ఆంధప్రదేశ్‌లో 2014 నుంచి 2019 వరకు పాలన సాగించిన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేష పరిణామమే. కాని ఇప్పటికి మూడేళ్లపాటు ఈ విచారణ ముందుకు సాగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుకోగలిగారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణ చేయకుండా ప్రాధమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీం ఆక్షేపించింది. దీనిని ఎవరైనా స్వాగతించవలసిందే.
అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వ నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించకూడదంటే, గత పాలన హయాంలో జరిగిన అవినీతిని ఆ తర్వాత ప్రభుత్వం విచారించకూడదని న్యాయ వ్యవస్థ నిర్ణయం చేస్తే, ఎదురయ్యే దుష్పపరిణామాలపై చాలా చర్చ జరిగింది. నిజానికి ఈ కేసు లో పిటిషన్‌లు వేసిన వారికి ఈ స్కామ్ లతో నేరుగా సంబంధం లేదు. వారు ధర్డ్ పార్టీ అవుతారు. వారితో హైకోర్టులో పిటిషన్ వేయించి , ఇంతకాలం విచారణ జరపకుండా ఆటంకాలు సృష్టించిన టీడీపీ ఇకపై కూడా రకరకాల వ్యూహాలు అనుసరించి,కేసు ముందుకు సాగకుండా యత్నించవచ్చు. గౌరవ హైకోర్టు వారు ఇలాంటి అవినీతి కేసుల దర్యాప్తు మొదలు కాకుండానే ఎఫ్.ఐ.ఆర్.కొట్టివేసే పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా యధేచ్చగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడింది.
అమరావతి భూముల స్కామ్ , ఫైబర్ నెట్ స్కామ్, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అమరావతి అస్సైన్డ్ భూముల కుంభకోణం , అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు వంటి పలు ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వీటిపై కొత్తగా అదికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ద్వారా పరిశీలన చేయించింది. తదుపరి ఉప సంఘం సిఫారస్ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్ ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిట్ తమ పని మొదలు పెట్టిందో, లేదో తెలుగుదేశం పార్టీ వారు హైకోర్టును ఆశ్రయించడం ఆరంబించారు. అప్పట్లో హైకోర్టులో కూడా పలు ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన క్రమంలో ఈ విషయంలో కూడా ఎదురుదెబ్బే తగిలింది.
అయితే ఏపీ ప్రభుత్వం ఈ అవినీతి కేసుల విచారణను రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వంటివాటితో చేయించడానికి అభ్యంతరం లేదని చెప్పినా హైకోర్టు ఒప్పుకోలేదు. కారణం ఏమైనా , అలాంటి తీర్పులు సమాజానికి మేలు చేస్తాయా?లేదా? అన్న మీమాంస ఏర్పడింది. ఈ తీర్పుల ఆధారంగా టీడీపీ రెచ్చిపోయి, అసలు అవినీతే జరగలేదని కోర్టు తమకు సర్టిఫికెట్ ఇచ్చేసినంతగా ప్రచారం చేసుకునేది . జగన్ కాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కాని చేసిన ఆరోపణలలో పస లేదని అనేవారు.
విశేషమేమిటంటే కేసులు పెట్టకపోతే మీరు ఏమి పీకారు? ఒక్క దానిలో కూడా కేసు పెట్టలేకపోయారు? ఒక్క కేసు కూడా రుజువు చేయలేకపోయారు!అని వ్యాఖ్యానించేవారు. అదే కేసు పెట్టగానే ఇంకేముంది ఈ ప్రభుత్వం కక్ష కట్టిందని సానుభూతి కోసం మాట్లాడేవారు .ఇలా డబుల్ గేమ్ ఆడుతూ వచ్చిన టీడీపీకి ఇప్పుడు సుప్రింకోర్టు షాక్ ఇచ్చినట్లయింది. వారు ఇది ఊహించని విషయమే అయి ఉంటుంది. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. సిట్ దర్యాప్తునకు అభ్యంతరాలు తొలగిపోవడంతో అదికారులు తమ విచారణను వేగవంతం చేయవచ్చు.ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా పలువురు మంత్రులు ఈ కేసుల్లో చంద్రబాబు కూడా అరెస్టు అవక తప్పదని అంటున్నారు.
అది ఎంతవరకు జరుగుతుందనేది అప్పుడే చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబును తక్కువ అంచనా వేయజాలం. ఆయా వ్యవస్థను మేనేజ్ చేయడంలో ఆయన సిద్దహస్తుడన్న పేరు ఉంది. అరెస్టు సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే ఆయనపైన, ఆయన అనుచరులపైన నమోదైన కేసులలో విచారణకు స్వయంగా హాజరు కాక తప్పకపోవచ్చు. చంద్రబాబును ఒక విచారణాధికారి ముందు కూర్చోబెట్టి ప్రశ్నించగలిగితే అదే గొప్ప విషయం గా అనుకునే పరిస్థితి ఉంది.అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయినా ఆయా కేసులలో విచారణ ఎదుర్కున్నారేమో కాని, పస్తుత అధ్యక్షుడు బిడైన్ ఇంటిలో ఎఫ్ బి ఐ అదికారులు సోదాలు జరిపారేమో కాని, చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు ఉన్నా, ఎవరూ ఆయన దాకా వెళ్లలేకపోయారు.
చదవండి: విచారిస్తేనే వెలుగులోకి! బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
మన దేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ,ఎమ్.పిలకు ముడుపులు చెల్లించారన్న అభియోగం లో పివి నరసింహారావు వంటి మాజీ ప్రధానులు ,కొన్ని అవినీతి కేసులలో కొందరు మాజీ ముఖ్యమంత్రులు కూడా దర్యాప్తులకు అతీతంగా లేరు. కాని చంద్రబాబు మాత్రం ఏదో రకంగా రక్షణ పొందడమే ఆయన ప్రత్యేకత అని చెప్పాలి.ఉదాహరణకు ఓటు కు నోటు కేసును తీసుకోవచ్చు చార్జీషీట్ లో ముప్పైఆరుసార్లు చంద్రబాబు పాత్రపై ప్రస్తావన ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అనేవారు. కాని అంతిమంగా చంద్రబాబుపై ఎఫ్ ఐ ఆర్ కూడా పెట్టలేకపోయారు. అది చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్ అని చాలా మంది అబిప్రాయపడ్డారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక పలు ఆరోపణలపై చంద్రబాబు,మంత్రి నారాయణ, తదితరులపై కేసులు పెట్టినా అడుగు ముందుకు పడుతుందా?లేదా? అన్న సంశయం కలిగించగలిగారు.న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖుల బంధువులు కూడా ఇన్వాల్వ్ అయిన మరో కేసును హైకోర్టు కొట్టివేసింది.
చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే?
అది కూడా పెద్ద చర్చే అయింది. ఇలా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నా, పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగి ఈ కేసుల దర్యాప్తు సాగించడానికి ఇప్పటికి ఒక కొలిక్కి తీసుకు వచ్చినట్లు అనిపిస్తుంది. హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు వేసిన మెయిన్ పిటిషన్ లపై మూడు నెలల్లో విచారణ పూర్తి కావల్సి ఉంది. ఆ పిటిషన్ లు పెండింగులో ఉన్నా సిట్ దర్యాప్తుకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఆ పిటిషన్ లను హైకోర్టు కొట్టివేస్తే ప్రభుత్వం మరింత చురుకుగా ముందుకు వెళ్లవచ్చు.భిన్నమైన తీర్పు వస్తే మాత్రం మళ్లీ అడ్డంకులు ఏర్పడతాయి. కాని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలు ,ప్రత్యేకించి అసలు దర్యాప్తు ప్రాధమిక దశలో ఉండగానే స్టే ఇవ్వడం ఏమిటని సుప్రింకోర్టు ప్రశ్నించిన తీరు ప్రభావం హైకోర్టు విచారణలో ఎంతో కొంత పడుతుంది. సిబిఐ విచారణకు సిద్దపడడం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరే అంశం అవుతుంది.
అవినీతి ఆరోపణల కేసులలో న్యాయ వ్యవస్థ ఒక్కోసారి ఒక్కోరకంగా స్పందిస్తోందన్న భావన ఏర్పడడం మంచిది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందన్నది ఆరోపణ. దళితులకు సంబంధించిన వందల ఎకరాలను అక్రమంగా టీడీపీ నేతలు కాజేశారన్నది మరో అబియోగం. వీటిపై ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీలో చర్చించారు. పలు ఆధారాలు కూడా ప్రభుత్వం ప్రదర్శించింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో అయితే ముఖ్యమంత్రి జగన్ పూసగుచ్చినట్లు స్కామ్ జరిగిన తీరును వివరించారు. ఇంత చెప్పిన తర్వాత కూడా వాటిపై విచారణ జరిపి ఒక అర్ధవంతమైన ముగింపు తేలేకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాను అనుకున్నట్లు ఈ కేసులలో వేగం పెంచగలుగుతుందా?లేక చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్ మరోసారి బయటకు వస్తుందా అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment