సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రక్త నిల్వలకు సంబంధించిన ప్యాకెట్ల (బ్లడ్ ప్రొడక్ట్స్) అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. లైసెన్సులు లేకుండానే కొన్నిచోట్ల యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఒక హోల్‌సేల్ మెడికల్ షాపులో వెయ్యి రక్త ఉత్పత్తుల ప్యాకెట్లను కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా పట్టుకుని అక్కడికక్కడే సీజ్ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు. ఆ ప్యాకెట్లన్నీ కూడా ప్లాస్మా, క్రయో ప్రిస్పరేట్ రక్త ఉత్పత్తులని, వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అధికారులు ఏకధాటిగా ఈ దాడులు చేశారు.
ఆ మెడికల్ షాపునకు రక్త ఉత్పత్తులను విక్రయించే లైసెన్సు లేదు సరికదా ఆ ప్యాకెట్లపై కనీసం గడువు తేదీకూడా లేకపోవడం గమనార్హం. ఆ మెడికల్ షాపుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నెట్‌వర్క్ ఉందని తెలిసింది. కొన్నేళ్లుగా అక్రమంగా రక్త ఉత్పత్తుల దందా నిర్వహిస్తున్నా ఎవరూ గుర్తించలేదని సమాచారం. పైగా కొందరు అధికారులు కూడా ఆ షాపునకు సహకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రక్త ఉత్పత్తుల విక్రయాలకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అయితే చాలామంది బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ తీసుకొని రక్త ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. రక్తం ద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకోసం రక్త ఉత్పత్తులు తయారుచేస్తుంటారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు.
అలాగే ప్లాస్మా నుంచి ప్లేట్‌లెట్లు, రెడ్‌బ్లడ్ సెల్స్ సెపరేట్ చేస్తుంటారు. ఇలా నాలుగైదు రకాల రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో పలుచోట్ల అక్రమార్కులు లైసెన్సు లేకుండా, ప్రమాణాలు పాటించకుండా తయారుచేస్తుండటం గమనార్హం. అయితే 2012 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా రక్త ఉత్పత్తుల విక్రయాలకు లైసెన్సు ఇవ్వలేదని సమాచారం. కూకట్‌పల్లిలోని ఆ మెడికల్ షాపులో రక్త ఉత్పత్తులను ప్రమాణాల ప్రకారం నిల్వ చేయలేదు.
ఉదాహరణకు ప్లాస్మాను మైనస్ 20 డిగ్రీల వద్ద, క్రయోప్రిస్పరేట్‌ను మైనస్ 80 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి. కానీ వాటిని ఏసీ రూములో పడేశారు. అలాగే వాటిపై లేబుళ్లు లేవు. రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో ఇష్టారాజ్యంగా వీటిని అమ్ముతున్నారు. పేరుకు అది హోల్‌సేల్ మెడికల్ షాపైనా ల్యాబ్‌లా ఉందని అంటున్నారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్లు దాస్, రమ«ధాన్, ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, చంద్రశేఖర్, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment