సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రానికి అనుకూలంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేసిన ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్(డీఐ)ను అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ డీఐ నుంచి బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ అవినితీ అధికారిని కోర్టులో హాజరు పరిచారు. లింగంపల్లి లక్ష్మీరెడ్డి 15 ఏళ్లుగా బోయిన్‌పల్లిలో జనని వాలంటరీ పేరుతో రక్తనిధి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. జంటనగరాల జోన్ కు డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న బొమ్మిశెట్టి లక్ష్మీ ఇటీవల ఆ రక్తనిధి కేంద్రంలో తనిఖీలు చేపట్టింది.
తనిఖీల సందర్భంగా రికార్డ్స్‌లో దాతల వివరాలు సరిగా లేకపోవడంతో పాటుగా రక్తం నిల్వ చేసిన గదిలో ఏసీ పని చేయడం లేదని డీఐ లక్ష్మీ గుర్తించి బ్లడ్ బ్యాంక్‌పై కేసు నమోదు చేసింది. రక్తనిధి కేంద్రాన్ని సీజ్ చేయకుండా ఉండాలంటే రూ.2 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతమొత్తం ఇచ్చుకోలేనని, నోటీసులిస్తే లోపాలను సరిదిద్దుకుంటానని లక్ష్మీరెడ్డి వేడుకుంది. తమకు కూడా టార్గెట్లు ఉన్నాయని, తాము కూడా పై అధికారులకు ముట్టజెప్పాలని, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ డీఐ హుకుం జారీ చేసింది. డీఐ వేధింపు లు భరించలేక బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది.
పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు
అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు లక్ష్మీరెడ్డి కబురు పంపించింది. అయితే డీఐ నగదు రూపంలో కాకుండా బంగారు ఆభరణాల రూపంలో కావాలని కోరింది. అప్పటికే ఏసీబీకి సమాచారం ఇచ్చిన రక్తనిధి నిర్వాహకురాలు లక్ష్మీరెడ్డి ఏసీబీ ప్రణాళిక ప్రకారం డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను గురువారం సాయంత్రం అబిడ్స్‌లోని ఓ బంగారు దుకాణానికి రప్పించింది. రూ.1.10 వేల విలువ చేసే బంగారు గొలుసు ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. అయితే లక్ష్మీరెడ్డి ప్రస్తుతం తనవద్ద ఇంత డబ్బుల్లేవని, ఇదే బంగారు గొలుసును మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను పంపివేసింది.
పట్టుబడిన ఆభరణాలతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి
ఆ తర్వాత ఆ గొలుసుకు డబ్బులు చెల్లించి, షాపు నుంచి బిల్లు తీసుకుంది. డీఐకి బంగారు గొలుసును ఇచ్చేందుకు లక్ష్మీరెడ్డి శుక్రవారం రాత్రి మధురానగర్ సూర్య అపార్ట్ మెంట్‌కు వెళ్లింది. డ్రగ్ ఇన్స్‌పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మికి బంగారు గొలుసును అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆమె నుంచి పలు నగలను కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ తతంగమంతా అధికారులు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తనిఖీల పేరుతో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వేంటనే 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment