ఫైజర్, అలెర్గాన్ విలీనం... | Pfizer seals $160bn Allergan deal to create drugs giant | Sakshi
Sakshi News home page

ఫైజర్, అలెర్గాన్ విలీనం...

Published Tue, Nov 24 2015 12:26 AM | Last Updated on Fri, May 25 2018 2:47 PM

ఫైజర్, అలెర్గాన్ విలీనం... - Sakshi

ఫైజర్, అలెర్గాన్ విలీనం...

ఫార్మా రంగంలో అతి పెద్ద డీల్    
* ప్రపంచంలోనే నంబర్ వన్ ఔషధ సంస్థ ఆవిర్భావం
* ఒప్పందం విలువ  దాదాపు రూ. 10,40,000 కోట్లు
 న్యూయార్క్: ఫార్మా రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీస్తూ బొటాక్స్ తయారీ సంస్థ అలెర్గాన్, వయాగ్రా ఉత్పత్తి చేసే అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్ విలీనం కానున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు 160 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 10,40,000 కోట్లు) ఉండనుంది. తద్వారా ప్రపంచంలోనే నంబర్ వన్ ఫార్మా సంస్థ ఏర్పాటు కానుంది.

ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు రెండు కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. డీల్ ప్రకారం ఇరు సంస్థల వ్యాపారాలను అలెర్గాన్ కింద విలీనం చేస్తారు. విలీనానంతరం ఏర్పడే కొత్త సంస్థను ఫైజర్‌గా వ్యవహరించనున్నారు. రెండు సంస్థల వార్షికాదాయం 60 బిలియన్ డాలర్ల పైగా ఉండనుంది. 40 బిలియన్ డాలర్ల వార్షికాదాయంతో మరో ఔషధ సంస్థ మెర్క్ రెండో స్థానానికి పరిమితం కానుంది.

ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న సుమారు 100 పైగా ఉత్పత్తులు అందుబాటులోకి వస్తే ఫైజర్‌కు 2018 నుంచి మరో 25 బిలియన్ డాలర్ల వార్షికాదాయం సమకూరగలదని అంచనా. 116 బిలియన్ డాలర్లతో 2000లో వార్నర్-లాంబర్ట్‌ను ఫైజర్ కంపెనీ కొనుగోలు చేసిన డీల్ కన్నా తాజా ఒప్పందం మరింత భారీది కావడం గమనార్హం.  వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా.

ఈ రెండు సంస్థల ఉత్పత్తులకూ భారత్‌లో గణనీయమైన అమ్మకాలు ఉన్నాయి. విస్తృత పరిశోధనలతో మరిన్ని ఔషధాల రూపకల్పనకు ఇరు కంపెనీల కలయిక తోడ్పడగలదని ఫైజర్ చైర్మన్ ఇయాన్ రీడ్ వ్యాఖ్యానించారు. జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చేందుకు రెండు సంస్థల భాగస్వామ్యం ఉపయోగపడగలదని అలెర్గాన్ సీఈవో బ్రెంట్ శాండర్స్ పేర్కొన్నారు.
 
పన్ను ప్రయోజనాలు..

సాంకేతికంగా అలెర్గాన్.. తనకన్నా పెద్దదైన ఫైజర్‌ను కొనుగోలు చేసినట్లవుతుంది. ఫైజర్ అమెరికన్ కంపెనీ కాగా అలెర్గాన్.. ఐర్లాండ్‌కు చెందిన సంస్థ. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఫైజర్ సంస్థ పన్ను ప్రయోజనాలు పొందే దిశగా.. ప్రధాన కార్యాలయాన్ని ఐర్లాండ్‌కు మార్చుకోనుంది. దీంతో అమెరికాలో 35 శాతం కార్పొరేట్ ట్యాక్స్ భారం నుంచి ఫైజర్ తప్పించుకోవీలవుతుంది. ఐర్లాండ్‌లో ఈ పన్ను రేటు 12.5 శాతమే.
 
ఒప్పందం స్వరూపం ఇది ..
ఇరు కంపెనీలు కుదుర్చుకున్న విలీన ఒప్పంద ప్రకారం విలీనం అనంతరం ఏర్పడే సంయుక్త కంపెనీలో.. అలెర్గాన్ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న ఒక్కో షేరుకు ప్రతిగా 11.3 షేర్లు లభిస్తాయి. ఫైజర్ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న షేరు ఒక్కింటికి ఒక్కటి చొప్పున దక్కుతుంది. ఈ లావాదేవీ స్టాక్ మార్పిడి రూపంలో ఉండనుంది. ఫైజర్ ఇన్వెస్టర్లు కావాలనుకుంటే తమ షేర్లకు బదులుగా నగదును పొందే వీలుంది. అయితే, ఇందుకోసం మొత్తం నగదు చెల్లింపులు 6 బిలియన్ డాలర్ల పైగా, 12 బిలియన్ డాలర్ల లోపు ఉండాలి.

డీల్ కోసం అక్టోబర్ 28 నాటి షేరు ధరతో పోలిస్తే 30 శాతం అధికంగా స్టాక్స్ విలువను నిర్ణయించారు. దీని ప్రకారం  అలెర్గాన్ షేరు ధర ఒక్కోటి 363.63 డాలర్లుగా, ఫైజర్ షేరు ధర 32.18 డాలర్లుగా లెక్కించారు. షేరు ధర లెక్క ప్రకారం అలెర్గాన్ సంస్థ విలువ 160 బిలియన్ డాలర్లు కానుంది.  ప్రస్తుతం ఫైజర్ చైర్మన్‌గా ఉన్న ఇయాన్ రీడ్.. ఇకపైన సంయుక్త కంపెనీకి చైర్మన్, సీఈవోగా వ్యవహరిస్తారు.

అలెర్గాన్ సీఈవో బ్రెంట్ సాండర్స్.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ప్రెసిడెంట్‌గా ఉంటారు. ఫైజర్ పీఎల్‌సీ షేర్లను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేయాలని సంస్థలు యోచిస్తున్నాయి. ఫైజర్ పీఎల్‌సీలో 15 మంది డెరైక్టర్లు ఉంటారు. వీరిలో 11 మంది ఫైజర్‌కి చెందిన వారు, మిగతా నలుగురు అలెర్గాన్‌కి చెందిన వారు ఉంటారు.
 
ఇరు కంపెనీల కీలక ఉత్పత్తులు..

వయాగ్రాతో పాటు లైరికా, ప్రెవ్‌నార్ తదితర ఔషధాలను ఫైజర్ తయారు చేస్తోంది. మరోవైపు, కాస్మొటిక్ మెడికేషన్ బొటాక్స్‌తో పాటు అల్జీమర్స్ చికిత్సలో ఉపయోగించే నమెండా మొదలైన వాటిని అలెర్గాన్ ఉత్పత్తి చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement