
గుర్తు తెలియని రెడీమిక్స్ వాహనం ఢీకొన్నట్లు కేసు నమోదు
అనుమానాలున్నాయన్న బంధువులు
మూసాపేట: చిన్ననాటి స్నేహితునితో కలిసి స్కూటీపై వెళ్తున్న యువతిని రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలైంది. కూకట్‌పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం గ్రామానికి చెందిన కుమారి తన కుమార్తె మమత, కుమారుడితో కలిసి మూసాపేటలోని ముష్కిపేటలో ఉంటోంది.
కుమారి కూతురు మమత(17) మంగళవారం రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో మమత తన చిన్ననాటి స్నేహితుడైన నరేశ్‌తో కలిసి మూసాపేట నుంచి కూకట్‌పల్లి వైపు స్కూటీపై వెళ్తుండగా మూసాపేట మెట్రో స్టేషన్ పిల్లర్ 878 వద్ద గుర్తు తెలియని రెడీమిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడిపోగా రెడీమిక్స్ వాహనం మమత నడుం మీదనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇద్దర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించగా మమత మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
తల్లి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ వివరాలు తెలియవని, సీసీ ఫుటేజీలు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..మమత మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment