Oxytocin injections
-
పాపం.. క్షీరదాలు!
అమ్మ పాలు అమృతం.. గేదె పాలు బలవర్థకం.. ఆవు పాలు ఔషధం.. కొందరికి ఖరము పాలు పథ్యం.. పాల కడిలి నుంచే కదా అమృతం పుట్టింది. అయితే ఇప్పుడు అలాంటి పాలను కాలకూట విషంగా మార్చేస్తున్నారు. స్వార్థ బుద్ధితో.. డబ్బుపై పేరాశతో చుట్టూ ఉన్నవారు చచ్చినా.. గేదెలు కృశించి పోయినా కావాల్సింది పచ్చనోట్లే.. వాటినే తింటారేమో.. ఛీ... సాక్షి, చీరాల (ప్రకాశం): అన్నింటి కంటే పాలు స్వచ్ఛంగా ఉంటాయని అందరి విశ్వాసం. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పాల వెనుక కూడా విషం అనే నిజం పడగెత్తుతోంది. తెల్లటి పాల నురగలో విషం కూడా దాగి ఉందనేని నమ్మశక్యం కాని నిజంగా మారింది. స్వార్థం కోసం పాలను విషతుల్యం చేస్తున్నారు. అవి తాగిన వారు అనేక వ్యాధులకు గురవుతుండగా పశువులు వ్యాధుల బారిన పడి కబేళాలకు తరలి వెళ్తున్నాయి. పశుపోషకులు, పాల ఉత్పత్తిదారులు గేదెల ఫాం యజమానులు పాల దిగుబడుల కోసం అర్రులు చాస్తున్నారు. దిగుబడులతో ఎక్కువ లాభాలను గడించాలనే ఆశతో పాడి గేదెలకు చెందిన దూడలని సరిపడా పాలు తాగనీయకుండా తల్లి నుంచి దూరం చేస్తున్నారు. దీంతో పిల్లలకు పాలు సరిపోక అనారోగ్యానికి గురై పుట్టిన కొన్ని నెలలకే మృత్యువాతపడుతున్నాయి. గేదెకు పొదుగు నుంచి రొమ్ముల వరకు పాలు రావాలంటే దూడ కొద్దిసేపు పొదుగు వద్ద సేపేందుకు (దూడ పాలు లాగడం) ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ దూడలు పాలు తాగేస్తున్నాయనే ఉద్దేశంతో వాటిని వెంటనే దూరం చేస్తున్నారు. దూడ లేకుంటే మిగులు పాలన్నీ అమ్మవచ్చనే దురాలోచనతో దూడ బదులు నిషేధిత డ్రగ్ అక్సోటాసిన్ ఇంజక్షన్లను రోజుకు రెండుసార్లు గేదెలకు వేసి మొత్తం పాలు పిండుతున్నారు. ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌లో అనేక రకాల హార్మోన్లుంటాయి. గేదె సేపాలంటే దూడ కనీసం పది నిమిషాల పాటు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ రూ.5ల విలువైన ఆక్సిటోసిన్ ఒక్క ఇంజక్షన్ వేస్తే చాలు క్షణాల్లో గేదెసేపి పూర్తి అయి పొదుగు నుంచి పాలు కారిపోతాయి. అంత ప్రమాదకర హర్మోన్లు ఉండే ఈ ఇంజక్షన్లను నోరులేని జీవాలు తట్టుకోవడం చాలా కష్టం అయినా అక్రమార్కులు తమ పని మానుకోవడంలేదు. ఆక్సిటోసిన్ పాలు తాగితే అనర్థాలు పాలు తాగితే ఆరోగ్యమంటారు. కానీ ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వాడిన గేదెల పాలు తాగితే అనేక అనర్థాలు వస్తాయని వైద్యులు అంటున్నారు. ప్రమాదకర హార్మోన్లు కలిసిన ఈ పాలు తాగితే క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయి. కళ్ల జబ్బులతో పాటు ఆడ పిల్లలు చిన్న వయస్సులోనే మెచ్యూర్ కావడం, వక్షోజాలు పెరగడంతో పాటు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన హార్మోన్లు ఉన్న ఈ ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను ప్రభుత్వం పదేళ్ల క్రితంమే నిషేధించింది. ప్రమాదకరమైన హార్మోన్లు ఉన్న ఈ ఇంజక్షన్లను పాడి గేదెలకు వేయడం వలన గేదెలు యదకు రాకపోవడం, గర్భసంచి వంటి జబ్బులతో పాటు తక్కువ కాలానికే ఆ గేదెలు చనిపోతున్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ.. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వాడిన గేదె పాలు తాగిన వారికి రోగాలతో పాటు పశువులు కూడా అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ ఇంజక్షన్లను ప్రభుత్వం నిషేధించింది. కానీ చాటుమాటున ఆ ఇంజక్షన్లు చెన్నై ద్వారా మన రాష్ట్రానికి తరలించి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. చీరాలలోని బెస్తపాలెం వద్ద ఉన్న ఒక పశువుల మెడికల్ షాపు, నల్లగాంధీ బొమ్మసెంటర్తో పాటు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇవి పుష్కలంగానే దొరుకుతున్నాయి. నిషేధిత డ్రగ్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయినా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మూమూళ్ల మత్తులో పడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పశువులకు ప్రమాదకరం ప్రొట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్లు తయారవుతాయి. ప్రమాదకరమైన హార్మోన్లు ఉండటం వలన గేదెలు తట్టుకోలేక ఎదకు రాకపోవడం, గర్భం దాల్చినా మధ్యలోనే చనిపోయిన దూడలను వదలడంతో పాటు గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు వదులై గర్భాశయ సమస్యలు ఏర్పడతాయి. - పశువైద్యాధికారి టి.శివారెడ్డి ప్రమాదకరం ఆక్సీటోసిన్ పాలలో రోగాలను కలుగజేసే క్రిములు చాలా ఉంటాయి. ఆ క్రిములు శరీరంలోకి వెళితే అనారోగ్య పాలవడం ఖాయం. అటువంటి ఇంజక్షన్లు గేదెలకు వేసిన క్షణంలోనే గేదె పొదుగు నిండి పాలు కారుతుంటాయి. – పి. జయమ్మ సహజసిద్ధమైన పాలు శ్రేష్టం సహజ సిద్ధమైన పాలను మాత్రమే తాగాలి. ముఖ్యంగా చిన్న బిడ్డలకు బయట దొరికే పాలను పట్టించకూడదు. ఇంజక్షన్లు వేసిన పాలు ప్రమాదకరం. అధికారులు తగిన చర్యలు తీసుకుని అక్రమార్కులను అరికట్టాలి. –పి. మాధవి -
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీ గుట్టురట్టు
కర్నూలు(హాస్పిటల్): నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గుట్టు రట్టు చేశారు. పశువులు పొదుగు నుంచి పాలు విడవటానికి వాడే ఈ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. అయితే కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి సొంతంగా ఇంట్లోనే బ్రాండ్ పేరు ఏమీ లేకుండా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు తయారు చేస్తూ దర్జాగా వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వలపన్ని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. అప్పుల నుంచి గట్టెక్కేందుకు అక్రమ మార్గం.. వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఎన్.ప్రసాద్ 20 ఏళ్ల క్రితమే కర్నూలు నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. కొన్నాళ్ల పాటు నంద్యాల రోడ్డులో దాణా వ్యాపారం చేసి జీవనం సాగించాడు. ఈ క్రమంలో అతనికి రియల్టర్ వీసీ రమణ పరిచయమయ్యాడు. అతని మాటలు నమ్మి సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకున్నాడు. వీసీ రమణ ఐపీ పెట్టడంతో ప్రసాద్ అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు కొన్నేళ్ల క్రితమే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీ ప్రారంభించాడు. లాలూ అనే వ్యక్తి నుంచి ఆక్సిటోసిన్ హార్మోన్ అనే కెమికల్, స్థానికంగా ఆక్టిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసి ఇంజెక్షన్లు తయారు చేయసాగాడు. రెండు లీటర్ల ఆక్సిటోసిన్, నాలుగు లీటర్ల ఆక్టిక్ యాసిడ్, 14 లీటర్ల నీళ్లు కలిపి మొత్తం 20 లీటర్ల ఆక్సిటోసిన్ మందును తయారు చేసి వాటిని బాటిళ్లలో నింపాడు. 100 ఎంఎల్ బాటిల్ అయితే రూ.60లు, 200 ఎంఎల్ బాటిల్ అయితే రూ.100లకు రైతులకు, పాలవ్యాపారులకు విక్రయించడం మొదలుపెట్టాడు. వలపన్ని పట్టుకున్న అధికారులు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు మద్దూర్‌నగర్‌లోని వీర నాగేశ్వరరావు అనే వ్యక్తి విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న ఔషధ నియంత్రణ శాఖ ఏడీ చంద్రశేఖర్‌రావు.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్ అలీ, విజయలక్ష్మి, హరిహరతేజల ఆధ్వర్యంలో దాడులకు ప్రణాళిక రూపొందించారు. ముందుగా మద్దూర్‌నగర్‌లో ఓ ఆక్సిటోసిన్ బాటిల్‌ను కొనుగోలు చేసి, దానిని ల్యాబ్‌కు పంపించారు. అందులో ఆక్సిటోసిన్ మందు ఉందని నిర్ధారణ కావడంతో నాగేశ్వరరావును అరెస్ట్ చేసి , అతను చెప్పిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక నంద్యాల రోడ్డులోని ఓ ఇంట్లో తయారవుతున్న ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను గుర్తించారు. అతని వద్ద పెద్ద ఎత్తున ఆక్సిటోసిన్ మందు, ఆక్టిక్ యాసిడ్, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తే 10 ఏళ్ల జైలు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ప్రసాద్‌పై డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాం. నేరం రుజువైతే అతడికి పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న పశువుల దాణాలపై నిఘా ఉంచి దాడులు కొనసాగిస్తాం. ఎవ్వరి వద్దైనా ఇంజెక్షన్లు లభిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. డెయిరీలు, రైతులు ఈ ఇంజెక్షన్లకు దూరంగా ఉండాలి. – చంద్రశేఖర్‌రావు, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ ఆక్సిటోసిన్ వల్ల మనుషులకు క్యాన్సర్ సాధారణంగా దూడను చూడగానే గేదెకు మిల్క్లెట్ డౌన్ హార్మోన్ విడుదలై పాలు విడుస్తుంది. దూడ చనిపోతే పాలు విడవడానికి గేదె ఇబ్బంది పడుతుంది. ఈ కారణంగానే రైతులు దానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వేసి పాలు పితుకుతారు. గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వేయడం వల్ల వచ్చిన పాలలో సదరు మందు కూడా ఉంటుంది. ఇది మనిషి శరీరంలోకి వెళ్లి తరచూ వాంతులకు గురికావడం, చర్మంపై కురుపులు రావడం, మరికొందరికి క్యాన్సర్ రావడం సంభవిస్తుంది. గేదెలకు కూడా కీళ్ల నొప్పులు వచ్చి అది జీవించే కాలం తగ్గిపోతుంది. – డాక్టర్ సతీష్‌కుమార్, పశువైద్యాధికారి, కర్నూలు -
పా‘పాలు’ ..కటకటాలు
సాక్షి, సిటీబ్యూరో: వెటర్నరీ వినియోగంలో నిషేధించిన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కృత్రిమంగా తయారు చేసి విక్రయిస్తున్న కార్ఖానాపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ప్రసూతి సమయంలో మహిళలకు వినియోగించే ఇంజెక్షన్లను పశువులకు వాడటానికి అనువుగా తయారు చేస్తున్న నిందితుడితో పాటు వీటిని మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తినీ అరెస్టు చేశారు. గేదెలు అధికంగా పాలు ఇవ్వడానికి ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నారని, నగరంతో పాటు శివార్లలో ఉన్న చిన్న డెయిరీ ఫామ్స్‌లో దాదాపు 70 శాతం వీటిని వినియోగిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. ఈ ఫామ్స్ నుంచి పాలు హోటల్స్‌తో పాటు టీస్టాల్స్‌కు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు గుర్తించామన్నారు. గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా తీసిన పాలు, ఆ పాల ఉత్పత్తులు తీసుకుంటే అనేక అనర్థాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ‘మధ్యవర్తిగా’ దందా... ఈదిబజార్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఖాలేద్ గతంలో ఎస్కే మెడికల్ ఏజెన్సీస్ పేరిట సర్జికల్ ఉపకరణాల సరఫరా వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ దందా చేశాడు. ఈ రెంటిలోనూ తగినంత ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఒకప్పుడు పశువులకు వినియోగించే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ప్రభుత్వం 2003లో నిషేధించింది. అప్పటి నుంచి అనేక మంది అక్రమంగా వీటిని సేకరించి విక్రయించడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోసిర్తో పరిచయమైంది. అతడి నుంచి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ఒక్కోటి రూ.25 చొప్పున ఖరీదు చేసి... మల్లేపల్లిలో బన్వారీలాల్ సురేష్ కుమార్ భన్సాల్ పేరుతో పశువులకు వినియోగించే ఉత్పత్తులు విక్రయించే బి.సురేష్ కుమార్ గుప్తకు రూ.50 చొప్పున అమ్మేవాడు. ఈ దందా చేస్తూ 2016లో రెండుసార్లు పోలీసులకు చిక్కి అరెస్టు అయ్యారు. ఈ కేసుల్లో బెయిల్‌పై వచ్చిన ఖాలేద్ గతేడాది అక్టోబర్‌లో చంపాపేట్ ప్రధాన రహదారిపై ‘అర్రుబ ట్రావెల్స్’ ఏర్పాటు చేసి నష్టాలు చవిచూశాడు. ‘గురువును’ తరిమేసి సొంతంగా... ఈ నేపథ్యంలోనే ఇతడికి గుజరాత్ నుంచి వచ్చి, పాతబస్తీలో ఉంటున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతను గేదెలకు వాడటానికి అవసరమైన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కృత్రిమంగా తయారు చేసి ఖాలేద్‌కు విక్రయించేవాడు. అతని ద్వారా తయారీ విధానాన్ని నేర్చుకున్న ఇతగాడు అతడిని బెదిరించి స్వస్థలానికి పంపేశాడు. ఆపై చంద్రాయణగుట్ట బండ్లగూడలో ఓ గదిని అద్దెకు తీసుకుని కార్ఖానా ఏర్పాటు చేశాడు. తనకు చెందిన ఎస్కే మెడికల్ ఏజెన్సీ పేరుతో అనేక మం దుల దుకాణాల నుంచి ప్రసూతి సమయంలో మ హిళలకు వాడే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఖరీదు చేసేవాడు. 300 ఎంఎల్ ఆక్సిటోసిన్‌లో 1200 ఎంఎల్ ఫినాల్ రసాయనం, కేజీ గళ్ళ ఉప్పు, 160 లీటర్ల నీరు కలిసి కృత్రిమ ఆక్సిటోసిన్ ద్రావణం తయారు చేస్తున్నాడు. దీనిని 140, 180, 200 ఎంఎల్ బాటిల్స్‌లో ప్యాక్ చేసి ఇంజెక్షన్ల రూపంలో సురేష్ ద్వారా విక్రయిస్తున్నాడు. 160 లీటర్లు ద్రావణం తయారు చేయడానికి వీరికి రూ.4 వేల వరకు ఖర్చవుతుండగా.. దాన్ని ఇంజెక్షన్స్‌గా మార్చి రూ.90 వేలకు అమ్ముతున్నారు. గరిష్టంగా ఏడాదిలో కొరగాకుండా... నగరంతో పాటు శివార్లలోనిని చిన్న చిన్న డెయిరీ ఫామ్స్ హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ల నుంచి గేదెలను ఖరీదు చేసుకుని వస్తున్నాయి. అక్కడి ఫామ్స్‌లో ఏళ్ల పాటు వినియోగించి, అవసానదశకు చేరిన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వీటికి దూడలు కూడా ఉండకపోవడంతో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ గేదెలకు పాలు తీసేముందు 4 ఎంఎల్ చొప్పున ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేస్తూ భారీగా పాలు పిండుతున్నారు. ఈ పంథాలో పాలిచ్చిన గేదెలు గరిష్టంగా ఏడాదికే వట్టిపోయి స్లాటర్ హౌస్‌లకు చేరాల్సి వస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి, వి.కిషోర్, పి.మల్లికార్జున్ ఆరు నెలలుగా నిఘా వేసి ఉంచారు. మంగళవారం కార్ఖానాపై దాడి చేసి ఖాలేద్‌ను, మల్లేపల్లిలోని దుకాణంపై దాడి చేసి సురేష్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి 1500 వందల కృత్రిమ ఇంజెక్షన్లు తదితరాలు స్వాధీనం చేసుకుని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. నిందితులపై చంద్రాయణగుట్ట, హబీబ్నగర్ల్లో కేసులు నమోదు చేయిస్తామని, పీడీ యాక్ట్ ప్రయోగానికి అవకాశాలు పరిశీలిస్తామని డీసీపీ తెలిపారు. -
