సాక్షి, అమరావతి: ఆక్సిజన్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని ఆస్పత్రుల్లో సరిపడా నిల్వలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొదటి వేవ్ కరోనా వచ్చినప్పుడే 26 వేలకు పైగా పడకలకు ఆక్సిజన్ పైప్‌లైన్ వేశారు. 4.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండేలా రాష్ట్రంలో ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ పడకల్లోనూ పూర్తిస్థాయిలో రోగులు లేరు. ఆక్సిజన్ వినియోగం గత నాలుగు రోజులుగా పెరిగింది. ఆక్సిజన్ సరఫరా కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
సరఫరాకు ఢోకా లేదు
రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాకు ఢోకా లేదు. విశాఖ నుంచి మూడు కంపెనీలు సరఫరా చేస్తుండగా, చెన్నై నుంచి ఒక కంపెనీ, బళ్లారి నుంచి రెండు కంపెనీలు నిరంతరం సరఫరా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంది. రాష్ట్రంలోనే మెజారిటీ ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. దీన్ని అవసరం మేరకు, లేదా ఆస్పత్రుల ఇండెంట్ మేరకు తీసుకుంటున్నారు.
4.51 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోరేజీ సామర్థ్యం
రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ కెపాసిటీ భారీగా పెంచారు. కోవిడ్ మొదటి దశలోనే ఆక్సిజన్ పడకల ఏర్పాటులో భారీ కసరత్తు చేసి మౌలిక వసతులు కల్పించారు. లిక్విడ్ ఆక్సిజన్ 4,03,989.5 క్యూబిక్ మీటర్లు, డి–టైప్ సిలిండర్లు 48,003.1 కలిపి మొత్తం 4,51,992.6 క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం ఉంది. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
380 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా..
రాష్ట్రంలో ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద 380 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. ఇవి గాకుండా 4 వేల సిలిండర్లు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో 6 వాహనాలు ఆక్సిజన్ లోడింగ్‌కు వెళ్లాయి. మరో 90 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్రాన్సిట్ (రవాణా)లో ఉంది. రాష్ట్రంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ఆక్సిజన్ లేకపోయినా ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు సమాచారమిస్తే.. అక్కడకు ఆక్సిజన్ సిలిండర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పైన పేర్కొన్న స్టాకు ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్నది కాకుండా త్వరలో ఆస్పత్రులకు చేరాల్సినది.
నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది
ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై నిశితంగా పర్యవేక్షణ ఉంది. ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వినియోగం చూస్తున్నాం. దీన్నిబట్టి ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ
కొరత సమస్యే తలెత్తలేదు
మనకు వచ్చిన ఇండెంట్‌ను బట్టి తీసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. స్టోరేజీ కెపాసిటీ భారీగా ఉంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొరత ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పరిశీలిస్తున్నాం. రోగులకు ఆక్సిజన్ కొరత ఉండదు.
– రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment