Illegal sales
-
హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా.. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా అమ్మకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్‌లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్‌లోని హీమో ల్యాబొరేటరీస్‌లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు -
వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు విక్రయించొద్దు
న్యూఢిల్లీ: ప్రభుత్వ అనుమతులు అవసరమయ్యే వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు వంటి టెలికం పరికరాలను విక్రయించరాదని ఈ–కామర్స్ సంస్థలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులిస్తే తప్ప సెల్యులార్ సిగ్నల్ జామర్లు, జీపీఎస్ బ్లాకర్లు లేదా ఇతరత్రా సిగ్నల్స్‌ను జామ్ చేసే పరికరాలను వినియోగించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దేశీయంగా ప్రైవేట్ రంగ సంస్థలు లేదా ప్రైవేట్ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడం లేదా వినియోగించుకోవడం వంటివి చేయరాదు‘ అని ఒక ప్రక టనలో తెలిపింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా సిగ్నల్ జామింగ్ పరికరాల ప్రకటనలు ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం, దిగుమతి చేసుకోవడం లేదా ఇతరత్రా మార్కెటింగ్ చేయడం వంటివన్నీ కూడా చట్టవిరుద్ధమని పేర్కొంది. గడిచిన 4–5 ఏళ్లుగా డాట్ ఈ అంశాన్ని అనేక సార్లు లేవనెత్తింది. ఈ పరికరాల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు పలు మార్లు దాడులు కూడా నిర్వహించింది. వైర్లెస్ జామర్లను విక్రయించడం లేదా వాటి అమ్మకానికి వెసులుబాటు కల్పించడం వంటివి చేయరాదంటూ ఈ–కామర్స్ కంపెనీలన్నింటికీ జనవరి 21న డాట్ నోటీసు కూడా జారీ చేసింది. మరోవైపు, మొబైల్ సిగ్నల్ బూస్టర్ల వంటి అక్రమ పరికరాల అనధికారిక వినియోగం వల్ల టెలికం సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. వీటి వినియోగం చట్టరీత్యా నేరమన్న సంగతి చాలా మంది ప్రజలకు తెలియదని, తాజా ఆదేశాలతో ఈ అంశంపై అవగాహన పెరగగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. -
కరోనా మందుల అక్రమ అమ్మకాలు
-
రక్త ఉత్పత్తుల అక్రమ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రక్త నిల్వలకు సంబంధించిన ప్యాకెట్ల (బ్లడ్ ప్రొడక్ట్స్) అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. లైసెన్సులు లేకుండానే కొన్నిచోట్ల యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఒక హోల్‌సేల్ మెడికల్ షాపులో వెయ్యి రక్త ఉత్పత్తుల ప్యాకెట్లను కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా పట్టుకుని అక్కడికక్కడే సీజ్ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు. ఆ ప్యాకెట్లన్నీ కూడా ప్లాస్మా, క్రయో ప్రిస్పరేట్ రక్త ఉత్పత్తులని, వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అధికారులు ఏకధాటిగా ఈ దాడులు చేశారు. ఆ మెడికల్ షాపునకు రక్త ఉత్పత్తులను విక్రయించే లైసెన్సు లేదు సరికదా ఆ ప్యాకెట్లపై కనీసం గడువు తేదీకూడా లేకపోవడం గమనార్హం. ఆ మెడికల్ షాపుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నెట్వర్క్ ఉందని తెలిసింది. కొన్నేళ్లుగా అక్రమంగా రక్త ఉత్పత్తుల దందా నిర్వహిస్తున్నా ఎవరూ గుర్తించలేదని సమాచారం. పైగా కొందరు అధికారులు కూడా ఆ షాపునకు సహకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రక్త ఉత్పత్తుల విక్రయాలకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అయితే చాలామంది బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ తీసుకొని రక్త ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. రక్తం ద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకోసం రక్త ఉత్పత్తులు తయారుచేస్తుంటారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. అలాగే ప్లాస్మా నుంచి ప్లేట్లెట్లు, రెడ్‌బ్లడ్ సెల్స్ సెపరేట్ చేస్తుంటారు. ఇలా నాలుగైదు రకాల రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో పలుచోట్ల అక్రమార్కులు లైసెన్సు లేకుండా, ప్రమాణాలు పాటించకుండా తయారుచేస్తుండటం గమనార్హం. అయితే 2012 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా రక్త ఉత్పత్తుల విక్రయాలకు లైసెన్సు ఇవ్వలేదని సమాచారం. కూకట్‌పల్లిలోని ఆ మెడికల్ షాపులో రక్త ఉత్పత్తులను ప్రమాణాల ప్రకారం నిల్వ చేయలేదు. ఉదాహరణకు ప్లాస్మాను మైనస్ 20 డిగ్రీల వద్ద, క్రయోప్రిస్పరేట్ను మైనస్ 80 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి. కానీ వాటిని ఏసీ రూములో పడేశారు. అలాగే వాటిపై లేబుళ్లు లేవు. రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో ఇష్టారాజ్యంగా వీటిని అమ్ముతున్నారు. పేరుకు అది హోల్‌సేల్ మెడికల్ షాపైనా ల్యాబ్‌లా ఉందని అంటున్నారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్లు దాస్, రమ«ధాన్, ఇన్స్పెక్టర్లు నాగరాజు, చంద్రశేఖర్, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జేసీ పట్టుకున్నా.. ఆగలే
కడప అగ్రికల్చర్: జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ స్వయంగా పప్పుదినుసుల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న విక్రయాలను పరిశీలించి అక్రమంగా నిల్వ చేసిన మినుములను పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేయించారు. అయినా కూడా కడప మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది నిత్యకృత్యమైందని రైతుసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గురువారం కొందరు రైతులు రాశిగా పోసిన మినుములు ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటి తాలూకు రైతులెవరని ఆరా తీశారు. ఓ వ్యక్తి ఇవి తనవేనంటూ ముందుకొచ్చారు. అయితే టోకెన్లు చూపించమని అడిగితే వాటిని చూపించారు. ఆయా టోకెన్లకు జత చేసిన ఆధార్‌కార్డుపై రాసి ఉన్న నంబర్లకు ఫోన్ చేస్తే మేం పంట వేయలేదని కొందరు, మేం పంట వేశాం ఆ పంటను అదే మార్కెట్‌యార్డులో విక్రయించామని చెప్పారు. మరి ఈ టోకెన్లు ఎలా వచ్చాయా? అనే ది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. సాయంత్రం వరకు కుప్పగా పోసిన మినుములను కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత రైతులందరూ వెళ్లిపోయాక తూకాలు వేశారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. దళారులు, వ్యాపారులు సరుకును అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నట్లని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై గురువారం యార్డులో అధికారులను రైతులు నిలదీశారు. దీంతో కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇష్టానుసారం టోకెన్ల జారీ పంట సాగుకంటే మించి దిగుబడులు ఎలా వస్తున్నాయో? అర్థం కావడంలేదని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. మినుము పంట తక్కువ సాగైన ప్రాంతాల్లోని ఏఓలు అధికంగా టోకెన్లు రాయిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని జేడీఏ ఠాగూర్‌నాయక్ హెచ్చరించారు. పంటలేని ప్రాంతాల్లోని ఏఓలు రైతులకు టోకెన్లు రాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ఏఓలపై చర్యలు తప్పక ఉంటాయన్నారు. రైతుల ముసుగులో కొందరు వ్యాపారులు నాలుగైదు టోకెన్లు తీసుకుని తెలిసిన రైతుల ఆధార్‌కార్డులు, ఒన్‌బీ, పట్టాదారు పాస్‌బుక్ తీసుకుని ఏఓల వద్దకు వెళ్లి రాయించుకుని దర్జాగా కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తుండ డం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదని నిజమైన, పంట పండించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద లాట్లు ముందుగా తూకాలు వేయించడం, చిన్న, సన్నకారు రైతుల చిన్న లాట్లకు తూకాలు వేయడం లేదని మైదుకూరుకు చెందిన రైతు రంగారెడ్డి ఆరోపించారు. ప్రతి రోజు ఆ నలుగురే మినుములతో కేంద్రానికి.. కడప మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో పప్పుదినుసు పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు. తేదీల వారీగా రైతులు తమ దిగుబడులను తీసుకువస్తుండంగా నలుగురు వ్యక్తులు మాత్రం నిత్యం కేంద్రానికి సరుకును తీసుకువస్తూనే ఉన్నారు. అందులో మంత్రి బంధువని చెప్పుకుంటున్న వ్యక్తి ఒకరుకాగా, మరొకరు కమలాపురం అధికారపార్టీ నేత అనుచరుడని, ఇంకొకరు మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధికారి బంధువని, మరొకరు మైదుకూరుకు చెందిన అ«ధికారపార్టీ రాష్ట్ర నాయకుడి తమ్ముడినంటూ ఇలా ఆ నలుగురే నిత్యం తూకాల వద్దకు వచ్చి హడావుడి చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్నవి తమకు సంబంధించిన మినుములు, కందులు, శనగలు అంటూ అటు హమాలీలను, ఇటు కొనుగోలు కేంద్రం అధికా రులను బెదిరించడం షరా మామూలుగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిపెట్టి నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఔషధ దందా
– జిల్లాలో జోరుగా నకిలీ ఔషధాల విక్రయం – విక్రయాలు పెంచుకునేందుకు డాక్టర్లకు భారీ నజరానాలు, విదేశీ పర్యటనలు – తనిఖీలు లేకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నెలవారీ మామూళ్లు – జీరో బిజినెస్‌తో భారీగా దండుకుంటున్న 'నకిలీ' మందుల విక్రయదారులు జిల్లాలో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో, విదేశీ పర్యటనల మోజుతో రోగులకు నాసిరకం మందులు రాసిస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, హిందూపురంతో పాటు పలు పట్టణాల్లో ఈ దందా సాగుతోంది. కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు కూడా 'నకిలీ' మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు. దీనివల్ల ఒకవైపు రోగుల ఆరోగ్యం గుల్లవడంతో పాటు మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. (సాక్షిప్రతినిధి, అనంతపురం) కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో జిల్లాలో నకిలీ మందుల దందా పెద్దఎత్తున సాగుతోంది. మందుల తయారీ కంపెనీలు కొందరు వైద్యులతో నేరుగా సంబంధాలు పెట్టుకుని, వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీమందులను సరఫరా చేస్తున్నాయి. వీటికి ఎలాంటి బిల్లులూ ఉండవు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల 'ఽనకిలీ మందులనే రోగులకు రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సెంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. లక్ష రూపాయల విలువైన కాంట్రాక్ట్ బేసిస్ మందులు విక్రయిస్తే డాక్టర్లకు సదరు కంపెనీ ప్రతినిధులు రూ.20వేల దాకా ముట్టజెబుతున్నారు. వీటితో పాటు మూన్నెళ్లకోసారి ఖరీదైన బహుమతులు కూడా అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్, దుబాయ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి విదేశీ పర్యటనలకు పంపుతున్నారు. అలాగే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సమావేశాల పేరుతో స్టార్ హోటల్స్‌లో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల ఽ‘అండ’ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తుంది. నకిలీ మందులివిగో..: తక్కువ ధరకు లభించే నాణ్యమైన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కొందరు కక్కుర్తి డాక్టర్లు నకిలీ బ్రాండ్లను రాసి పంపుతున్నారు. ఉదాహరణకు నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో 'ఎ...ఆ...' అనే రెండురకాల కంపెనీల పేరుతో ఉన్న మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్ స్థానంలో ఓ...సె..., ఆ... పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్ స్థానంలో ' ఫా' పేరుతో ఉండే మూడు రకాల నకిలీమందులను రాసిస్తున్నారు. ఇలా చాలా రకాల నకిలీ మందులు మెడికల్ స్టోర్ల నుంచి రోగులకు చేరుతున్నాయి. వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. ఈ లాభాల్లో కొంత పర్సెంటేజీ వైద్యులకు ముట్టజెబుతున్నారు. కొన్ని ఆస్పత్రులలో మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసిన వారు ఆస్పత్రి కరెంటుబిల్లు, ఇతర ఖర్చులను భరిస్తున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను డాక్టర్లు, మెడికల్స్టోర్ నిర్వాహకులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మెడికల్స్టోర్లలో ఎలాంటి తనిఖీలు చేయకుండా వారితో ‘సత్సంబంధాలు’ కొనసాగిస్తున్నారు. అర్హత లేనివారు మెడికల్ స్టోర్లలో.. జిల్లాలో దాదాపు 2,500 మెడికల్ స్టోర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. బీ ఫార్మసీ పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని మందుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. రోగులకు ఔషధాలు అందజేసేందుకు కచ్చితంగా ఫార్మసిస్టులనే నియమించాలి. వీరు తెల్లటి ఆఫ్రాన్ ధరించి మందులివ్వాలి. జిల్లాలో చాలా వరకు మందుల దుకాణాల యజమానులు ఫార్మాసిస్టులను నియమించుకోకుండా పదో తరగతి, ఇంటర్మీడియట్ తప్పినవారి ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. వారికి అవగాహన లేక డాక్టరు రాసిన చీటిలోని మందులను కాక ఇతర వాటిని ఇస్తున్నారు. వైద్యులు వాటిని చూసి తాము రాసిన మందులు ఒకటైతే...ఇచ్చింది వేరే ఔషధాలని తిప్పి పంపుతున్న సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు మందులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఈ ఘటనలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీక వినియోగదారులు దుకాణదారులతో గొడవపడి వెళ్లిపోతున్నారు. -
మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించాలి
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు నెల్లూరు(క్రైమ్): మద్యం విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ, అనధికార మద్యం విక్రయాలను నియంత్రించాలని సూచించారు. విధిగా మద్యం దుకాణాలు, బార్లను తనిఖీ చేసి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపాలన్నారు. బెల్టుషాపులపై దాడులు నిర్వహించి నిర్వాహకులతో పాటు మద్యం సరఫరా చేసే దుకాణాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై దాబాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని సూచించారు. నిబంధనల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టీ శ్రీనివాసరావు, ఏసీ చెన్నకేశవరావు, నెల్లూరు, గూడూరు ఈఎస్ఐలు బలరామకృష్ణ, విజయ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అనంతరం తిరుపతికి బయలుదేరి వెళ్లారు. -
సీపీఎం నేతలపై హత్యాయత్నం
గుంటూరు రూరల్ : అసైన్డ్ భూముల అక్రమ విక్రయాలను అడ్డుకున్నందుకు సీపీఎం నాయకులపై అధికార పార్టీకి చెందిన మంత్రి అనుచరులు గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామం పరిధిలోని సుందరయ్యనగర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. స్వర్ణభారతినగర్ నాలుగో లైనుకు చెందిన కామిశెట్టి ఆంజనేయులు (32) తాపీ పనిచేస్తూ సీపీఎమ్ లో సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంటాడు. సుందరయ్య కాలనీ, స్వర్ణభారతినగర్లకు చెందిన పాలక పార్టీ నాయకులు సుందరయ్య కాలనీలోని అసైన్డ్ భూములను అక్రమంగా అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు రెండుమూడుసార్లు స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నాడు. నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావుకు ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తులు మంత్రి అనుచరులు కావడంతో సీఐ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కాలనీ వాసులు, సీపీఎం నాయకులు గత నెల 20న అర్బన్ ఎస్పీకి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ కేసును నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావుకు అప్పగించి పరిస్థితిని విచారించి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. అయితే రౌడీషీటర్లు స్థానిక మంత్రితో పోలీసులకు చెప్పించుకుని ఫిర్యాదు చేసిన వారిపైనే బైండోవర్ కేసును పెట్టించారని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రౌడీషీటర్ షేక్ బాజీ తన స్నేహితులైన గూడవల్లి కోటేశ్వరరావు, ఖాజావలి, అబ్దుల్ రహమాన్, ఎమ్ మణికంఠలతో కలిసి మంగళవారం ఆంజనేయులు వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. ఆంజనేయులు అతని పక్కనే ఉన్న కనపాల సతీష్‌లపై గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు అక్కడికి చేరుకోవటంతో నిందితులు పారిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆంజనేయులుకు భార్య ముగ్గురు చిన్నారులున్నారని తండ్రి సాంబయ్య తెలిపాడు. రౌడీల ఆకృత్యాలకు అడ్డువస్తున్నాడని తన కొడుకును చంపేందుకు ప్రయత్నించారని వాపోయాడు. జీజీహెచ్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన బాధితులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు అక్రమంగా స్థలాలను విక్రయిస్తూ అడ్డువచ్చినవారిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం నాయకులు గుంటూరు ప్రభుత్వాసుపత్రివద్ద ధర్నాకు దిగారు. నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని నాయకులకు సర్దిచెప్పి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గంటకుపైగా జరిగిన ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు తూర్పు, పశ్ఛిమ డీఎస్పీలు సంతోష్, సరిత ఆధ్వర్యంలో పోలీసు బలగాలు పెద్దఎత్తున జీజీహెచ్ వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి. -
రెవెన్యూ లీలలు..
మంచాల: మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరు కంచే చేను మేసిన చందంగా మారింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు దళారులకు, ఆక్రమణదారులకు ఆసరాగా నిలుస్తున్నారు. దీంతో విలువైన భూముల అక్రమ విక్రయాలు కొనసాగుతున్నాయి. వివరాలు.. ఖానాపూర్ గ్రామంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నాగార్జున సాగర్ -హైదరాబాద్ దారి సమీపంలో ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ధర పలుకుతోంది. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో దళారులు, రెవెన్యూ అధికారులతో మిలాఖత్ అవుతున్నారు. రికార్డులను తారుమారు చేస్తున్నారు. తిరిగి ఆ భూములను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఖానాపూర్ గ్రామంలో అక్రమ విక్రయాల తంతు జోరుగా కొనసాగుతోంది. అందుకు 67 సర్వే నంబర్లోని భూమి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ సర్వే నంబర్లో 310 ఎకరాలు భూమి ఉంది. కానీ అధికారులు గుర్తించింది మాత్రం 280 ఎకరాలు మాత్రమే. ఇంకా అధికారికంగా 30 ఎకరాల వరకు ఉంది. ఈ 30 ఎకరాల భూముల్లో అక్కడక్కడా కొంత మంది కబ్జాలో ఉన్నారు. కాని వాస్తవంగా వారికి పట్టా లేదు. రికార్డుల్లో కూడా లేరు. ఇది గమనించిన దళారులు రియల్ వ్యాపారులతో చేతులు కలిపి పట్టా భూమితో పాటు మిగులు 30 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. 30 ఎకరాల భూమిలో అనర్హులు సైతం తమ పేర్ల మీద పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. 67 సర్వే నంబర్‌ను 67/1 నుంచి 67/26 వరకు నంబర్లను పొడిగించారు. అందులో ఈ భూమికి సంబంధంలేని వ్యక్తులు, స్థానికేతరులు కూడా పట్టా పాసు పుస్తకాలు తయారు చేసుకున్నారు. వారు యథేచ్ఛగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ తతంగమంతా బడా రియల్ వ్యాపారుల కనుసైగలో నడుస్తోంది. విలువైన 30 ఎకరాలను ఆక్రమణలో భాగంగానే అక్రమ పట్టా పాసు పుస్తకాలు, తప్పుడు రికార్డులు తయారు చేస్తున్నారు. అటు రియల్ వ్యాపారులు, ఇటు దళారులు కలిసి ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఒకే కుటుంబంలో ముగ్గురు పేర్లపై అక్రమ పట్టాలు పొందారు. ఒక్కరే మూడు పేర్లతో మూడు అక్రమ పట్టా పాసు పుస్తకాలు పొందడం గమనార్హం. ఇలా విలువైన 30 ఎకరాల భూమిని దళారులు తప్పుడు రికార్డులు తయారుచేసి రియల్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు. ఈ అక్రమాలపై స్థానికులు ఇటీవలే జిల్లా కలెక్టర్‌ను కలిసి వివవించారు. అక్రమ పట్టాల విషయంలో విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ టి.శ్యాంప్రకాష్ వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బెల్టు షాపుల్లేవట!
జిల్లాలో మద్యం అక్రమ అమ్మకాలు అస్సలు జరగడం లేదంట! అంతా పద్ధతిగానే జరుగుతోందట! వినేవాళ్లు వుండాలే గానీ.. మన ఎక్సైజ్ అధికారులు ఏమైనా చెబుతారు. తాము నమ్మడమే కాకుండా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ పట్టించుకోలేదనుకుంటుందట. అచ్చం ఎక్సైజ్ అధికారుల తీరూ ఇలానే ఉంది. క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నా ‘అబ్బే.. ఎక్కడా అలాంటివి జరగడం లేదండీ’ అంటూ మాయమాటలు చెబుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అధికార పార్టీ అండతో మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. ఆ సమాచారం తెలిసినా.. అధికారులు మాత్రం ఆవైపు కన్నెత్తి చూడడం లేదు. అనంతపురం క్రై ం : మీకో విషయం తెలుసా.. జిల్లాలోని అనంతపురం, పెనుకొండ ఎక్సై జ్ పరిధిలో కేవలం లెసైన్స్డ్ మద్యం దుకాణాలు, బార్లలో మినహా మరెక్కడా ‘బైనాక్యులర్’ పెట్టి వెతికినా మద్యం దొరకదంట. అబ్బ..ఛా..ఎవరు చెప్పారేంటి? మీకీ సందేహం వస్తుందని తెలుసు. మేం చెప్పకపోతే నమ్మరేమోనని ఎక్సైజ్ ఉన్నతాధికారులనే అడిగాం. వాళ్లే చెప్పారు. అంతా ఒకేనంట. వాళ్లు చెబితే మీరు నమ్మేస్తారా? అయ్యో.. రామా.. మీరు మరీను. ఆ శాఖ అధికారులు మనల్ని తప్పుదోవ పట్టిస్తారా? ఉన్నదున్నట్టే చెప్పుంటారు. అంతగా చెబుతున్నారు కదా మీకు తెలిసి దుకాణాల్లో కాకుండా బయట ఎక్కడైనా మందు దొరుకుతుందా? అనంతపురం, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, పెనుకొండ, హిందూపురం, రొద్దం, చిలమత్తూరు.. ఇలా చాలా మండలాల్లో ఎక్కడైనా..ఎప్పుడైనా.. సమయం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే..కావాల్సినంత మద్యం క్షణాల్లో లభ్యమవుతుంది. మరి అధికారులు అలా చెబుతున్నారేంటి? మీరే ఏదో పొరబడుతున్నట్లున్నారు?అయితే మేం కొన్ని అడ్రస్‌లు చెబుతాం. అక్కడికెళ్లి చూడండి. మేం చెప్పినట్లు మీకు కావాల్సిన మద్యం దొరక్కపోతే అప్పుడు నిలదీయండి. అంటే ఇదంతా అధికారులకు నిజంగా తెలుసుండదంటారా.. ఒకవేళ తెలిస్తే అలా ఎందుకు చెప్తారు? మీకు మరీ చాదస్తమనుకుంటా. ప్రతి లెసైన్సు దుకాణానికి అనుబంధంగా కనీసం మూడు, నాలుగు బెల్టు షాపులున్నాయి. అసలు దుకాణంలో ఎలాగూ ఎమ్మార్పీకే విక్రయించాలి. ఇది గిట్టుబాటయ్యేది కాదు. అందుకే ‘బెల్ట్’ పెట్టి పల్లె ముంగిట్లోకి మద్యం తీసుకొస్తున్నారు. అర్ధరాత్రీ.. అపరాత్రీ అని లేకుండా అమ్ముతున్నారు. ఇంకేముంది వాళ్లు చెప్పిన ధరకే కొనుక్కుని మందుబాబులు నిషాలో తేలుతుంటే.. వాళ్ల బలహీనతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు పండగ చేసుకుటుంన్నారు. ఇదేమీ రహస్యంగా జరిగేది కాదు కదా? అన్నీ అధికారులకు ఎరుకే. ఈ దుకాణాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరన్నది బహిరంగ రహస్యం. =అప్పుడప్పుడు దాడులు చేస్తేనే.. అనంతపురం ఎక్సైజ్ జిల్లా పరిధిలోని 25 మండలాల్లో 136 లెసైన్స్డ్ మద్యం దుకాణాలు, 3 బార్ అండ్ రెస్టారెంట్లు, ఒక క్లబ్ ఉంది. వీటిద్వారా ప్రభుత్వానికి మొదట విడతగా (నాలు గు నెలలు) రూ. 18.70 కోట్లు ఆదాయం వచ్చింది. మూన్నెళ్లలో (జూన్, జూలై, ఆగస్టు) 216 మద్యం అక్రమ వ్యాపార కే సులు నమోదయ్యాయి. 257 మందిని అరెస్టు చేశారు. 3227 లీ టర్ల మద్యం (ఐఎంఎల్), 199 లీటర్ల బీరును, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు దాడులు చేసినప్పుడు మాత్రమే దొరికినవి. ఇక రోజువారీగా దాడులు చేస్తే వీటి సంఖ్య ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. పెనుకొండ ఎక్సైజ్ జిల్లాలో 41 కేసులేనట! 25 మండలాలున్న అనంతపురం ఎక్సైజ్ జిల్లాలో మూన్నెళ్లలో (జూన్, జూలై, ఆగస్టు) 216 కేసులు నమోదైతే 38 మం డలాలున్న పెనుకొండ ఎక్సైజ్ జిల్లాలో కేవలం 41 కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం. 43 మందిని అరెస్టు చేసి 896 బాటిళ్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ 93 మద్యం షాపులు, 5 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉండి, అధిక మండలాలున్న చోటు కేసులు అంతంతమాత్రంగానే నమోదవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. కొంత మంది మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలున్నాయి. పైగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ సిబ్బంది కేసుల విషయంలో ముందగుడు వేయలేకపోతున్నట్లు సమాచారం. బెల్టు షాపులివి...గో = అనంతపురం రూరల్ పరిధిలోని పిల్లిగుండ్లకాలనీలో ఓ ఇంట్లో ఎప్పుడెళ్లినా మద్యం లభిస్తుంది. కంకర ఫ్యాక్టరీ సమీపంలో కూల్‌డ్రింక్ షాపుల్లో అర్ధరాత్రయినా ‘కిక్’ ఎక్కుతుంది. జాకీర్‌కొట్టాలులో మసీదు సమీపంలోని ఓ ఇంట్లో మద్యం అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. = బుక్కరాయసముద్రంలో అర్ధరాత్రి వెళ్లిన తాగుతూ తూలొచ్చు. ఇదే మండలం భద్రంపల్లిలోని ఓ నివాసంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. = కూడేరులో బ్రాంది షాపు సమీపంలో ఉన్న కూల్‌డ్రింక్ షాపులో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారు. ఏ సమయంలోనైనా ఇక్కడ మద్యం లభిస్తుంది. = గార్లదిన్నె మండలం మర్తాడు, పెనకచెర్ల డ్యాం, కల్లూరులో లూజు విక్రయాలు జరుగుతున్నాయి. ఎప్పుడెళ్లినా మద్యం సీసా మీ ముందు పెడతారు. = బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, కేకే ఆగ్రహారం, కొర్రపాడు, రోటరీపురం, వడియంపేట గ్రామాల్లో మద్యం అనధికారికంగా అమ్ముతున్నారు. = శింగనమల మండలం ఉల్లికల్లు, తూర్పు నరసాపురం, ఆకులేడు గ్రామాల్లో మద్యం లభిస్తుంది. = చిలమత్తూరు మండలం సోమఘట్టలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో, మధురేపల్లిలో బస్టాండ్ దగ్గర, కల్లుకుంటలోని ఓ చిల్లర దుకాణంలో, దేమకేతేపల్లి బీసీ కాలనీలోని అంగన్వాడీ సెంటర్ సమీపంలో అనధికార మద్యం దుకాణాలు దర్శనమిస్తాయి. ఇదే మండలం చాగలేరులోని బస్టాండ్ వద్ద, మొరసలపల్లి ప్రధాన వీధిలోని ఓ చిల్లర దుకాణంలో, పలగలపల్లిలోని మసీదు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో మందు లభిస్తుంది. ఈ బెల్టు షాపుల్లో రోజూ కొనుగోలు చేసే వారికి మాత్రమే తొందరగా మద్యం దొరుకుతుంది. కొత్త వ్యక్తులెవరైనా వస్తే కొంచెం ఆలోచించి ఇస్తారు. = పెనుకొండ మండలం అడదాకులపల్లి, పెద్దమంతూ రు, కలిపి, లక్కసానపల్లి, తిమ్మాపురం గ్రామాలతో పాటు రొద్దం మండలం కోగిర, ఆర్.లోచర్ల, రొద్దం పట్టణం, నారనాగేపల్లి, గోనిమేకులపల్లి గ్రామాల్లో అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో బెల్టు షాపులు ఉన్నాయి. రెచ్చిపోతున్న ‘తమ్ముళ్లు’ చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి కాగానే బెల్టు షాపులు తొలగిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎలాగూ ఆయన సీఎం అయ్యారు. ముందు చెప్పినట్లుగానే బెల్టు షాపుల ఎత్తివేతకు సంబంధించి ఫైలుపై సంతకమూ చేశారు. అంతే.. ఆ మరుసటి రోజే ఎకై ్సజ్ అధికారులు నానా హడావుడి చేసి దాడులు కూడా చేశారు. హమ్మయ్య.. బాబొచ్చారు.. బెల్టు తీశారు అని జనం అనుకునేలోపే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ‘బాబొచ్చాడు..మనకెవరు అడ్డు’ అన్న చందంగా మద్యం అక్రమ అమ్మకాలు తీవ్రం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో మెజార్టీ శాతం తెలుగుదేశం పార్టీ నేతల అనుచరులకు సంబంధించినవే కావడం గమనార్హం. అందుకే అధికారం ఎలాగూ ఉంది.. మమ్మల్నెవరేం చేస్తారనుకుంటున్న తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. వాళ్ల జోలికెందుకెళ్లడం.. అంతో ఇంతో తీసుకుని కళ్లు మూసుకుందాం అన్నట్లు ఎకై ్సజ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. సమాచారం అందితే వెంటనే దాడులు చేస్తాం పెనుకొండ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని బెల్టు షాపుల సమాచారంపై ఈఎస్ నాగమద్దయ్యను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఏఈఎస్ శ్రీనివాసులును సంప్రదించగా.. తమ పరిధిలో ఎలాంటి బెల్టు షాపులు లేవన్నారు. దీనిపై పూర్తి నిఘా ఉంచామని, బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు చేస్తామన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు ఎక్కడా లేవు అనంతపురం ఎక్సైజ్ జిల్లా పరిధిలో బెల్టు షాపులు దాదాపు ఎక్కడా లేవు. కొన్ని చోట్ల అనధికారికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచాం. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి మందు సరఫరా చేస్తున్న షాపులపై కూడా చర్యలు తీసుకుంటాం. 5 వేలు జనాభా కల్గిన ప్రాంతంలోని లెసైన్స్డ్ షాపునకు ఒక పర్మిట్ రూంకు అనుమతి ఉంటుంది. ఇక్కడ కేవలం మద్యం తాగేందుకు మాత్రం అనుమతించాలి తప్ప ఎలాంటి అమ్మకాలు జరగకూడదు. స్టాకు పెట్టుకోకూడదు. అలాగుంటే బెల్టుషాపు కిందే పరిగణించి కేసులు నమోదు చేస్తాం. - ప్రణవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
యథేచ్ఛగా గుట్కా విక్రయాలు
- లోపించిన అధికారుల నిఘా - రెట్టింపు ధరలతో విక్రయం బాన్సువాడ : ప్రాణాంతకంగా మారిన గుట్కా, పాన్‌మసాల విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, గుట్టుచప్పుడుకాకుండా యథేచ్ఛగా గుట్కా విక్రయాలు సాగుతున్నాయి. గుట్కా నిర్ణీత ధరకు రెండింతలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికార యంత్రాంగం విఫలమవుతుండడంతో బ్లాక్ మార్కెట్ విస్తరించింది. జిల్లాలో గుట్కా, పాన్ మసాలా బ్లాక్ మార్కెటింగ్ నిత్యం రూ. 5 లక్షలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాణి జ్య పన్నుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్కా విక్రయాలను అరికట్టాల్సి ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో మున్సిపల్ హెల్త్ అధికారులు దాడి చేయాలి. కానీ ఈ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గుట్కా హోల్‌సెల్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు అధికారులకు అందుతున్నాట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్‌తోపాటు పలు రకాల రోగాలకు కారణమవుతున్నాయని భావించి ప్రభుత్వం గతేడాది జనవరి 15 నుంచి వీటి విక్రయాలను నిషేధించింది. అయితే ఉన్న గుట్కా స్టాకును విక్రయించుకొనే పేరుతో వ్యాపారులు అక్రమ అమ్మకాలు చేస్తున్నారు. గుట్కా, పాన్ మసాలాకు అలవాటుపడిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అసలు ధర కంటే రెండు, మూడు రేట్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా, పాన్ మసాలాలను హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రాలోని నాందేడ్, దెగ్లూర్, కర్ణాటకలోని ఔరాద్ తదితర ప్రాంతాల నుంచి స్థానికంగా కొంత మంది హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. వీరి నుంచి జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని పాన్ షాపులకు సరఫరా అవుతోంది. బాన్సువాడ, బోధన్ పట్టణాల్లో నిలువ చేస్తూ పరిసర మండలాలకు ఆటోలు, మోటర్ సైకిళ్లపై అతి రహస్యంగా చేరవేస్తున్నారు. రాత్రి వేళ నల్ల ప్లాస్టిక్ కవర్లలో గుట్కాలు వేసుకొని వారికి చేరవేస్తారు. పాన్ షాపుల్లో గుట్కాలను బయటవారి కంట పడనీయకుండా రహస్యంగా విక్రయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్లో రహస్యంగా హోల్ సెల్ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. అక్రమంగా దిగుమతి చేసుకున్న నిషేధిత కంపెనీల గుట్కాలు, పాన్‌మసాలా ప్యాకెట్లను అసలు ధరకన్నా రెండు మూడు రేట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ. 1.50 ధర ఉన్న గుట్కా ప్రస్తుతం రూ. 5, రూ. 3 ఉన్న గుట్కా ప్యాకెట్‌ను ప్రస్తుతం రూ. 8, రూ. 4 విలువ గల గుట్కా రూ. 10, రూ. 10 ఉండే రకం రూ. 20కు విక్రయిస్తున్నారు. కాగా గుట్కాకు అలవాటు పడిన వారు ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకొని హోల్‌సెల్ వ్యాపారులు, పాన్‌షాపుల యజమానులు యథేచ్ఛగా దోచుకొంటున్నారు. గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత గుట్కా వ్యసనానికి అలవాటు పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వాటిలో ఉండే పలు రసాయనాల ప్రభావంతో క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
విచ్చలవిడిగా ఇసుక విక్రయాలు
కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్ : గోదావరిలో ఇసుక ర్యాంపుల మూసివేత అక్రమార్కులకు వరంగా మారింది. కొవ్వూరు, ఔరంగాబాద్, వాడపల్లి ఇసుక ర్యాంపులు మూతపడటంతో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి రాత్రివేళలో ఇసుకను తరలిస్తున్నారు. ఈ ఇసుకను పట్టపగలు ప్రధాన రహదారిపై వాహనాల్లో ఎగుమతులు చేస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడంతో వ్యాపారులు విచ్చలవిడిగా ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు నిద్రావస్థలో జోగుతుండటంతో వీరి ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు ఉన్న సమయంలో ర్యాంపుల్లో రూ. 4,500 వరకూ ఉన్న లారీ ఇసుక ధర ప్రస్తుతం రూ.10 వేలకు అమ్ముతున్నట్టు చెబుతున్నారు. పడవల యజమానులపై చర్యలు ఏవీ గోదావరిలో పడవలు తిరగాలంటే ఇరిగేషన్ శాఖ, గోదావరి హెడ్‌వర్క్స్ అధికారుల అనుమతి తప్పనిసరి. పడవలు లేకుండా గోదావరి నుంచి ఇసుకను బయటకు తరలించడం అసాధ్యం. అనుమతులు పొందిన పడవల యజమానులు ఇసుక రవాణాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపులో అధికారులకూ ముడుపులు చెల్లిస్తుండటం వల్లే పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు ఇచ్చే సమయంలో ప్రతి పడవ వివరాలు అధికారుల వద్ద ఉంటాయని, పడవ యజమానులపై చర్యలు తీసుకుంటే ఇసుక అక్రమ అమ్మకాలు తక్షణమే నిలిచిపోతాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడే డంపింగ్ వాడపల్లి నుంచి మద్దూరులంక వరకూ ఏటిగట్లు దిగువన స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇసుక దందా కొనసాగిస్తున్నారు. పడవలలో తీసుకువచ్చిన ఇసుకను వాడపల్లి చర్చి సమీపంలో, బంగారమ్మపేట వద్ద, సీతంపేటలాకుల సమీపంలోను, బ్యారేజ్ ఎగువప్రాంతంలో, మద్దూరులంక శ్మశానవాటిక వద్ద డంప్ చేసి అక్కడ నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి అక్రమ ఇసుక దందాను నిలువరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.