డ్రగ్స్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రమాదకర ఆక్సిటోసిన్ లిక్విడ్‌ను అక్రమంగా తయారు చేస్తున్న ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నిషేదించిన ఆక్సిటోషన్‌ను మల్లెపల్లికి చెందిన సురేశ్‌కుమార్ బన్సాల్ అనే వ్యక్తి అక్రమంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నగరంలోని డైరీలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్‌ను అమ్ముతుంటారు. ఈ ఇంజెక్షన్‌ను గెదలకు ఇవ్వడం వల్ల పాల శాతం పెరుగుతుందని రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంజెక్షన్ చేసిన గెద పాలు తాగడం వల్ల చిన్న పిల్లల్లో హార్మోన్ ఎఫెక్ట్, మహిళలకు క్యాన్సర్ సోకడంతో పాటు గెదల జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ ముఠా నుంచి 1500 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిల్స్, మనుషులకు వాడే మూడు ఇంజక్షన్స్, మూడు సీలింగ్ మిసైన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 90వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సురేష్ కుమార్, షైక్ అబ్దుల్ ఖలీద్‌లపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణారావు ప్రకటించారు. -
‘పాల’కూట విషం
పాడి రైతులు తమ గేదెలుఈనగానే దానికి జన్మించిన దూడకుముందుగా పాలు విడుస్తారు. ఆదూడ తాగగా.. మిగిలిన పాలనుమాత్రమే పితికి వాడుకుంటారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణం వల్ల దూడ చనిపోతే దాని చర్మాన్ని తీసి,అందులో గడ్డి దూర్చి తల్లి పొదుగువద్ద ఉంచుతారు. తన పొదుగు వద్దదూడే వచ్చి నిలబడిందని భ్రమించిగేదె పాలు విడుస్తుంది. ఇది 30 ఏళ్లక్రితం నాటి మాట. ఇప్పుడు పరిస్థితిమారిపోయింది. మందులురావడంతో కొందరు పాడి రైతుల్లోనిర్లక్ష్యం పెరిగింది. కర్నూలు (హాస్పిటల్) : గేదెను మచ్చిక చేసుకోవడం మాని, త్వరగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమాదకరమైన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ వేస్తున్నారు. వీటి పాలు తాగిన వారు వ్యాధుల బారిన పడుతున్నారు. గేదెలు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను నిషేధించింది. అయినా జిల్లాలో వ్యాపారులు వీటిని దొడ్డిదారిన తెచ్చి విక్రయిస్తున్నారు. కొందరు రైతులు త్వరగా పాలు పితకాలన్న ఆత్రుతతో గేదెలకు ఈ ఇంజెక్షన్లు వేస్తున్నారు. గతంలో దూడ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లోనే.. అదీ పశువైద్యాధికారి సూచన మేరకు మాత్రమే గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అయితే.. ఇరవై ఏళ్ల నుంచి వీటి వినియోగం క్రమేణా పెరుగుతూ వచ్చింది. జిల్లాలో 4,11,000 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 15 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. పాడి గేదెలు ఎక్కువగా ఉన్న కొందరు రైతులు, డెయిరీ కేంద్రాలు నిర్వహించే ప్రాంతాల్లో ఆక్సిటోసిన్ వినియోగం అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల, డోన్, బేతంచర్ల, ఓర్వకల్లు, బనగానపల్లి, చాగలమర్రి, ఆళ్లగడ్డ, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, శ్రీశైలం, దేవనకొండ, నందికొట్కూరు, రుద్రవరం, అవుకు, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో కొందరు పాడి రైతులు వీటిని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాలు తాగినవారు జీర్ణకోశ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌కు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రైతులను చైతన్యపరిచి ఇంజెక్షన్ల వాడకాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. నిషేధించినా ఆగని విక్రయాలు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్‌ను మనుషులకు, పశువులకు వేర్వేరుగా వాడతారు. గర్భిణులు సుఖప్రసవం అయ్యేందుకు గాను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని నిపుణుల సలహా మేరకు వాడుతుంటారు. దీనివల్ల ప్రసవ ద్వారంలోని కండరాలు వదులుగా మారి బిడ్డ బయటకు రావడానికి సులభమవుతుంది. అలాగే గేదెలకు సేపు కోసం, పాల దిగుబడి పెంచేందుకు, ఎక్కువ కాలం పాలు ఇచ్చేందుకు వీటిని వేస్తున్నారు.ఈ ఇంజెక్షన్ వేసిన కొన్ని సెకన్లకే పొదుగులోని కండరాల్లో కదలిక వచ్చి గేదె పాలు విడుస్తుంది. సాధార ణంగా ఈత తర్వాత గేదె ఆరు నెలల పాటు పాలిస్తుంది. అదే ఈ ఇంజెక్షన్ నిరంతరం వాడటం వల్ల ఆరు నెలల తర్వాత కూడా పాలు పితుక్కునే అవకాశం ఉంది. దూడను వదిలేస్తే అది ఎక్కువగా పాలు తాగుతుందని భయపడి కొందరు రైతులు ఇంజెక్షన్లపై ఆధారపడుతున్నారు. దీనిని వాడటం వల్ల అటు గేదెలకు, ఇటు మనుషులకు వ్యాధులు వస్తాయని భావించి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే నిషేధించింది. అయినా జిల్లాలోని వ్యాపారులు దొడ్డిదారిన వీటిని తెచ్చి విక్రయిస్తున్నారు. గేదెలు అధికంగా ఉండే ప్రాంతాల్లోని కిరాణాదుకాణాలు, దాణా విక్రయ అంగళ్లు, మెడికల్‌షాపుల్లో వీటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. పాతికేళ్ల క్రితం గేదెకు ఒక యాంపిల్ వేస్తే పాలు విడిచేది. కానీ ఇప్పుడు ఒకేసారి మూడు యాంపిల్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గేదెల పునరుత్పత్తి దెబ్బతింటుంది ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన గేదె పాలు తాగడం వల్ల మనుషులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందువల్లే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మెడికల్ స్టోర్లలో అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇంజెక్షన్ వాడటం వల్ల గేదె ఆ తర్వాత ఎదకు రాదు. గర్భం దాల్చకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. లాభం కంటే నష్టమే ఎక్కువ. – డాక్టర్ అచ్చెన్న, పశువైద్యాధికారి, డోన్ -
‘ఆక్సిటోసిన్’..పక్కదారి!
అడ్డగోలుగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల వాడకం మనుషులకు, గేదెలకు నష్టం దాణా, పాల కేంద్రాలలో అక్రమ అమ్మకాలు పట్టించుకోని అధికారులు నర్సాపూర్ గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వాడుతూ కొందరు పాడి రైతులు మనుషుల ప్రాణాలపై చెలగాడమాడుతున్నారు. దూడలు చనిపోయిన తర్వాత గేదెలు పాలు ఇవ్వకపోవడంతో వైద్యుల సలహామేరకు పశువులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ కొందరు ఇష్టమొచ్చినట్లుగా వాడుతున్నారు. పశు వైద్యుల సలహాల మేరకు వాడాల్సిన మందులను తోసిపుచ్చి దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అక్రమ వ్యాపారం మూడు ఇంజక్షన్లు ఆరు లీటర్ల పాలుగా కొనసాగుతోంది. ఇంజక్షన్ల అమ్మకాల జోరు ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్పైనే విక్రయించాలి. అయితే మెడికల్ షాపు నిర్వాహకులు నేరుగా పాడిరైతులకు అమ్ముతున్నారు. దానాదుకాణాలను, పాల కొనుగోలు కేంద్రాలను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయక పోవడంతో వ్యాపారులు అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. గతంలో తక్కువ మోతాదులో ఇంజక్షన్ ఆంపిల్స్ వచ్చేవని, దానిని కొనుగోలు చేయాలంటే ఎక్కువ ఖర్చు రావడంతో ప్రస్తుతం 50,100 మి.లీ సామర్థ్యం మందు బాటిళ్లు వస్తున్నాయి. కాగా దానా, పాల కేంద్రాలలో అమ్మే మందు బాటిళ్లపై ఎలాంటి పేరు లేకుండా ఇంజక్షన్ బాటిళ్లు అమ్మడం గమనార్హం. మందు బాటిళ్లపై వాటి పేరు, తయారి తేదీ, వాడకానికి చివరి తేదీ అలాంటి ఏ సమాచారం లేకుండా వస్తున్న మందు బాటిళ్లను గుడ్డిగా అమ్ముతూ మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. వైద్యుల సలహాతోనే వాడాలి.. ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అనేది హార్మోను ఇంజక్షన్. వీటిని గేదెలకు వాడడంతో వాటితో పాటు మనుషులకు నష్టం కల్గుతుందని ఆయా రంగాల నిపుణులు అంటున్నారు. గైనకాలజిస్టులు మహిళలకు డెలివరీ సమయంలో అవసరాన్ని బట్టి 1 లేదా రెండు ఎం.ఎల్ ఇంజక్షన్‌ను వాడుతుంటారు. ఇదిలాఉండగా ఆక్సిటోసిన్ హార్మోను ఇంజక్షన్ కావడంతో పాడి పశువులకు సైతం వైద్యులు అవసరం మేరకు వాడుతుంటారు. దూడలు చనిపోయినపుడు చాలా గేదెలు పాలు ఇవ్వవు. అలాంటి గేదెలకు వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఇంజక్షన్ చేస్తే అవి పాలు ఇవ్వడానికి అలవాటు పడి రోజూ పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా చాలామంది అపోహలకు పోయి రోజూ ఇంజక్షన్ చేస్తున్నారు. మనుషులపై దుష్ర్పభావం.. పాడి గేదెలకు రైతులు ఆక్సిటోసిన్ ఎక్కువ వాడడంతో అనేక నష్టాలున్నాయి. ఇంజక్షన్ వాడిన గేదెల నుంచి పితికిన పాలు తాగితే ఆ పాలు ప్రధానంగా బాలికలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అన్ని వర్గాల మనుషులపై సైతం దుష్ర్పభావాలు చూపుతాయి. అలాంటి పాలు తాగిన బాలికలలో హార్మోన్ల బ్యాలెన్సు దెబ్బతిని పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మహిళల గర్భసంచిపై ప్రభావం చూపుతాయి. తల్లి పాలు లేని చిన్న పిల్లలకు అలాంటి పాలు తాగిస్తే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. - డాక్టర్ నరసింహారెడ్డి, సర్జన్ గేదెలకు నష్టమే.. ఇంజక్షన్‌ను ఎక్కువగా వాడడంతో గేదెల ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుంది. దూడలు చనిపోయిన గేదెలు పాలు ఇవ్వనట్లయితే వాటికి అలవాటయ్యేంత వరకు ఒకటి, రెండు రోజులు ఇంజక్షన్ చేయాలె.. తప్ప రోజూ ఇవ్వడంతో గేదె ఆరోగ్యం దెబ్బతిని పాల దిగుబడి తగ్గుతుంది. రోజు ఇంజక్షన్ చేస్తే గేదెలు సకాలంలో ఎదకు రావు. వాటిలో రోగ నిరోధక శక్తి తగ్గి అస్వస్థతకు గురవుతాయి. - డాక్టర్ శ్రీకాంత్, పశువైద్యాధికారి -
నిషేధిత డ్రగ్ గుట్టు రట్టు
200కు పైగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల స్వాధీనం సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు చంచల్‌గూడ: అధిక పాల కోసం పశువులకు ఇచ్చే నిషేధిత ఇంజెక్షన్లను జంటనగరాల్లోని మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం... కుర్మగూడ డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన ముక్త రాహుల్ (27) కొన్ని నెలలుగా నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్లను జంటనగరాల్లోని వెటర్నరీ మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయసమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు రాహుల్‌పై నిఘా పెట్టారు. గత సోమవారం అతను సికింద్రాబాద్‌లోని ఓ మెడికల్ హాల్‌కు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకొని భరత్‌నగర్‌లోని అతని ఇంట్లో సోదాలు చేయగా దాదాపు 200పైగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లు దొరికాయి. ఈ రాకెట్‌కు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.