్లలకు సైతం వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులుండవు. 

అయితే కరోనా వ్యాక్సిన్‌ అనుమతుల విషయంలో గతంలో వచ్చిన విమర్శలవంటివి తలెత్త కుండా డీసీజీఐ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. వ్యాక్సిన్‌ల వాడకం సురక్షితమైనదని నిపుణుల కమిటీ మాత్రమే అభిప్రాయపడితే చాలదు. సీజీఐ సంస్థ వెలుపల కూడా ఆరోగ్య రంగంలో పని చేసే నిపుణులు ఉన్నారు. వారు కూడా అధ్యయనం చేసేందుకు వీలుగా డీసీజీఐ  ఆ డేటాను అందు బాటులో ఉంచాలి. ప్రభుత్వం అనుమతించిందన్న ఒక్క కారణంతో సంతృప్తిపడి టీకాలు తీసుకోవ డానికి అనేకులు ముందుకొస్తారు. అందులో అనుమానం లేదు. కానీ అత్యధికులు సంతృప్తిపడే విధంగా చేయాలంటే ఇది తప్పనిసరి.  క్లినికల్‌ పరీక్షల్లో వెల్లడైన అంశాలేమిటో, వాటి లోతుపాతులే మిటో ఆరోగ్యరంగ నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు. ఒక దశ ప్రయోగానికీ, మరో దశ ప్రయో గానికీ మధ్య ఉన్న వ్యవధి, టీకాలు తీసుకున్నవారిలో వెల్లడైన లక్షణాలు అధ్యయనం చేస్తారు. వ్యాక్సిన్‌ల విషయంలో పెదవి విరిచేవారిని సైతం అటువంటివారి అభిప్రాయం సంతృప్తి పరు స్తుంది. పెద్దల కోసం రూపొందించిన టీకా యధాతథంగా పిల్లలకు ఇవ్వటం సాధ్యపడదు. ఈ విష యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు సూచించింది. శారీరక ఎదుగుదల చక్కగా ఉండే  శైశవ, బాల్య, కౌమార, యౌవన దశల్లోనివారు కావటం, వారికుండే భిన్నమైన వ్యాధి నిరోధకత ఇందుకు కారణం.  క్లినికల్‌ పరీక్షకు ముందుకొచ్చిన పది పన్నెండేళ్లలోపు వయసున్న పిల్లలు తమను అడిగే ప్రశ్నలకు విస్పష్టంగా సమాధానాలివ్వటం కొంత కష్టం. అంతకన్నా చిన్న వయసు పిల్లలనుంచి సమాధానాలు రాబట్టడం అసాధ్యం. ఇప్పటికే 12–18 ఏళ్ల వారికి టీకాలం దించిన ఇజ్రాయెల్‌కు ఈ విషయంలో కొంత అనుభవముంది. బహుశా డేటా రూపకల్పనలో ఔషధ సంస్థలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉంటాయి.  పెద్దల టీకాల విషయంలోనే అనేకమందిలో ఇంకా సందేహాలున్నాయని, అందుకే అనేకులు వాటికి దూరంగా ఉన్నారని మరిచిపోకూడదు. ఆ పరిస్థితి పిల్లల టీకాల విషయంలో తలెత్తకూడదనుకుంటే, అంతా సజావుగా సాగిపోవాలనుకుంటే పారదర్శ కత ప్రాణప్రదమైనది. అది ప్రజానీకం హక్కు కూడా. 

ప్రభుత్వాలు ఎటూ పిల్లల టీకాలను కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే బయట కొనదల్చుకున్నవారికి సైతం అందుబాటులో ఉండేలా ఆ టీకాల ధర నిర్ణయించాలి. పౌరు లకు టీకాలందించే కార్యక్రమం మన దేశంలో జోరందుకుంది. అనేక రాష్ట్రాలు పట్టుదలగా దీన్ని కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జనాభాలో మూడొంతులమంది ఒక టీకా లేదా రెండు తీసు కున్నట్టవుతుంది. పిల్లలకిచ్చే టీకాలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకొచ్చి, సాధ్యమైనంత ఎక్కువమందికి అందించగలిగితే జనాభాలో అత్యధికులు సురక్షిత స్థితికి చేరుకున్నట్టవుతుంది. చదువులు మళ్లీ చురుకందుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement