నిషేధిత డ్రగ్ గుట్టు రట్టు
- 200కు పైగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల స్వాధీనం
- సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు
చంచల్‌గూడ: అధిక పాల కోసం పశువులకు ఇచ్చే నిషేధిత ఇంజెక్షన్లను జంటనగరాల్లోని మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం... కుర్మగూడ డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన ముక్త రాహుల్ (27) కొన్ని నెలలుగా నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్లను జంటనగరాల్లోని వెటర్నరీ మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నాడు.
విశ్వసనీయసమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు రాహుల్‌పై నిఘా పెట్టారు. గత సోమవారం అతను సికింద్రాబాద్‌లోని ఓ మెడికల్ హాల్‌కు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకొని భరత్‌నగర్‌లోని అతని ఇంట్లో సోదాలు చేయగా దాదాపు 200పైగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లు దొరికాయి. ఈ రాకెట్‌కు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.