రూ.2.10 లక్షల విలువైన అక్రమ మందులు సీజ్
భద్రాచలం :భద్రాచలం పట్టణంలో బుధవారం ఔషద నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెం, ఖమ్మం అర్భన్, రూరల్ డ్రగ్ ఇన్సిపెక్టర్‌లు జీ సురేందర్, వీ లక్ష్మీనారాయణ, కె సురేందర్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేశారు. ఐటీడీఏ రోడ్‌లోని చంద్రశేఖర్ హోమియో క్లినిక్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన రూ.10 వేల విలువ గల మందులను, రెడ్‌క్రాస్ బిల్డిండ్ ఎదురుగా ఉన్న శ్రీవెంకటరమణ నర్సింగ్ హోమ్‌లో రూ.2 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు.
వీటి నిల్వలకు ఎటువంటి అనుమతులు లేకపోవటంతో సీజ్ చేశారు. భద్రాచలం పట్టణంలో ఔషద నియంత్రణ అధికారుల తనిఖీలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదుల నేపథ్యంలో సదరు అధికారులు నేరుగా రెండు ఆసుపత్రులను తనిఖీ చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, పట్టణంలోని ఇతర ఆసుపత్రులు, హోల్‌సేల్, రిటైల్ మందుల దుకాణాల జోలికి వెళ్లకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
భద్రాచలం కేంద్రంగా ఉన్న కొన్ని హోల్‌సేల్ దుకాణాలు నాసిరకం మందులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో తిరిగే ఆర్‌ఎంపీలతో ఒప్పందం కుదుర్చుకున్న కొంతమంది హోల్‌సేల్ మందుల విక్రయ దుకాణదారులు పెద్దఎత్తున నిల్వలు చేసి సరఫరా చేస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం ఈ దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప, ఔషధ నియంత్రణ అధికారులు మందులు దుకాణాలు, ఆసుపత్రులపై తనిఖీలు చేయాలనే ఆలోచన లేకపోవటం కూడా వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
భద్రాచలంలో తనిఖీల కోసమని వచ్చిన ఔషధ నియంత్రణ అధికారులకు పట్టణంలో పేరుమోసిన మందుల విక్రయ దుకాణదారులు రాచ మర్యాదలు చేయటం గమనార్హం. సదరు అధికారులు హోటల్‌లో అల్పాహారం తీసుకునే సమయంలో కూడా కొంతమంది మందుల దుకాణ యజమానులు వారికి సేవలు చేస్తూ కనిపించారు. తనిఖీల కోసమని వచ్చిన సందర్భంలో ఇలా మందుల దుకాణదారులను వెంట వేసుకొని తిరగటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా ఔషధ నియంత్రణ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు భద్రాచలం కేంద్రంగా సాగుతున్న అక్రమాలపై దృష్టి సారించాల్సుంది.
భద్రాద్రిలో ‘ఔషధ’ తనిఖీలు
Published Thu, May 7 2015 2:50 AM | Last Updated on Fri, May 25 2018 2:47 PM
Advertisement
Advertisement