సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: ప్రజల శ్రేయస్సే ఉమ్మడి లక్ష్యంగా ఔషధ నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పని చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మంత్రి.. ఔషధ నియంత్రణ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఔషధ నియంత్రణ విభాగానిది ముఖ్య పాత్ర అని కొనియాడారు.
రాష్ట్రంలో ఎక్కడా నకిలీ మందుల ఊసే ఉండకూడదని, ఈ విషయంలో ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మందుల దుకాణాలకు లైసెన్స్‌ల జారీ, రెన్యువల్ విషయంలో అప్రమత్తతతో ఉండాలన్నారు. ఔషధ తయారీ కంపెనీలు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్(జీఎంపీ) ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తున్నారో, లేదో పర్యవేక్షించాలన్నారు.
ఔషధ నియంత్రణ విభాగానికి గతంలో జిల్లాల్లో ఎక్కడా కనీసం కార్యాలయాలు కూడా ఉండేవి కావని, సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఉండేలా కృషి చేశారని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీలోని ఎన్‌సీడీసీ(నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ప్రధాన కార్యాలయం ద్వారా దేశ వ్యాప్తంగా ఆరు ఎన్‌సీడీసీ సెంటర్ల నిర్మాణానికి మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు.
ఏపీ నుంచి మంత్రి రజిని పాల్గొని మాట్లాడుతూ మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో రీజినల్ ఎన్‌సీడీసీ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, హెచ్ ఐవీ.. ఇలా అన్ని రోగాలకు ఈ సెంటర్లో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు చేస్తారని వివరించారు.
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలి
Published Wed, Sep 7 2022 6:00 AM | Last Updated on Wed, Sep 7 2022 6:17 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment