సాక్షి, అమరావతి: డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దశాబ్దాలుగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వాల తీరుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరిని కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. ఇటీవల అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా 2021లో డ్రగ్స్ అక్రమ వ్యాపారంపై దేశంలో వివిధ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను సమీక్షించింది.
గల్ఫ్ దేశాల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ అత్యధికంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ తదితర పశ్చిమ రాష్ట్రాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు ముఖద్వారంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కఠిన చర్యలు చేపట్టడంలేదని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. కానీ, వాటికంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ విధానాలను అవలంబిస్తోందని పేర్కొంది. గంజాయి, ఇతర డ్రగ్స్ దందాపై ఉదాశీనంగా ఉండడంవల్లే ఇతర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ, ఏపీలో మాత్రం పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తూ భారీగా కేసులు నమోదు చేస్తూ దీర్ఘకాలిక వ్యూహంతో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ సత్ఫలితాలిస్తోందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
కేసుల నమోదు,అరెస్టుల్లోనూ అగ్రస్థానమే
ఇక 2021లో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న వారిపై దేశంలో వివిధ రాష్ట్రాలు నమోదు చేసిన కేసులు, నిందితుల అరెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ఏకంగా 4,144 మందిపై కేసులు నమోదు చేసింది. వారిలో 2,565 మందిని అరెస్టుచేసింది. డ్రగ్స్ దందాకు పాల్పడే వారిని వివిధ రాష్ట్రాలు చేసిన అరెస్టుల వివరాలిలా..
సెబ్ దూకుడు.. గంజాయి, ఇతర డ్రగ్స్ మాఫియాపైగత దశాబ్దంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. పరోక్షంగా గంజాయి, డ్రగ్స్ దందాకు కొమ్ముకాశాయి. అందుకే అప్పట్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లిప్తంగా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ, అందుకు భిన్నంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి ఒత్తిళ్లకు అవకాశమివ్వకుండా స్మగ్లర్లపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తూ ఎడాపెడా కేసులు నమోదు చేసి డ్రగ్స్ మాఫియాను బెంబేలెత్తిస్తోంది.
ఏకంగా 7,405 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసి రూ.9వేల కోట్ల విలువైన 3.70కోట్ల గంజాయి మొక్కలను పెకలించి దహనం చేసింది. 2021లో గంజాయి, డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న 2,164 కేసులు నమోదు చేసింది. 4,144మందిపై కేసులు నమోదు చేసి వారిలో ఇప్పటికే 2,565 మందిని అరెస్టు చేసింది. 2010 నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో అణచివేయడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment