చంద్రబాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు | Supreme Court verdict on Chandrababu Govt scandals | Sakshi
Sakshi News home page

విచారిస్తేనే వెలుగులోకి! బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Published Thu, May 4 2023 4:10 AM | Last Updated on Thu, May 4 2023 8:53 AM

Supreme Court verdict on Chandrababu Govt scandals - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తప్పుగా అన్వయించింది. గత సర్కారు నిర్ణయాలను రద్దు చేసినట్లుగా హైకోర్టు పరిగణించిందన్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది వాదనలు సమర్థనీయంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను పరిశీలిస్తే.. గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించటాన్ని రద్దు చేస్తున్నట్లుగా భావించలేం. 
– ‘సుప్రీం’ ధర్మాసనం 

సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ సాంకేతిక కారణా­లతో తప్పించుకుని తిరుగుతున్న మాజీ సీఎం చంద్రబాబు బృందం అక్రమాలపై ‘స్టే’లను కొట్టివేస్తూ విచారణ కొనసాగించేందుకు వీలుగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ సర్కారు హయాంలో చోటు చేసుకున్న అవినీతి బాగోతాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ద్వారా విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణం తదితరాల విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది.

గత సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అవినీతి ఆరోపణలు, ఉల్లంఘనలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మంత్రివర్గ ఉప­సంఘం, సిట్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అసలు హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించింది.

కేసు మొత్తం ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఎంత మాత్రం సరికాదంది. ఈ జీవోలపై తదుపరి చర్యల నిలుపుదలకు హైకోర్టు చెప్పిన కారణాలు ఈ వ్యవహారానికి ఎంత మాత్రం సంబంధించినవి కావని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం సమీక్షించడానికి వీల్లేదన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

ఈ విషయం అసలు ప్రధాన కేసుకు ఎంత మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈమేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌ల ధర్మాసనం బుధవారం 13 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మనుసింఘ్వి, నిరంజన్‌రెడ్డి వాదించగా, ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపించారు. 

కేంద్రం, ఈడీని ప్రతివాదిగా చేర్చాలి..
గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు, తిరగరాసేందుకే మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ ఏర్పాటైనట్లు హైకోర్టు తప్పుగా భావించిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రెండు జీవోలను పరిగణలోకి తీసుకుంటే గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు, తిరగరాసేందుకు అవి జారీ అయ్యాయని ఎంత మాత్రం చెప్పజాలమంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకే మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ ఏర్పాటయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది.

అలాగే జీవోలను సవాల్‌ చేస్తూ టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆ పని చేసి ఉండకూడదని వ్యాఖ్యానించింది. ప్రధాన వ్యాజ్యాలను ఇంకా పరిష్కరించకుండా, సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్రం రాసిన లేఖపై కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే హైకోర్టు ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ను కొట్టేయడం సరికాదంది.

అసలు ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీ నేతలే కేంద్రం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చి ఉండాల్సిందని స్పష్టం చేసింది. టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం, ఈడీలు తప్పనిసరిగా అవసరమైన పార్టీలని తేల్చి చెప్పింది. వారిని హైకోర్టు ముందున్న వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతేకాక కేంద్రం, ఈడీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంది. చట్ట ప్రకారం కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలను మూడు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. 

నిగ్గు తేల్చిన ఉపసంఘం, సిట్‌...
టీడీపీ హయాంలో జరిగిన అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లతో పాటు నాటి విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఉల్లంఘనలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ 2019లో జీవో 1411 జారీ చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలతో పాటు పలు అంశాలపై సమీక్ష జరిపిన మంత్రి వర్గ ఉప సంఘం పలు ప్రాథమిక ఆధారాలతో ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది.

ఈ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020లో జీవో 344 జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సిట్‌ ఈ కుంభకోణాలు చాలా విస్తృతమైనవని, ఇందులో చాలా కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిని సీబీఐ దర్యాప్తునకు ఇవ్వడం సమంజసంగా ఉంటుందని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసి, ఈ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. 

పార్టీ ప్రయోజనం కోసమే వేశామన్నా పట్టించుకోని హైకోర్టు...
రాష్ట్ర ప్రభుత్వ లేఖపై కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు జీవోలను సవాలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో వారు ఉద్దేశపూర్వకంగానే సీబీఐ, ఈడీలను ప్రతివాదులుగా చేర్చలేదు. తమ పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్లు దాఖలు చేశామని వర్ల రామయ్య లిఖితపూర్వంగా కోర్టుకు చెప్పారు.

టీడీపీ నేతలు వేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు విచారణ జరిపారు. అసలు మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ ఏర్పాటు వల్ల పిటిషనర్లు వ్యక్తిగతంగా ఏ విధంగానూ ప్రభావితం కావడం లేదని, వారు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అంతేకాకుండా సీబీఐ, ఈడీలను ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేర్చాలంటూ అనుబంధ వ్యాజ్యాలను దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతల వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చారు. టీడీపీ నేతలు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం కొత్త ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పేశారు.

హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది..
2020లో హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్‌ చేసిన జస్టిస్‌ షా ధర్మాసనం బుధవారం తమ ఉత్తర్వులను వెలువరించింది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన పలు న్యాయపరమైన అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖను హైకోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది.
 
కేసు విచారణ సందర్భంగా ‘సుప్రీం’ వ్యాఖ్యలివీ
– పారదర్శకంగా ఉన్నప్పుడు సిట్‌ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు?
– గత ప్రభుత్వ అవినీతిని సమీక్షించకూడదంటే వందశాతం ఇమ్యునిటీ ఇచ్చినట్లే కదా? 
– పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా? 
– సీబీఐ విచారణకు స్వీకరించలేదంటే తప్పు జరగలేదని ముందే ఎలా ఊహించుకుంటారు?
– ప్రతి ఒక్కరూ చీకట్లోనే వెతుకుతారు? విచారణ జరిగితే అన్నీ వెలుగులోకి వస్తాయి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement