అడ్డగోలుగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల వాడకం
మనుషులకు, గేదెలకు నష్టం
దాణా, పాల కేంద్రాలలో అక్రమ అమ్మకాలు
పట్టించుకోని అధికారులు
నర్సాపూర్ గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వాడుతూ కొందరు పాడి రైతులు మనుషుల ప్రాణాలపై చెలగాడమాడుతున్నారు. దూడలు చనిపోయిన తర్వాత గేదెలు పాలు ఇవ్వకపోవడంతో వైద్యుల సలహామేరకు పశువులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ కొందరు ఇష్టమొచ్చినట్లుగా వాడుతున్నారు. పశు వైద్యుల సలహాల మేరకు వాడాల్సిన మందులను తోసిపుచ్చి దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అక్రమ వ్యాపారం మూడు ఇంజక్షన్లు ఆరు లీటర్ల పాలుగా కొనసాగుతోంది.
ఇంజక్షన్ల అమ్మకాల జోరు
ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్‌పైనే విక్రయించాలి. అయితే మెడికల్ షాపు నిర్వాహకులు నేరుగా పాడిరైతులకు అమ్ముతున్నారు. దానాదుకాణాలను, పాల కొనుగోలు కేంద్రాలను ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేయక పోవడంతో వ్యాపారులు అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. గతంలో తక్కువ మోతాదులో ఇంజక్షన్ ఆంపిల్స్ వచ్చేవని, దానిని కొనుగోలు చేయాలంటే ఎక్కువ ఖర్చు రావడంతో ప్రస్తుతం 50,100 మి.లీ సామర్థ్యం మందు బాటిళ్లు వస్తున్నాయి. కాగా దానా, పాల కేంద్రాలలో అమ్మే మందు బాటిళ్లపై ఎలాంటి పేరు లేకుండా ఇంజక్షన్ బాటిళ్లు అమ్మడం గమనార్హం. మందు బాటిళ్లపై వాటి పేరు, తయారి తేదీ, వాడకానికి చివరి తేదీ అలాంటి ఏ సమాచారం లేకుండా వస్తున్న మందు బాటిళ్లను గుడ్డిగా అమ్ముతూ మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు.
వైద్యుల సలహాతోనే వాడాలి..
ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అనేది హార్మోను ఇంజక్షన్. వీటిని గేదెలకు వాడడంతో వాటితో పాటు మనుషులకు నష్టం కల్గుతుందని ఆయా రంగాల నిపుణులు అంటున్నారు. గైనకాలజిస్టులు మహిళలకు డెలివరీ సమయంలో అవసరాన్ని బట్టి 1 లేదా రెండు ఎం.ఎల్ ఇంజక్షన్‌ను వాడుతుంటారు. ఇదిలాఉండగా ఆక్సిటోసిన్ హార్మోను ఇంజక్షన్ కావడంతో పాడి పశువులకు సైతం వైద్యులు అవసరం మేరకు వాడుతుంటారు. దూడలు చనిపోయినపుడు చాలా గేదెలు పాలు ఇవ్వవు. అలాంటి గేదెలకు వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఇంజక్షన్ చేస్తే అవి పాలు ఇవ్వడానికి అలవాటు పడి రోజూ పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా చాలామంది అపోహలకు పోయి రోజూ ఇంజక్షన్ చేస్తున్నారు.
మనుషులపై దుష్ర్పభావం..
పాడి గేదెలకు రైతులు ఆక్సిటోసిన్ ఎక్కువ వాడడంతో అనేక నష్టాలున్నాయి. ఇంజక్షన్ వాడిన గేదెల నుంచి పితికిన పాలు తాగితే ఆ పాలు ప్రధానంగా బాలికలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అన్ని వర్గాల మనుషులపై సైతం దుష్ర్పభావాలు చూపుతాయి. అలాంటి పాలు తాగిన బాలికలలో హార్మోన్ల బ్యాలెన్సు దెబ్బతిని పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మహిళల గర్భసంచిపై ప్రభావం చూపుతాయి. తల్లి పాలు లేని చిన్న పిల్లలకు అలాంటి పాలు తాగిస్తే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది.
- డాక్టర్ నరసింహారెడ్డి, సర్జన్
గేదెలకు నష్టమే..
ఇంజక్షన్‌ను ఎక్కువగా వాడడంతో గేదెల ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుంది. దూడలు చనిపోయిన గేదెలు పాలు ఇవ్వనట్లయితే వాటికి అలవాటయ్యేంత వరకు ఒకటి, రెండు రోజులు ఇంజక్షన్ చేయాలె.. తప్ప రోజూ ఇవ్వడంతో గేదె ఆరోగ్యం దెబ్బతిని పాల దిగుబడి తగ్గుతుంది. రోజు ఇంజక్షన్ చేస్తే గేదెలు సకాలంలో ఎదకు రావు. వాటిలో రోగ నిరోధక శక్తి తగ్గి అస్వస్థతకు గురవుతాయి.
- డాక్టర్ శ్రీకాంత్, పశువైద్యాధికారి
‘ఆక్సిటోసిన్’..పక్కదారి!
Published Sat, Aug 1 2015 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement