బెల్టు షాపుల్లేవట! | Sapullevata belt! | Sakshi
Sakshi News home page

బెల్టు షాపుల్లేవట!

Published Mon, Sep 29 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

బెల్టు షాపుల్లేవట!

బెల్టు షాపుల్లేవట!

జిల్లాలో మద్యం అక్రమ అమ్మకాలు అస్సలు జరగడం లేదంట! అంతా పద్ధతిగానే జరుగుతోందట! వినేవాళ్లు వుండాలే గానీ.. మన ఎక్సైజ్ అధికారులు ఏమైనా చెబుతారు. తాము నమ్మడమే కాకుండా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.  పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ పట్టించుకోలేదనుకుంటుందట. అచ్చం ఎక్సైజ్ అధికారుల తీరూ ఇలానే ఉంది. క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నా ‘అబ్బే.. ఎక్కడా అలాంటివి జరగడం లేదండీ’ అంటూ మాయమాటలు చెబుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అధికార పార్టీ అండతో మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. ఆ సమాచారం తెలిసినా.. అధికారులు మాత్రం ఆవైపు కన్నెత్తి చూడడం లేదు.
 
 అనంతపురం క్రై ం :
 మీకో విషయం తెలుసా.. జిల్లాలోని అనంతపురం, పెనుకొండ ఎక్సై జ్ పరిధిలో కేవలం లెసైన్స్‌డ్ మద్యం దుకాణాలు, బార్లలో మినహా మరెక్కడా ‘బైనాక్యులర్’ పెట్టి వెతికినా మద్యం దొరకదంట.
 అబ్బ..ఛా..ఎవరు చెప్పారేంటి?
 మీకీ సందేహం వస్తుందని తెలుసు. మేం చెప్పకపోతే నమ్మరేమోనని ఎక్సైజ్ ఉన్నతాధికారులనే అడిగాం. వాళ్లే చెప్పారు. అంతా ఒకేనంట.


 వాళ్లు చెబితే మీరు నమ్మేస్తారా?
 అయ్యో.. రామా.. మీరు మరీను. ఆ శాఖ అధికారులు మనల్ని తప్పుదోవ పట్టిస్తారా? ఉన్నదున్నట్టే చెప్పుంటారు. అంతగా చెబుతున్నారు కదా మీకు తెలిసి దుకాణాల్లో కాకుండా బయట ఎక్కడైనా మందు దొరుకుతుందా?
 అనంతపురం, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, పెనుకొండ, హిందూపురం, రొద్దం, చిలమత్తూరు.. ఇలా
 చాలా మండలాల్లో ఎక్కడైనా..ఎప్పుడైనా.. సమయం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే..కావాల్సినంత మద్యం క్షణాల్లో లభ్యమవుతుంది.  మరి అధికారులు అలా చెబుతున్నారేంటి? మీరే ఏదో పొరబడుతున్నట్లున్నారు?అయితే మేం కొన్ని అడ్రస్‌లు చెబుతాం. అక్కడికెళ్లి చూడండి. మేం చెప్పినట్లు మీకు కావాల్సిన మద్యం దొరక్కపోతే అప్పుడు నిలదీయండి.
 అంటే ఇదంతా అధికారులకు నిజంగా తెలుసుండదంటారా.. ఒకవేళ తెలిస్తే అలా ఎందుకు చెప్తారు?  
 మీకు మరీ చాదస్తమనుకుంటా. ప్రతి లెసైన్సు దుకాణానికి అనుబంధంగా కనీసం మూడు, నాలుగు బెల్టు షాపులున్నాయి. అసలు దుకాణంలో ఎలాగూ ఎమ్మార్పీకే విక్రయించాలి. ఇది గిట్టుబాటయ్యేది కాదు. అందుకే ‘బెల్ట్’ పెట్టి పల్లె ముంగిట్లోకి మద్యం తీసుకొస్తున్నారు. అర్ధరాత్రీ.. అపరాత్రీ అని లేకుండా అమ్ముతున్నారు. ఇంకేముంది వాళ్లు చెప్పిన ధరకే కొనుక్కుని మందుబాబులు నిషాలో తేలుతుంటే.. వాళ్ల బలహీనతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు పండగ చేసుకుటుంన్నారు. ఇదేమీ రహస్యంగా జరిగేది కాదు కదా? అన్నీ అధికారులకు ఎరుకే. ఈ దుకాణాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరన్నది బహిరంగ రహస్యం.


 =అప్పుడప్పుడు దాడులు చేస్తేనే..
 అనంతపురం ఎక్సైజ్ జిల్లా పరిధిలోని 25 మండలాల్లో 136 లెసైన్స్‌డ్ మద్యం దుకాణాలు, 3 బార్ అండ్  రెస్టారెంట్లు, ఒక క్లబ్ ఉంది. వీటిద్వారా ప్రభుత్వానికి మొదట విడతగా (నాలు గు నెలలు) రూ. 18.70 కోట్లు ఆదాయం వచ్చింది.  మూన్నెళ్లలో (జూన్, జూలై, ఆగస్టు) 216 మద్యం అక్రమ వ్యాపార కే సులు నమోదయ్యాయి. 257 మందిని అరెస్టు చేశారు. 3227 లీ టర్ల మద్యం (ఐఎంఎల్), 199 లీటర్ల బీరును, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు దాడులు చేసినప్పుడు మాత్రమే దొరికినవి. ఇక రోజువారీగా దాడులు చేస్తే వీటి సంఖ్య ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు.  


 పెనుకొండ ఎక్సైజ్ జిల్లాలో 41 కేసులేనట!
 25 మండలాలున్న అనంతపురం ఎక్సైజ్ జిల్లాలో మూన్నెళ్లలో (జూన్, జూలై, ఆగస్టు) 216 కేసులు నమోదైతే 38 మం డలాలున్న పెనుకొండ ఎక్సైజ్ జిల్లాలో కేవలం 41 కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం. 43 మందిని అరెస్టు చేసి 896 బాటిళ్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ 93 మద్యం షాపులు, 5 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉండి, అధిక మండలాలున్న చోటు కేసులు అంతంతమాత్రంగానే నమోదవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. కొంత మంది మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలున్నాయి. పైగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ సిబ్బంది కేసుల విషయంలో ముందగుడు వేయలేకపోతున్నట్లు సమాచారం.  
 
 బెల్టు షాపులివి...గో
 = అనంతపురం రూరల్  పరిధిలోని పిల్లిగుండ్లకాలనీలో ఓ ఇంట్లో ఎప్పుడెళ్లినా మద్యం లభిస్తుంది. కంకర ఫ్యాక్టరీ సమీపంలో కూల్‌డ్రింక్ షాపుల్లో అర్ధరాత్రయినా ‘కిక్’ ఎక్కుతుంది. జాకీర్‌కొట్టాలులో మసీదు సమీపంలోని ఓ ఇంట్లో మద్యం అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు.
 = బుక్కరాయసముద్రంలో అర్ధరాత్రి వెళ్లిన తాగుతూ తూలొచ్చు. ఇదే మండలం భద్రంపల్లిలోని ఓ నివాసంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.  
 = కూడేరులో బ్రాంది షాపు సమీపంలో ఉన్న కూల్‌డ్రింక్ షాపులో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారు. ఏ సమయంలోనైనా ఇక్కడ  మద్యం లభిస్తుంది.
 = గార్లదిన్నె మండలం మర్తాడు, పెనకచెర్ల డ్యాం, కల్లూరులో లూజు విక్రయాలు జరుగుతున్నాయి. ఎప్పుడెళ్లినా మద్యం సీసా మీ ముందు పెడతారు.  
 = బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, కేకే ఆగ్రహారం, కొర్రపాడు, రోటరీపురం, వడియంపేట గ్రామాల్లో మద్యం అనధికారికంగా అమ్ముతున్నారు.
 = శింగనమల మండలం ఉల్లికల్లు, తూర్పు నరసాపురం, ఆకులేడు గ్రామాల్లో మద్యం లభిస్తుంది.  
 = చిలమత్తూరు మండలం సోమఘట్టలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో, మధురేపల్లిలో బస్టాండ్ దగ్గర, కల్లుకుంటలోని ఓ చిల్లర దుకాణంలో, దేమకేతేపల్లి బీసీ కాలనీలోని అంగన్‌వాడీ సెంటర్ సమీపంలో అనధికార మద్యం దుకాణాలు దర్శనమిస్తాయి. ఇదే మండలం చాగలేరులోని బస్టాండ్ వద్ద, మొరసలపల్లి ప్రధాన వీధిలోని ఓ చిల్లర దుకాణంలో, పలగలపల్లిలోని మసీదు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో మందు లభిస్తుంది. ఈ బెల్టు షాపుల్లో రోజూ కొనుగోలు చేసే వారికి మాత్రమే తొందరగా మద్యం దొరుకుతుంది. కొత్త వ్యక్తులెవరైనా వస్తే కొంచెం ఆలోచించి ఇస్తారు.
 = పెనుకొండ మండలం అడదాకులపల్లి, పెద్దమంతూ రు, కలిపి, లక్కసానపల్లి, తిమ్మాపురం గ్రామాలతో పాటు రొద్దం మండలం కోగిర, ఆర్.లోచర్ల, రొద్దం పట్టణం, నారనాగేపల్లి, గోనిమేకులపల్లి గ్రామాల్లో అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో బెల్టు షాపులు ఉన్నాయి.  
 
 రెచ్చిపోతున్న ‘తమ్ముళ్లు’
 చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి కాగానే బెల్టు షాపులు తొలగిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎలాగూ ఆయన సీఎం అయ్యారు. ముందు చెప్పినట్లుగానే బెల్టు షాపుల ఎత్తివేతకు సంబంధించి ఫైలుపై సంతకమూ చేశారు. అంతే.. ఆ మరుసటి రోజే ఎకై ్సజ్ అధికారులు నానా హడావుడి చేసి దాడులు కూడా చేశారు. హమ్మయ్య.. బాబొచ్చారు.. బెల్టు తీశారు అని జనం అనుకునేలోపే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ‘బాబొచ్చాడు..మనకెవరు అడ్డు’ అన్న చందంగా మద్యం అక్రమ అమ్మకాలు తీవ్రం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో మెజార్టీ శాతం తెలుగుదేశం పార్టీ నేతల అనుచరులకు సంబంధించినవే కావడం గమనార్హం. అందుకే అధికారం ఎలాగూ ఉంది.. మమ్మల్నెవరేం చేస్తారనుకుంటున్న తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. వాళ్ల జోలికెందుకెళ్లడం.. అంతో ఇంతో తీసుకుని కళ్లు మూసుకుందాం అన్నట్లు ఎకై ్సజ్ అధికారులు వ్యవహరిస్తున్నారు.  
 
 సమాచారం అందితే వెంటనే దాడులు చేస్తాం
 పెనుకొండ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని బెల్టు షాపుల సమాచారంపై ఈఎస్ నాగమద్దయ్యను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఏఈఎస్ శ్రీనివాసులును సంప్రదించగా.. తమ పరిధిలో ఎలాంటి బెల్టు షాపులు లేవన్నారు. దీనిపై పూర్తి నిఘా ఉంచామని, బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు చేస్తామన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  
 
 దాదాపు ఎక్కడా లేవు
 అనంతపురం ఎక్సైజ్ జిల్లా పరిధిలో బెల్టు షాపులు దాదాపు ఎక్కడా లేవు. కొన్ని చోట్ల అనధికారికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచాం. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి మందు సరఫరా చేస్తున్న షాపులపై కూడా చర్యలు తీసుకుంటాం. 5 వేలు జనాభా కల్గిన ప్రాంతంలోని లెసైన్స్‌డ్ షాపునకు ఒక పర్మిట్ రూంకు అనుమతి ఉంటుంది. ఇక్కడ కేవలం మద్యం తాగేందుకు మాత్రం అనుమతించాలి తప్ప ఎలాంటి అమ్మకాలు జరగకూడదు. స్టాకు పెట్టుకోకూడదు. అలాగుంటే బెల్టుషాపు కిందే పరిగణించి కేసులు నమోదు చేస్తాం.  - ప్రణవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement