- కిక్కిరిసి పోతున్న ‘అనంత’ ప్రభుత్వ సర్వజనాస్పత్రి
- ఓపీలో బారులు తీరిన వంద లాది మంది రోగులు
- రోజుకు 300 మంది పైబడి నమోదవుతున్న కేసులు
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య అధికమవుతోంది. దీంతో వందలాది మంది జ్వరాల బారిన పడి అల్లాడుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఓపీ విభాగం రోగులతో కిక్కిరిసి పోతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎమర్జెన్సీ విభాగానికి వస్తున్న రెఫరల్ కేసులను వైద్యులు సంబంధిత వార్డుల్లో చేర్చి వైద్యం అందజేస్తున్నారు.
ముఖ్యంగా వేసవి తాపం, వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం జ్వరాలు వస్తున్నాయి. దీంతో వందలాది మంది జ్వరాల బారిన పడుతున్నారు. బుధవారం సర్వజనాస్పత్రిలో ఓపీ విభాగం గది నంబరు-2లో జ్వర బాధితులతో కిటకిటలాడింది. కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఏకంగా 300 నుంచి 500 కేసులు వస్తున్నాయి.
సాధారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపీ విభాగం పని చేస్తుంటుంది. మెడిసిన్ విభాగానికి చెందిన ఓపీ-2, 3కు మాత్రం అత్యధిక ంగా రోగులు బారులు తీరుతున్నందున అందుబాటులో ఉన్న ఇద్దరు వైద్యులే నిర్ణీత సమయాన్ని లెక్క చేయకుండా అందరికీ వైద ్యం అందిస్తున్నారు. దీంతో వారు కూడా కేసులు చూసేందుకు అవస్థలు పడుతున్నారు. ఒక్కో రోగికి అవకాశం రావాలంటే గంటల కొద్దీ వేచి ఉండక తప్పడం లేదు.
అసలే ఎండా కాలం కావడం.. జనం కిక్కిరిసి ఉండడంతో ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు. జ్వరం వల్ల నీరసించి, నిలుచోలేని పరిస్థితిలో రోగులు వస్తున్నారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేకపోతోంది. ప్రధానంగా మహిళలు ఇబ్బందులు చెప్పనలవి కాదు.
కనుచూపు మేర క్యూ ఉండడంతో ఎప్పటికి తమ వంతు వస్తుందోనన్న ఆందోళనతో కొంతమంది రోగులు నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్లారు. కొంతమంది రోగులు ఉక్కపోత నుంచి రక్షణ కోసం ఏకంగా విసనకర్రలను వెంట తెచ్చుకుని క్యూలో నిలబడి ఉంటున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు విధి లేక గంటల కొద్దీ నిల్చొని వైద్య సేవలు పొందారు.