న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 38.60 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించగా.. ఓ వైపు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా, మరో వైపు పలు రంగాలు కుదేలవగా, కొందరు ఉపాధులు కోల్పోయారు. చివరకు వైరస్‌తోనే గాక ఆకలితోనూ పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మాత్రమే మార్గమని కేంద్రం నిర్ణయించుకుని వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
దేశంలో ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు 35 కోట్లకు పైగా టీకాలను రాష్ట్రాలకు, యూటీలకు సరఫరా చేసినట్లు తెలిపింది. వీటికి అదనంగా రాష్ట్రాలకు మరో 11.25 లక్షల కోవిడ్ టీకా డోసులు పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇప్పటికే 1.44 కోట్ల కోవిడ్ టీకా డోసుల నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సార్వత్రికీకరణ జూన్ 21 నుంచి ప్రారంభమైంది.
దేశవ్యాప్త టీకా డ్రైవ్‌లో భాగంగా, భారత ప్రభుత్వం రాష్ట్రాలు, యూటీలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్రం ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపింది. తాజా డేటా ప్రకారం.. వినియోగించిన వ్యాక్సిన్ల డోసుల సంఖ్య వ్యర్థాలతో సహా కలిపి 37,16,47,625 డోసులని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment