వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాధాకిషన్ రావ్
సాక్షి, సిటీబ్యూరో: వెటర్నరీ వినియోగంలో నిషేధించిన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కృత్రిమంగా తయారు చేసి విక్రయిస్తున్న కార్ఖానాపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ప్రసూతి సమయంలో మహిళలకు వినియోగించే ఇంజెక్షన్లను పశువులకు వాడటానికి అనువుగా తయారు చేస్తున్న నిందితుడితో పాటు వీటిని మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తినీ అరెస్టు చేశారు. గేదెలు అధికంగా పాలు ఇవ్వడానికి ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నారని, నగరంతో పాటు శివార్లలో ఉన్న చిన్న డెయిరీ ఫామ్స్‌లో దాదాపు 70 శాతం వీటిని వినియోగిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. ఈ ఫామ్స్ నుంచి పాలు హోటల్స్‌తో పాటు టీస్టాల్స్‌కు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు గుర్తించామన్నారు. గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా తీసిన పాలు, ఆ పాల ఉత్పత్తులు తీసుకుంటే అనేక అనర్థాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో ‘మధ్యవర్తిగా’ దందా...
ఈదిబజార్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఖాలేద్ గతంలో ఎస్‌కే మెడికల్ ఏజెన్సీస్ పేరిట సర్జికల్ ఉపకరణాల సరఫరా వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ దందా చేశాడు. ఈ రెంటిలోనూ తగినంత ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఒకప్పుడు పశువులకు వినియోగించే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ప్రభుత్వం 2003లో నిషేధించింది. అప్పటి నుంచి అనేక మంది అక్రమంగా వీటిని సేకరించి విక్రయించడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోసిర్‌తో పరిచయమైంది. అతడి నుంచి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ఒక్కోటి రూ.25 చొప్పున ఖరీదు చేసి... మల్లేపల్లిలో బన్వారీలాల్ సురేష్ కుమార్ భన్సాల్ పేరుతో పశువులకు వినియోగించే ఉత్పత్తులు విక్రయించే బి.సురేష్ కుమార్ గుప్తకు రూ.50 చొప్పున అమ్మేవాడు. ఈ దందా చేస్తూ 2016లో రెండుసార్లు పోలీసులకు చిక్కి అరెస్టు అయ్యారు. ఈ కేసుల్లో బెయిల్‌పై వచ్చిన ఖాలేద్ గతేడాది అక్టోబర్‌లో చంపాపేట్ ప్రధాన రహదారిపై ‘అర్రుబ ట్రావెల్స్’ ఏర్పాటు చేసి నష్టాలు చవిచూశాడు.
‘గురువును’ తరిమేసి సొంతంగా...
ఈ నేపథ్యంలోనే ఇతడికి గుజరాత్ నుంచి వచ్చి, పాతబస్తీలో ఉంటున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతను గేదెలకు వాడటానికి అవసరమైన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కృత్రిమంగా తయారు చేసి ఖాలేద్‌కు విక్రయించేవాడు. అతని ద్వారా తయారీ విధానాన్ని నేర్చుకున్న ఇతగాడు అతడిని బెదిరించి స్వస్థలానికి పంపేశాడు. ఆపై చంద్రాయణగుట్ట బండ్లగూడలో ఓ గదిని అద్దెకు తీసుకుని కార్ఖానా ఏర్పాటు చేశాడు. తనకు చెందిన ఎస్‌కే మెడికల్ ఏజెన్సీ పేరుతో అనేక మం దుల దుకాణాల నుంచి ప్రసూతి సమయంలో మ హిళలకు వాడే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఖరీదు చేసేవాడు. 300 ఎంఎల్ ఆక్సిటోసిన్‌లో 1200 ఎంఎల్ ఫినాల్ రసాయనం, కేజీ గళ్ళ ఉప్పు, 160 లీటర్ల నీరు కలిసి కృత్రిమ ఆక్సిటోసిన్ ద్రావణం తయారు చేస్తున్నాడు. దీనిని 140, 180, 200 ఎంఎల్ బాటిల్స్‌లో ప్యాక్ చేసి ఇంజెక్షన్ల రూపంలో సురేష్ ద్వారా విక్రయిస్తున్నాడు. 160 లీటర్లు ద్రావణం తయారు చేయడానికి వీరికి రూ.4 వేల వరకు ఖర్చవుతుండగా.. దాన్ని ఇంజెక్షన్స్‌గా మార్చి రూ.90 వేలకు అమ్ముతున్నారు.
గరిష్టంగా ఏడాదిలో కొరగాకుండా...
నగరంతో పాటు శివార్లలోనిని చిన్న చిన్న డెయిరీ ఫామ్స్ హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ల నుంచి గేదెలను ఖరీదు చేసుకుని వస్తున్నాయి. అక్కడి ఫామ్స్‌లో ఏళ్ల పాటు వినియోగించి, అవసానదశకు చేరిన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వీటికి దూడలు కూడా ఉండకపోవడంతో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ గేదెలకు పాలు తీసేముందు 4 ఎంఎల్ చొప్పున ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేస్తూ భారీగా పాలు పిండుతున్నారు. ఈ పంథాలో పాలిచ్చిన గేదెలు గరిష్టంగా ఏడాదికే వట్టిపోయి స్లాటర్ హౌస్‌లకు చేరాల్సి వస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి, వి.కిషోర్, పి.మల్లికార్జున్ ఆరు నెలలుగా నిఘా వేసి ఉంచారు. మంగళవారం కార్ఖానాపై దాడి చేసి ఖాలేద్‌ను, మల్లేపల్లిలోని దుకాణంపై దాడి చేసి సురేష్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి 1500 వందల కృత్రిమ ఇంజెక్షన్లు తదితరాలు స్వాధీనం చేసుకుని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. నిందితులపై చంద్రాయణగుట్ట, హబీబ్‌నగర్‌ల్లో కేసులు నమోదు చేయిస్తామని, పీడీ యాక్ట్ ప్రయోగానికి అవకాశాలు పరిశీలిస్తామని డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment