
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి నిబంధనను ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రాత్రి కర్ఫ్యూ గడువు సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సవరించిన మార్గదర్శకాలు జారీ చేశారు.
నోరు, ముక్కు మూసి ఉండేలా మాస్క్ ధరించని వారికి రూ.100 జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. మాస్క్ లేని వారిని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోకి అనుమతించినట్లయితే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. కరోనా నిబంధనలు అతిక్రమించిన వ్యాపార, వాణిజ్య సంస్థలను ఒకటి, రెండు రోజులు మూసివేస్తామన్నారు. మార్గదర్శకాలు అమలయ్యేలా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment