ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు రామచంద్ర, విజయమ్మ. వీరిది కదిరి. కూలికెళితేనే పూటగడిచేది. ఈనెల 18న తమ ఆరేళ్ల కూతురు రేవతికి జబ్బు చేయడంతో సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. పరీక్షించిన వైద్యులు షుగర్ ఉందని తెలిపారు. రోజూ షుగర్ పరీక్ష చేసి ఇన్సులిన్ ఇవ్వాలని చెప్పారు. మొదట్లో ఐవీ ఫ్లూయిడ్స్ లేకపోవడంతో ప్రైవేట్‌గా రూ.700 కొనుగోలు చేశారు. ఇక షుగర్ టెస్ట్ కోసం ఉపయోగించే స్ట్రిప్స్ కూడా ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో రామచంద్ర, విజయమ్మ దంపతులు రూ.800 వెచ్చించి ప్రైవేట్‌గా కొనుగోలు చేశారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మందులు, ఖర్చులకు రూ.3,500 వరకు ఖర్చు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు తమ ఆదాయం రూ.8 వేలు మాత్రమేనని, ఇంకా ఇద్దరు పిల్లలున్నారని, నెలకు రూ.3500 ఖర్చు చేయాల్సి వస్తే తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తమై రోగులకు మందులందించేలా చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. కాటన్ మొదలు కొని ఐవీ ఫ్లూయిడ్స్, క్యాన్‌లా, 2సీసీ సిరంజీలు, సెఫిగ్జెమ్, ఆంపిసిల్లిన్, సిఫ్ట్రోఫ్లాక్సిన్, సీపీఎం, విటమిన్ సిరప్‌లు, షుగర్ స్ట్రిప్స్ లేవు. రెండు నెలలుగా ఇదే దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రోగుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా.. అది మాటలకే పరిమితమవుతోంది.
కాటన్‌కూ కటకట..
రోగులకు ఫస్ట్ ఎయిడ్, ఇంజెక్షన్స్ వేయడం మొదలుకుని ప్రతి పనికీ కాటన్ (దూది) తప్పనిసరి. అటువంటి కాటన్ సరఫరా ఆగిపోయింది. చిన్నపిల్లల వార్డు, లేబర్, గైనిక్, ఆర్థో, మెడిసిన్ తదితర వార్డులో కాటన్ లేకపోవడంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులకు కాటన్‌ను బయటి నుంచి తెప్పించే దారుణమైన పరిస్థితి నెలకొంది.
గర్భిణుల అవస్థలు
ఆస్పత్రిలో ప్రసవం చేయించుకునే గర్భిణులు రూ.వేలు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఐవీ సెట్ల నుంచి సెర్విప్రిమ్ జెల్‌లాంటివి బయట తెచ్చుకుంటున్నారు. సెర్విప్రిమ్‌జెల్ అనే మందు కాన్పు త్వరగా అయ్యేందుకు ఉపయోగిస్తారు. ఈ జెల్ ప్రైవేట్‌గా రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో రోజూ 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 20 సాధారణ ప్రసవాలు జరుగుతాయి. సాధారణ ప్రసవాలకు జెల్ తప్పనిసరి. కానీ స్టాఫ్‌నర్సులు ఇండెంట్ పెడుతున్నా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోవడం లేదు.
మూలుగుతున్న నిధులు
సర్వజనాస్పత్రిలో ఎమర్జెన్సీగా మందులు కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు నిధులు ఉన్నట్లు తెల్సింది. అత్యవసరానికి ఈ డబ్బులు వినియోగించవచ్చు. ఆస్పత్రి యాజమాన్యం ఇండెంట్ పెట్టామని చెబుతున్నా... రోజూ రూ.5 వేలు కొనే సౌలభ్యం ఉంది. ఇందులోనుంచైనా కాటన్ కొనుగోలు చేయవచ్చు. కానీ అటువంటి పరిస్థితి లేదు. పోస్టునేటర్ వార్డులో అడ్మిషన్‌లో ఉన్న ఈమె చెన్నంపల్లికి చెందిన పర్వీన. మూడ్రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎస్‌ఎన్‌సీయూలోని వైద్యులు పరీక్షించి మూడు రకాల మందులు ప్రైవేట్‌గా తెచ్చుకోవాలని రాశారు. ఎందుకని ప్రశ్నిస్తే ఆస్పత్రికి మందులు సరఫరా కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది
కొరత వాస్తవమే
ఆస్పత్రిలో మార్చి నుంచి మందుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే మందుల కోసం ఇండెంట్ పెట్టారు. విజయవాడ నుంచి సరఫరా కావాల్సి ఉంది. – డాక్టర్ వెంకటేశ్వర రావు,ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment