ఔషధ దందా
– జిల్లాలో జోరుగా నకిలీ ఔషధాల విక్రయం
– విక్రయాలు పెంచుకునేందుకు డాక్టర్లకు భారీ నజరానాలు, విదేశీ పర్యటనలు
– తనిఖీలు లేకుండా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు నెలవారీ మామూళ్లు
– జీరో బిజినెస్‌తో భారీగా దండుకుంటున్న 'నకిలీ' మందుల విక్రయదారులు
జిల్లాలో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో, విదేశీ పర్యటనల మోజుతో రోగులకు నాసిరకం మందులు రాసిస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, హిందూపురంతో పాటు పలు పట్టణాల్లో ఈ దందా సాగుతోంది. కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు కూడా 'నకిలీ' మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు. దీనివల్ల ఒకవైపు రోగుల ఆరోగ్యం గుల్లవడంతో పాటు మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది.
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో జిల్లాలో నకిలీ మందుల దందా పెద్దఎత్తున సాగుతోంది. మందుల తయారీ కంపెనీలు కొందరు వైద్యులతో నేరుగా సంబంధాలు పెట్టుకుని, వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీమందులను సరఫరా చేస్తున్నాయి. వీటికి ఎలాంటి బిల్లులూ ఉండవు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల 'ఽనకిలీ మందులనే రోగులకు రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సెంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
లక్ష రూపాయల విలువైన కాంట్రాక్ట్ బేసిస్ మందులు విక్రయిస్తే డాక్టర్లకు సదరు కంపెనీ ప్రతినిధులు రూ.20వేల దాకా ముట్టజెబుతున్నారు. వీటితో పాటు మూన్నెళ్లకోసారి ఖరీదైన బహుమతులు కూడా అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్, దుబాయ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి విదేశీ పర్యటనలకు పంపుతున్నారు. అలాగే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సమావేశాల పేరుతో స్టార్ హోటల్స్‌లో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల ఽ‘అండ’ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తుంది.
నకిలీ మందులివిగో..:
తక్కువ ధరకు లభించే నాణ్యమైన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కొందరు కక్కుర్తి డాక్టర్లు నకిలీ బ్రాండ్లను రాసి పంపుతున్నారు. ఉదాహరణకు నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో 'ఎ...ఆ...' అనే రెండురకాల కంపెనీల పేరుతో ఉన్న మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్ స్థానంలో ఓ...సె..., ఆ... పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్ స్థానంలో ' ఫా' పేరుతో ఉండే మూడు రకాల నకిలీమందులను రాసిస్తున్నారు. ఇలా చాలా రకాల నకిలీ మందులు మెడికల్ స్టోర్ల నుంచి రోగులకు చేరుతున్నాయి.
వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. ఈ లాభాల్లో కొంత పర్సెంటేజీ వైద్యులకు ముట్టజెబుతున్నారు. కొన్ని ఆస్పత్రులలో మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసిన వారు ఆస్పత్రి కరెంటుబిల్లు, ఇతర ఖర్చులను భరిస్తున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను డాక్టర్లు, మెడికల్‌స్టోర్ నిర్వాహకులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మెడికల్‌స్టోర్లలో ఎలాంటి తనిఖీలు చేయకుండా వారితో ‘సత్సంబంధాలు’ కొనసాగిస్తున్నారు.
అర్హత లేనివారు మెడికల్ స్టోర్లలో..
జిల్లాలో దాదాపు 2,500 మెడికల్ స్టోర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. బీ ఫార్మసీ పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని మందుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. రోగులకు ఔషధాలు అందజేసేందుకు కచ్చితంగా ఫార్మసిస్టులనే నియమించాలి.
వీరు తెల్లటి ఆఫ్రాన్ ధరించి మందులివ్వాలి. జిల్లాలో చాలా వరకు మందుల దుకాణాల యజమానులు ఫార్మాసిస్టులను నియమించుకోకుండా పదో తరగతి, ఇంటర్మీడియట్ తప్పినవారి ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. వారికి అవగాహన లేక డాక్టరు రాసిన చీటిలోని మందులను కాక ఇతర వాటిని ఇస్తున్నారు. వైద్యులు వాటిని చూసి తాము రాసిన మందులు ఒకటైతే...ఇచ్చింది వేరే ఔషధాలని తిప్పి పంపుతున్న సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు మందులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఈ ఘటనలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీక వినియోగదారులు దుకాణదారులతో గొడవపడి వెళ్లిపోతున్నారు.