‘దగా’ ఖానా | Funded largely by the development of mandatory | Sakshi
Sakshi News home page

‘దగా’ ఖానా

Published Tue, Dec 10 2013 4:52 AM | Last Updated on Fri, May 25 2018 2:47 PM

‘దగా’ ఖానా - Sakshi

‘దగా’ ఖానా

ధర్మాస్పత్రుల్లో మందులు కరువు
 =దవాఖానాలకు వచ్చి దగాపడుతున్న రోగులు
 =సాధారణ మందులూ బయట కొనాల్సిందే..
 =బడ్జెట్ ఉన్నా వినియోగించని వైనం
 =వృథాగా మూలుగుతున్న అభివృద్ధి కమిటీ నిధులు

 
సాక్షి, సిటీబ్యూరో: రాజు కరీంనగర్ జిల్లా హనుమాజీపేట వాసి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయమై రక్తస్రావం ఆగలేదు. అక్కడి వైద్యుల సూచనతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి.. హిమోఫీలియా ఉండటంతో రక్తస్రావమవుతోందని గుర్తించారు. అయితే, అందుకు సంబంధించిన మందుల్లేవని చేతులేత్తేసి చోద్యం చూశారు. దీంతో వైద్యం అందని దైన్యస్థితిలో రాజు ప్రాణాలు వదిలాడు. కనీసం వేరేచోటకు తీసుకెళ్లాలని సూచించినా అతని ప్రాణాలు దక్కేవి.

శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వంద శాతం బతికే అవకాశం ఉన్నా.. కేవలం మందుల్లేవన్న సాకుతో వైద్యులు గుడ్లప్పగించి చూడ్డం వల్లే 25 ఏళ్లకే రాజుకు నూరేళ్లు నిండాయంటూ బంధువులు గుండెలు పగిలేలా రోదించారు. వైద్యుల తీరును నిరసిస్తూ హిమోఫీలియా సొసైటీ ఆందోళనకు దిగింది. మాదాపూర్ ప్రాంతంలో ఉండే రత్తమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్సకు అవసరమైన మందులు బయటి నుంచి తెచ్చుకుంటే తప్ప తామేం చేయలేమని వైద్యులు చెప్పారు.
 
ణాలు పోయాల్సిన ధర్మాస్పత్రుల్లోని దారుణాలివి. ‘ఖానా’ ఎలాగూ లేదు.. కనీసం ‘దవా’కు కూడా గతిలేని దవాఖానాల మెట్లెక్కుతున్న రోగులు నిలువునా దగా పడుతున్నారు. ప్రఖ్యాతిగాంచిన గాంధీ, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక వైద్యమూ అందట్లేదు. సాధారణ మందులు కూడా అందుబాటులో ఉండట్లేదు. కనీసం గాయాన్ని తుడిచేందుకు దూదే కాదు.. కట్టుకట్టేందుకు బ్యాండేజ్‌లు కూడా దొరకని దుస్థితి నెలకొంది.

బీపీ, షుగర్ మాత్రల కోసం కూడా చీటీలు పట్టుకుని రోగి బంధువులు బయటి మెడికల్ దుకాణాలకు వెళ్తున్నారు. ప్రత్యేకించి ధర్మాస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసమే రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.. నిజానికి సూది కి, దూదికి గతిలేని దౌర్భాగ్య పరిస్థితి రాజ్యమేలుతోం ది. ఉస్మానియా, గాంధీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రిలోనూ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. ఆయా ఆస్పత్రులకు వస్తున్న రోగుల్ని మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
 
మందుల బడ్జెట్ సంగతేంటి?

నిజానికి ప్రభుత్వ కేటాయింపులతో పనిలేకుండా, గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాస్పత్రులకు సొంత బడ్జెట్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల వంటి సౌల భ్యాలు ఉన్నాయి. ఈ నిధులతో సాధారణ మందులను అందుబాటులో ఉంచవచ్చు. గాంధీకి ఏటా రూ.3 కోట్ల మేర, ఉస్మానియాకు రూ.4 కోట్ల మేర మందుల కొనుగోలు బడ్జెట్ ఉంది. కానీ, బ్యాండేజీ కోసం కూడా రోగులు బయటి మెడికల్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గాంధీ జనరల్ ఆస్పత్రిలో హిమోఫీలియా మందులు అందుబాటులో లేక శనివారం రాజు అనే యువకుడు నిస్సహాయస్థితిలో ప్రాణాలు వదిలాడు. హిమోఫీలియా ఉన్న వారికి చిన్న గాయమైనా రక్తస్రావమవుతూనే ఉంటుంది. నిజానికి ఈ వ్యాధికి సంబంధించిన మందుల్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కానీ గాంధీలో అవి అందుబాటులో లేవట!
 
  బోసిపోతున్న పసినవ్వులు


 ప్రభుత్వ నిర్లక్ష్యం చిన్నారుల ఉసురూ తీస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటరైన నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో నాజిల్ డ్రాప్స్‌కూ గతిలేదు. మోర్‌ఫెన్ సల్పైట్ 10 ఎంజీ ఇంజక్షన్, ఫెనోబార్బిటోన్ 20 ఎంజీ సిరప్, సెఫోటాక్సిమీ 250 ఎంజీ ఇంజక్షన్ వంటి మందుల్ని రోగులే బయటి నుంచి తెచ్చుకొంటున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులు మూలుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
 
 
 ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పు కష్టమే..


 సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రుల కు రోజూ సగటున 2000-3000 మంది గర్భిణిలు వస్తారు. వంద వరకు ప్రసవాలు జరుగుతాయి. కడు పు బిగుసుకుపోవడం, బేబీ మూవ్‌మెంట్ తగ్గిన గర్భిణిలకు ‘ఐసాక్స్ సుఫ్రిన్ హెచ్ సీఎల్’ఇంజక్షన్ ఇవ్వాలి. కానీ ఇది అందుబాటులో లేదు. బీపీతో బాధపడే గర్భిణిలకు ఇచ్చే మైథాల్ డోపాటాబ్లెట్స్‌తో పాటు క్లోఫిడోగ్రెల్ 75 ఎంజీ మాత్రం కొరతా తీవ్రంగా ఉంది.
 
  ఇక్కడికొస్తే ‘కిర్రాకే’..


 ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఓపీకి రోజూ 200-250 మంది రోగులు వస్తుంటారు. మానసిక సమస్యల నుంచి బయట పడేందుకు వస్తే.. తీరా ఇక్కడి పరిస్థితి వ్యాధి తీవ్రతను మరింత పెంచేలా ఉంది. మానసిక రుగ్మతతో బాధపడే వారికి ఇచ్చే సోడియం వాల్పొరేట్ 200ఎంజీ, సోడియం వలిజియేట్ 500 ఎంజీ, రెస్పిరిడోన్ 2,4 ఎంజీ టాబ్లెట్స్, ఫ్లూఫినైజిన్ 400 ఎంజీ ఇంజక్షన్లు లేవు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లోనూ వీటి లభ్యత లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు.
 
  గాంధీలోనూ అంతంత‘మాత్ర’మే!


 గాంధీ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఉచిత వైద్యం కోసం వచ్చిన నిరుపేద రోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. వివిధ రోగాలను నయం చేసేందుకు ఈ ఆస్పత్రిలో 67 రకాల ఇంజక్షన్లు, 50 రకాల టాబ్లెట్లు, 10 రకాల ఆయింట్‌మెంట్లు, 11 రకాల ఐవీప్లూయిడ్స్, 7 రకాల సిరప్‌లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే, వీటిలో చాలా వరకు మందులు అందుబాటులో లేవు. ఫిమైటోఇన్ సోడియం, కాల్షియం గ్లూకోనేట్, అట్రాక్యురియం, సిల్వర్ సల్ఫా వంటి ఇంజక్షన్లు, సిఫాలక్సిన్, మెట్రోనిడాజోలీ, ఫెర్రాయిస్ సల్ఫేట్, మల్టీవిటమిన్ వంటి టాబ్లెట్లు, ఏంప్లిసిలిన్, సోల్‌బుటామోల్ వంటి సిరప్‌లు అందుబాటులో లేవు.
 
  కంటి చుక్కలూ కరువే..


 సరోజినిదేవి కంటి ఆస్పత్రి అవుట్‌పేషంట్ విభాగానికి రోజూ 500-800 మంది రోగులు వస్తారు. రోజూ సగటున 30-40 శస్త్రచికిత్సలు జరుగుతాయి. మూడు రోజులుగా ఇక్కడ పోస్ట్ ఆపరేషన్ పేషంట్లుకు కనీసం యాంటీ ఐ డ్రాప్స్‌ను కూడా ఇవ్వట్లేదు. ఏపీహెచ్‌ఎంఐడీసీ నుంచి సరఫరా లేకపోతే..ఆస్పత్రి అభివృద్ధి కమిటి నిధులతో మందుల్ని కొనాలి. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇదే విషయమై తాజాగా ఇద్దరు సీనియర్ వైద్యుల మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. హోమాట్రోఫిన్, టోబ్రామైసిన్, టిమోలోల్, ట్రైపాన్‌బ్లూ, హైలెస్ ఇంజక్షన్లను రోగులే బయటి నుంచి సమకూర్చ్ఙుకొంటున్నారు.
 
 మందుల్లేవన్నారు..
 మాదాపూర్ లో ఉండే మేం దినసరి కూలీలం. మా అమ్మ రత ్తమ్మ (40) రెండ్రోజుల క్రితం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చాం. ఆసుపత్రిలో మందుల్లేవని చెప్పి వైద్యులు బయట నుంచి తెచ్చుకొమ్మన్నారు. చేసేది లేక రూ.150 విలువ చేసే మందులను ఆసుపత్రి ఆవరణలో ఉన్న మందుల దుకాణంలో కొనాల్సి వచ్చింది.
      - సుశీల, మాదాపూర్
 
 ఇదేం పరిస్థితి?
 మా అమ్మ రెహనా బేగమ్‌కు చేతుల నొప్పితో ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో అవసరమైన మందులు లేవని చెప్పి వైద్యులు బయట నుంచి తెచ్చుకోవాలన్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపులో కొనుగోలు చేశాం. పేదల దవాఖానాలో కనీస స్థాయిలోనూ మందులు లేకపోవడం దారుణం.
 - హైదర్, నూర్‌ఖాన్‌బజార్  
 
 జేబు ఖాళీ అయ్యింది
 ఉచితంగా వైద్యసేవలు అందిస్తారని గాంధీ ఆస్పత్రికి వస్తే, మందుల కొనుగోలు రూపంలో జేబుకు చిల్లుపడింది. మా బావ దుర్గయ్య అస్వస్థతకు గురైతే వైద్యుల సూచన మేరకు వారం క్రితం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాం. కొన్ని రకాల మందులు లేవని బయట తెచ్చుకోవాలని ఇక్కడి వైద్యులు చెబుతున్నారని, ఇప్పటికే వందలాది రూపాయలు మందుల కోసం ఖర్చుచేసామని సిద్దయ్య బావురుమన్నాడు.
 - సిద్ధయ్య, పాపన్నపేట, మెదక్ జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement