జేసీ పట్టుకున్నా.. ఆగలే | Illegal sales Of Blackgrams | Sakshi
Sakshi News home page

జేసీ పట్టుకున్నా.. ఆగలే

Published Fri, Mar 23 2018 11:52 AM | Last Updated on Fri, Mar 23 2018 11:52 AM

Illegal sales Of Blackgrams - Sakshi

కడప మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రం అధికారితో గొడవకు దిగిన రైతులు

కడప అగ్రికల్చర్‌: జిల్లా ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ స్వయంగా పప్పుదినుసుల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న విక్రయాలను పరిశీలించి అక్రమంగా నిల్వ చేసిన మినుములను పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్‌ చేయించారు. అయినా కూడా కడప మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది నిత్యకృత్యమైందని రైతుసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గురువారం కొందరు రైతులు రాశిగా పోసిన మినుములు ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటి తాలూకు రైతులెవరని ఆరా తీశారు. ఓ వ్యక్తి ఇవి తనవేనంటూ ముందుకొచ్చారు. అయితే టోకెన్లు చూపించమని అడిగితే వాటిని చూపించారు.

ఆయా టోకెన్లకు జత చేసిన ఆధార్‌కార్డుపై రాసి ఉన్న నంబర్లకు ఫోన్‌ చేస్తే మేం పంట వేయలేదని కొందరు, మేం పంట వేశాం ఆ పంటను అదే మార్కెట్‌యార్డులో విక్రయించామని చెప్పారు. మరి ఈ టోకెన్లు ఎలా వచ్చాయా? అనే ది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. సాయంత్రం వరకు కుప్పగా పోసిన మినుములను కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత రైతులందరూ వెళ్లిపోయాక తూకాలు వేశారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. దళారులు, వ్యాపారులు సరుకును అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నట్లని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై గురువారం యార్డులో అధికారులను రైతులు నిలదీశారు. దీంతో కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇష్టానుసారం టోకెన్ల జారీ
పంట సాగుకంటే మించి దిగుబడులు ఎలా వస్తున్నాయో? అర్థం కావడంలేదని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. మినుము పంట తక్కువ సాగైన ప్రాంతాల్లోని ఏఓలు అధికంగా టోకెన్లు రాయిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని జేడీఏ ఠాగూర్‌నాయక్‌ హెచ్చరించారు. పంటలేని ప్రాంతాల్లోని ఏఓలు రైతులకు టోకెన్లు రాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ఏఓలపై చర్యలు తప్పక ఉంటాయన్నారు. రైతుల ముసుగులో కొందరు వ్యాపారులు నాలుగైదు టోకెన్లు తీసుకుని తెలిసిన రైతుల ఆధార్‌కార్డులు, ఒన్‌బీ, పట్టాదారు పాస్‌బుక్‌ తీసుకుని ఏఓల వద్దకు వెళ్లి రాయించుకుని దర్జాగా కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తుండ డం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదని నిజమైన, పంట పండించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద లాట్లు ముందుగా తూకాలు వేయించడం, చిన్న, సన్నకారు రైతుల చిన్న లాట్లకు తూకాలు వేయడం లేదని మైదుకూరుకు చెందిన రైతు రంగారెడ్డి ఆరోపించారు.

ప్రతి రోజు ఆ నలుగురే మినుములతో కేంద్రానికి..
కడప మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో పప్పుదినుసు పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు. తేదీల వారీగా రైతులు తమ దిగుబడులను తీసుకువస్తుండంగా నలుగురు వ్యక్తులు మాత్రం నిత్యం కేంద్రానికి సరుకును తీసుకువస్తూనే ఉన్నారు. అందులో మంత్రి బంధువని చెప్పుకుంటున్న వ్యక్తి ఒకరుకాగా, మరొకరు కమలాపురం అధికారపార్టీ నేత అనుచరుడని, ఇంకొకరు మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర అధికారి బంధువని, మరొకరు మైదుకూరుకు చెందిన అ«ధికారపార్టీ రాష్ట్ర నాయకుడి తమ్ముడినంటూ ఇలా ఆ నలుగురే నిత్యం తూకాల వద్దకు వచ్చి హడావుడి చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్నవి తమకు సంబంధించిన మినుములు, కందులు, శనగలు అంటూ అటు హమాలీలను, ఇటు కొనుగోలు కేంద్రం అధికా రులను బెదిరించడం షరా మామూలుగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిపెట్టి నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement