చిన్ని ఫొటోలోలతో ప్రకాశం జిల్లా పెద్దరావీడుకు చెందిన తల్లిదండ్రులు మాకం దిబ్బయ్య, విశ్రాంతమ్మ, బంధువులు
మధ్యాహ్న భోజనం చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఇందు కనిపించకుండాపోయింది. బయటకు వెళ్లిన కూతురు కనిపించడం లేదని తల్లి తండ్రికి ఫోన్ చేసింది. ఆరోజు నుంచి కూతురు ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈసీఐఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హాస్టల్‌లో మధ్యాహ్న భోజనం చేసిన చిన్ని స్కూల్‌కు వెళ్తూ కనిపించకుండాపోయింది. సాయంత్రం హాస్టల్‌కు తిరిగి రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు రాత్రి వరకు వెతికారు. కనిపించకుండాపోయిన చిన్ని విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. మార్కాపురం పోలీసులను ఆశ్రయించారు.
సాక్షి యాదాద్రి: ఇప్పుడు ఆ పిల్లలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాల నిర్వాహకుల చెరనుంచి విముక్తి పొందిన వారిలో ఉన్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన గుట్టకు చేరుకున్నారు. ‘సారూ..మా పిల్లలను అప్పగించండి’అంటూ బోరున విలపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ పిల్లలను చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
యాదగిరిగుట్టలో 15 మంది బాలికలను పోలీసులు వ్యభిచార కూపం నుంచి రక్షించారని మూడు రోజులుగా సాక్షి దినపత్రిక, టీవీల్లో వస్తున్న వార్తా కథనాల ఆధారంగా పలువురు తల్లిదండ్రులు శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చారు. పిల్లలకు సంబంధించి ఫొటోలు, ఇతర ఆధారాలు చూపించి, తమ పిల్లలను ఇవ్వాలని పోలీసులను కోరారు. కాగా, నిబంధనల ప్రకారం డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి తగిన నిర్ధారణకు వచ్చాక అప్పగిస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.
ఏపీ నుంచి ..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం గొబ్బూరుకు చెందిన మాకం చిన్న దిబ్బయ్య, విశ్రాంతమ్మలకు నలుగురు కూతుళ్లు. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కూతురు మాకం చిన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 7వ తరగతి చదువుతోంది. 2017 అక్టోబర్ 10న వసతి గృహం నుంచి పాఠశాలకు వెళ్లిన చిన్ని, మధ్యాహ్న భోజనం సమయం తర్వాత కనిపించకుండా పోయింది.
ఆరోజు రాత్రి వరకు చిన్ని వసతి గృహానికి రాకపోవడంతో కంగారుపడ్డ హాస్టల్ వార్డెన్, చిన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి వారి కూతురు కనిపించడం లేదని చెప్పింది. వెంటనే మార్కాపురం వెళ్లిన చిన్ని తల్లిదండ్రులు చుట్టుపక్కల చోట్ల వెతికారు. ఎంత వెతికినా బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 17వ తేదీన మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పాప కోసం వెతుకుతున్న వారు, గురువారం యాదగిరిగుట్టలో చిన్నారులకు సంబంధించిన వార్త చూసి శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ పాపకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, రేషన్‌కార్డు తదితర ఆధారాలు చూపించారు.
ఈసీఐఎల్‌లో మరో చిన్నారి..
హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన మర్రిపల్లి అనురాధ, కృష్ణ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరు కవలలు ఉన్నారు. ఇందులో రెండో పాప అయిన ఇందు ఈసీఐఎల్‌లోని ఎంఎస్ గ్రామర్ హైస్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది. 2014 సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి భోజనం చేసింది. ఒంటి గంట సమయంలో ఆరు బయటకు వెళ్లింది. తరువాత 2 గంటల సమయంలో తల్లి అనురాధ పాప కోసం వెతకగా ఎక్కడా కనిపించడం లేదు. అదేరోజు సాయంత్రం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ పాప కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
బిడ్డలకోసం తల్లిదండ్రుల ఆరాటం
యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల నుంచి రక్షించిన బాలికలను మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లులోని ప్రజ్వల హోంకు తరలించారని తెలుసుకున్న తల్లిదండ్రులు గురువారం అక్కడికి వెళ్లి బాలికను చూసే ప్రయత్నం చేశారు.
కానీ అక్కడి అధికారులు బాలికను చూపించడం నిబంధనల ప్రకారం కుదరదని, పోలీసు అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల అనుమతి ఉంటేనే చూపిస్తామన్నారు. దీంతో వారు శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలను పోలీసులకు చూపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బాలికలకు సంబంధించిన వివరాలను వారు తల్లిదండ్రులనుంచి సేకరించారు. ఈ బాలికలకు డీఎన్‌ఏ పరీక్ష చేసి తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోతే అప్పగిస్తామని చెప్పారు.
అనురాధ నర్సింగ్ హోం సీజ్
నిబంధనలకు విరుద్ధంగా పిల్లలకు హార్మోన్ ఇంజక్షన్‌లు ఇస్తున్నందుకు శుక్రవారం యాదాద్రి జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు అనురాధ నర్సింగ్‌హోంను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈస్ట్రోజన్ ఇంజక్షన్‌లు నర్సింగ్‌హోంలో బాలికలకు ఇస్తున్నారని డాక్టర్ నర్సింహపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేసి ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment