బ్లడ్‌బ్యాంకులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల కొరడా
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రాలపై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝుళిపిం చింది. రాష్ట్రంలోని 132 బ్లడ్ బ్యాంకుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిల్లో చాలా వరకు రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయకపోగా, నిర్ధేశించిన ధర కన్నా అధిక మొత్తానికి రక్తాన్ని అమ్ముతున్నట్లు గుర్తించింది. అర్హులైన టెక్నిషియన్లు లేకపోవడం, దాత నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి శుద్ధి చేసిన తర్వాత నిల్వచేయడం, చివరకు బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, ఇలా అంతా లోపభూయిష్టంగా ఉన్నట్లు వెల్లడయింది.
బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రితోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులు సహా 109 కేంద్రాలకు నోటీసులు జారీ చేసిం ది. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే లెసైన్స్‌లను రద్దు చేయడంతోపాటు కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది.
గతంలో హెచ్చరించినా మారని తీరు...
తెలంగాణలో 132 బ్లడ్ బ్యాంకులు రిజిస్ట్రర్ కాగా, ఇందులో 35 స్టోరేజ్ సెంటర్లు ఉన్నా యి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధికంగా 61 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 21 ఉన్నాయి. నోటీసులు అందుకున్న వాటిలో గ్రేటర్‌లోని బ్లడ్ బ్యాంకులే ఎక్కువ. ఔషధ నియంత్రణ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సుల్తాన్‌బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతోపాటు నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి రక్తనిధి కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి కనీస వసతులు లేవని నోటీసులు జారీ చేశారు. అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ బాటిళ్లను సీజ్ చేశారు. నిలోఫర్‌లో 45 బాటిళ్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా ఆయా బ్లడ్‌బ్యాంకులు తీరు మార్చుకోలేదు.
తలసీమియా బాధితులకు విక్రయం..
డ్రగ్‌కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి రక్త కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలి. ఆరు మాసాలకోసారి కూడా అటువైపు చూడటం లేదు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన రక్తం లో 30 శాతం రక్తాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తలసీమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధనను పట్టించుకోకపోగా.. ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒ,ఎ, బి, నెగిటీవ్ రక్తంతో పాటు తెల్లరక్త కణాలు, ప్లాస్మా వంటివి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.