విచ్చలవిడిగా ఇసుక విక్రయాలు
కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్ : గోదావరిలో ఇసుక ర్యాంపుల మూసివేత అక్రమార్కులకు వరంగా మారింది. కొవ్వూరు, ఔరంగాబాద్, వాడపల్లి ఇసుక ర్యాంపులు మూతపడటంతో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌లుగా ఏర్పడి రాత్రివేళలో ఇసుకను తరలిస్తున్నారు. ఈ ఇసుకను పట్టపగలు ప్రధాన రహదారిపై వాహనాల్లో ఎగుమతులు చేస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడంతో వ్యాపారులు విచ్చలవిడిగా ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు నిద్రావస్థలో జోగుతుండటంతో వీరి ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు ఉన్న సమయంలో ర్యాంపుల్లో రూ. 4,500 వరకూ ఉన్న లారీ ఇసుక ధర ప్రస్తుతం రూ.10 వేలకు అమ్ముతున్నట్టు చెబుతున్నారు.
పడవల యజమానులపై చర్యలు ఏవీ
గోదావరిలో పడవలు తిరగాలంటే ఇరిగేషన్ శాఖ, గోదావరి హెడ్‌వర్క్స్ అధికారుల అనుమతి తప్పనిసరి. పడవలు లేకుండా గోదావరి నుంచి ఇసుకను బయటకు తరలించడం అసాధ్యం. అనుమతులు పొందిన పడవల యజమానులు ఇసుక రవాణాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపులో అధికారులకూ ముడుపులు చెల్లిస్తుండటం వల్లే పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు ఇచ్చే సమయంలో ప్రతి పడవ వివరాలు అధికారుల వద్ద ఉంటాయని, పడవ యజమానులపై చర్యలు తీసుకుంటే ఇసుక అక్రమ అమ్మకాలు తక్షణమే నిలిచిపోతాయని స్థానికులు చెబుతున్నారు.
ఇక్కడే డంపింగ్
వాడపల్లి నుంచి మద్దూరులంక వరకూ ఏటిగట్లు దిగువన స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇసుక దందా కొనసాగిస్తున్నారు. పడవలలో తీసుకువచ్చిన ఇసుకను వాడపల్లి చర్చి సమీపంలో, బంగారమ్మపేట వద్ద, సీతంపేటలాకుల సమీపంలోను, బ్యారేజ్ ఎగువప్రాంతంలో, మద్దూరులంక శ్మశానవాటిక వద్ద డంప్ చేసి అక్కడ నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి అక్రమ ఇసుక దందాను నిలువరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.