కల్తీకి ఆస్కారం లేదని నిర్వాహకుల స్పష్టికరణ
జూన్, జూలైలో మాత్రమే తిరుమలకు నెయ్యి సరఫరా
అన్ని రకాల తనిఖీ, పరిశీలన సర్టీఫికెట్లు ఉన్నాయని వెల్లడి
సాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శనివారం సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. తిరుమలకు సరఫరా అయింది ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యేనన్న సమాచారంతో దిండుగల్‌లోని ఆ ఉత్పత్తి కేంద్రంపై అందరి దృష్టి పడింది. దీంతో శుక్రవారం రాత్రి తమిళనాడు ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిత ఆ పరిశ్రమలో తనిఖీలు చేసి, వ్యర్థ జలాలను పరిశీలనకు తీసుకెళ్లారు.
అదే సమయంలో శనివారం సెంట్రల్ ఫుడ్ సేప్టీ అధికారి ఒకరితో పాటు మరి కొందరు సిబ్బంది ఆ పరిశ్రమలో సోదాలు చేశారు. ఏఆర్ డెయిరీకి చెందిన పాలు, నెయ్యి, పనీర్, వెన్న, పెరుగు, మజ్జిగ, స్వీట్లు తదితర ఉత్పత్తులను 2 గంటలకుపైగా పరిశోధించారు. వీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లారు. అదే సమయంలో ఏఆర్ డెయిరీ కంపెనీ తరఫున క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు లెని, కన్నన్ మీడియా ముందుకు వచ్చారు. తమ ఉత్పత్తులలో కల్తీకి ఆస్కారం లేదని, ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చని సూచించారు.
తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించే ముందు పరిశీలించి, అందుకు సంబంధించిన సర్టీఫికెట్లను సిద్ధం చేస్తామని వివరించారు. జూన్, జూలై నెలల్లో పంపించామని, ఇప్పుడు అక్కడకు సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ పేరు బహిరంగంగా చెప్పనప్పటికీ, జరుగుతున్న పరిణామాలను చూసి వివరణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తమ ఉత్పత్తులు అన్ని చోట్ల ఉన్నాయని, ఏ సమయంలోనైనా సరే తనిఖీలు చేసుకోవచ్చునని సూచించారు. 16 వేల టన్నులను ఆ రెండు నెలలు నిరంతరాయంగా పంపిణీ చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల తనిఖీ, పరిశీలన సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment