
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ చికిత్సకు అనుమతులు ఉన్న ఆస్పత్రులకే రెమ్‌డెసివిర్ మందులను సరఫరా చేయాలని ఔషధ నియంత్రణ శాఖ హోల్‌సేల్, రిటైలర్లను ఆదేశించింది. ఈమేరకు ఔషధ నియంత్రణ శాఖ డీజీ రవిశంకర్ నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అన్నీ సీఅండ్‌ఎఫ్ ఏజెన్సీలు, హోల్‌సేల్, రిటైల్ షాపులకు వచ్చే రెమ్‌డెసివిర్ మందుల వివరాలను సేకరించనున్నారు. ప్రతి సోమవారం, గురువారం ఆయా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు.. తమ పరిధిలో ఉన్న షాపుల నుంచి కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు సేకరిస్తారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా అనుమతి లేని ఆస్పత్రులకు సరఫరా చేయడం కుదరదని, కోవిడ్ పేషెంట్లను చేర్చుకుని సేవలందిస్తున్న ఆస్పత్రులకే రెమ్‌డెసివిర్ ఇవ్వాలని నిబంధన విధించారు.
ఎక్కడైనా సీఅండ్‌ఎఫ్ స్టాకిస్ట్‌లు, హోల్‌సేలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడరు. గతంలో కోవిడ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరఫరా చేసుకునేందుకు వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి నిర్దేశించిన ఆస్పత్రులకే సరఫరా చేయాలని నిబంధన విధించినట్టు ఔషధ నియంత్రణ శాఖ సంచాలకులు ఎంబీఆర్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఎక్కడైనా రెమ్‌డెసివిర్, అజిత్రోమైసిన్ మందులు స్టాకు లేనప్పుడు స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. ఫోన్ వివరాలు ఔషధ నియంత్రణ శాఖ వెబ్‌సైట్ http//dca.ap.nic.inలో చూడచ్చన్నారు.