ఏం చర్యలు తీసుకున్నారు ?
డ్రగ్స్ నియంత్రణ పై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ భూతాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరుపుతున్న దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేతిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం సహా 18 మందిని ప్రతివాదులుగా చేర్చారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు 2014లో బచ్‌పన్ బచావో ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కారణంగా 25 వేల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, డ్రగ్స్‌ను అరికట్టేందుకు తగిన విధానం రూపొందించి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం చర్యలు తీసుకోలేదని వివరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, గోవా, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ కారణంగా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2014లో దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ 2015లో ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు. తెలంగాణలో వందలాది మంది చిన్నారులు, సినీ ప్రముఖులు డ్రగ్స్ బారిన పడ్డారని, ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసు విభాగం దర్యాప్తు కూడా జరుపుతోందని వివరించారు.
వారిని బాధితులుగా చూస్తామన్నారు..
సిట్ దర్యాప్తులో పారదర్శకత లేదని, బృందంపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. పలుకుబడి కలిగిన వారు డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నందున ఎవరినీ అరెస్టు చేయలేదని వివరించారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో ఉంటే వారిని బాధితులుగానే చూస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్షలో అనడంతో ఈ కేసు నీరు గారిపోయిందని వివరించారు. 1,300 మంది విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, ఇలాంటి పరిస్థితుల్లో కేసును తీవ్రంగా పరిగణించాల్సిందని పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీం ఆదేశాల అమలు, ఇతర అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలేవో చెప్పాలని ఆదేశిస్తూ నవంబర్ 20కి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.