మందుల్లేవ్ !
- పేదల వైద్యనికి జబ్బు
– సర్వజనాస్పత్రిలో మందుల కొరత
– చిన్నపాటి వ్యాధులకు మందుల్లేని వైనం
– ప్రైవేట్ బాట పడుతున్న రోగులు
అనంతపురం మెడికల్ : నగరంలోని సర్వజనాస్పత్రికి వచ్చే చాలా మంది ఇలా అరకొర మాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు. చిన్న పాటి వ్యాధులకు కూడా మందులు అందుబాటులో లేని దయనీయ పరిస్థితి ఉండటంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. దగ్గు నివారణకు వాడే ఆంబ్రాక్సిల్.. కడుపు నొప్పి తగ్గించేందుకు ఇచ్చే సైక్లోఫాం.. గుండె సంబంధిత వ్యాధులకు అవసరమయ్యే సార్బిట్రేడ్.. ఆయాసం నుంచి ఉపశమనం కోసం వాడే బుడెసునైడ్ నెబులైజింగ్ సొల్యూషన్, సాల్బుటమాల్.. రక్తస్రావం కాకుండా ఉండేందుకు ఉపయోగించి ఫ్యాక్టర్–9.. ఇలా చిన్నపాటి వ్యాధులకు కూడా మందుల్లేవ్. జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో పది రోజులుగా ఇదే పరిస్థితి. అయినా అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రోగులు పలు రకాల మాత్రలను బయట కొనుక్కుంటున్నారు.
జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సీహెచ్‌సీలు ఉండగా గత ఆర్థిక సంవత్సరం మందుల వినియోగం ఆధారంగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు చేశారు. గత ఏడాది చివర్లో జిల్లా వ్యాప్తంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలడంతో అన్ని చోట్లా ఔట్‌పేషెంట్స్ సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో బడ్జెట్ కూడా జనవరి నాటికే అయిపోయిన పరిస్థితి. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి 2016–17కి గానూ మందుల కోసం రూ.3.29 కోట్ల బడ్జెట్ ఉండగా అది అయిపోయింది. దీంతో ఫిబ్రవరిలో అదనంగా రూ.కోటి విడుదల చేశారు. ఉరవకొండ, రాయదుర్గం, గుత్తి, కదిరి, చెన్నేకొత్తపల్లి, పామిడి, శింగనమల వంటి సుమారు 40 ఆస్పత్రులకు సైతం అదనంగా రూ.60 లక్షల వరకు బడ్జెట్ విడుదలైంది. వీటితో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారు.
చాలా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కూడా మందుల కొరత ఉన్న నేపథ్యంతో పాటు వైద్యులు సరిగా చూడటం లేదన్న కారణంగా సర్వజనాస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌పేషెంట్స్ 850 మంది వరకు ఉంటుండగా ఔట్‌పేషెంట్స్ (ఓపీ) సుమారు 1500 వరకు ఉంటోంది. ఓపీకి వచ్చే కేసుల్లో సగం వరకు జ్వరం, దగ్గు, కడుపునొప్పి, గుండె సంబంధిత వ్యాధులవే ఉంటున్నాయి. ఈ క్రమంలో మందుల కొరత వేధిస్తోంది. జేఎన్‌టీయూ సమీపంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు అన్ని ఆస్పత్రులకు సరఫరా అవుతాయి. ఇక్కడ ఏవైనా మందులు లేకుంటే ‘నాన్ అవైలబులిటీ (ఎన్‌ఏ)’ సర్టిఫికెట్ ఇస్తే స్థానికంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఆస్పత్రుల నుంచి ‘ఎన్‌ఏ’ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నా సకాలంలో డ్రగ్ స్టోర్ నుంచి స్పందన రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజుల తరబడి మందులు అందుబాటులో ఉంచుకోని పరిస్థితి తలెత్తుతోంది. కొన్ని రకాల మందులు డ్రగ్ స్టోర్‌లో ఉంటున్నా ‘అనాలసిస్’ కాకపోవడంతో పంపిణీకి నోచుకోవడం లేదని సమాచారం.
రోగులపై ఆర్థికభారం :
సర్వజనాస్పత్రికి ఒక్క అనంతపురం నగరం నుంచే కాకుండా చుట్టు పక్కల మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్య రోగులు వస్తుంటారు. రానూపోనూ చార్జీల భారం ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ మందులు కూడా సరిపడా ఇవ్వడం లేదు. దీంతో వారం రోజుల తర్వాత మళ్లీ రావాల్సిన పరిస్థితి. కొన్ని రకాల మందులు బయట కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి 20 రకాల యాంటి బయాటిక్స్, 220 రకాల మందులు, సిరప్స్, సూదులు, సెలైన్ బాటిల్స్, సర్జికల్ మందుల కోసం ప్రతి ఆస్పత్రికి పడకల సామర్థ్యాన్ని బట్టి మందులు కేటాయిస్తున్నారు. అయితే అన్ని రకాలు అందుబాటులో ఉంచుకోవడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు.