వైద్యులు లేని పెద్దాసుపత్రిలోని ఆయుష్ విభాగం
ఆయుష్ విభాగాలు నిర్వీర్యమవుతున్నాయి. ఈ వైద్య విధానాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తూ కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. జిల్లా కేంద్రమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆయుష్ విభాగంలో ఒక్క వైద్యుడూ లేకపోవడం..మందులు కొరత అందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కర్నూలు(హాస్పిటల్): పెద్దాసుపత్రిలోని ఆయుష్ విభాగంలో రెగ్యులర్ హోమియో వైద్యుడిగా ఉన్న డాక్టర్ వెంకటయ్య 2016 మే 19వ తేదీన బదిలీపై తెలంగాణాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన స్థానంలో డాక్టర్ సుజాతను నియమించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమె విధులకు సక్రమంగా హాజరయ్యేది కాదు. గత డిసెంబర్‌లో ఆమె గుడివాడకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. అప్పటి నుంచి బ్రాహ్మణకొట్కూరులో పనిచేస్తున్న డాక్టర్ భారతిని సోమ, బుధ, శుక్రవారాలు, ఆత్మకూరులో పనిచేస్తున్న డాక్టర్ జవహర్‌లాల్‌ను మంగళ, గురు, శనివారాల్లో డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేసేటట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ భారతి రెగ్యులర్‌గా వస్తున్నా కొంత కాలంగా డాక్టర్ జవహర్‌లాల్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎవ్వరూ రావడం లేదు.
రోగులు మాత్రం ఆసుపత్రికి వచ్చి వెనుతిరిగిపోతున్నారు. డిస్పెన్సరీలో డాక్టర్లు ఉంటారో..ఉండరోననే ఉద్దేశంతో ఇటీవల వారు రావడం కూడా మానేశారు. గతంలో ఇక్కడ రోజుకు 70 నుంచి 120 వరకు రోగులు చికిత్స కోసం వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఆయుర్వేద డిస్పెన్సరీలో 2017 జూన్‌లో డాక్టర్ పీవీ నాగరాజ బదిలీపై బనగానపల్లికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇక్కడ ఏ ఒక్కరినీ నియమించలేదు. పాణ్యంలో పనిచేస్తున్న డాక్టర్ గ్రేస్ సెలెస్టియల్ సోమ, బుధ, శుక్రవారాలు మాత్రమే వస్తూ రోగులను పరీక్షిస్తున్నారు. మిగిలిన రోజుల్లో వైద్యులు లేక రోగులు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు.
ఆయుర్వేదంలో మందులు ఖాళీ
ఆయుర్వేద విభాగంలో మందులు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వం వద్ద ఆయుష్‌నిధులు పుష్కలంగా ఉన్నా ఇక్కడ మాత్రం మందుల కొరత వేధిస్తోంది. ఉండాల్సిన మందుల్లో 10 శాతం కూడా లేవు. వచ్చిన రోగులకు వైద్యులు ప్రైవేటుకు మందులు రాయాల్సి వస్తోంది. రెండు విభాగాల్లో డాక్టర్లు లేకపోవడంతో ఇక్కడ పనిచేసే ఫార్మాసిస్టులే రోగులకు పెద్ద దిక్కుగా మారారు.
రెండు నెలలుగా మందులు లేవు
నాకు గ్యాస్ట్రబుల్, కీళ్లనొప్పులు, షుగర్ వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులకు నేను గతంలో ఆయుర్వేద వైద్యాన్ని వాడుతూ తగ్గించుకున్నాను. ఆ మందులే నాకు బాగా పనిచేసేవి. ప్రైవేటుగా మందులు కొనుగోలు చేసినా ఇక్కడ ఇచ్చినంతగా పనిచేసేవి కావు. అయితే రెండు నెలల నుంచి ఇక్కడ మందులు లేకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది. –బి. నరసింహులు, రిటైర్డ్ సూపరింటెండెంట్, విద్యాశాఖ
Comments
Please login to add a commentAdd a comment