మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించాలి
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు
నెల్లూరు(క్రైమ్): మద్యం విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ, అనధికార మద్యం విక్రయాలను నియంత్రించాలని సూచించారు. విధిగా మద్యం దుకాణాలు, బార్లను తనిఖీ చేసి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపాలన్నారు. బెల్టుషాపులపై దాడులు నిర్వహించి నిర్వాహకులతో పాటు మద్యం సరఫరా చేసే దుకాణాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై దాబాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని సూచించారు. నిబంధనల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టీ శ్రీనివాసరావు, ఏసీ చెన్నకేశవరావు, నెల్లూరు, గూడూరు ఈఎస్‌ఐలు బలరామకృష్ణ, విజయ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అనంతరం తిరుపతికి బయలుదేరి వెళ్లారు.