ఇంజెక్షన్‌తో  సైడ్‌ ఎఫెక్ట్సా? | Funday health councling story | Sakshi
Sakshi News home page

ఇంజెక్షన్‌తో  సైడ్‌ ఎఫెక్ట్సా?

Published Sun, Sep 9 2018 12:57 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Funday health councling story - Sakshi

నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు. పిల్లలు ఇప్పుడే వద్దని అనుకుంటున్నాం. గర్భం రాకుండా ఉండడానికి కాంట్రాసెప్టివ్‌ ఇంజెక్షన్‌ అందుబాటులోకి వచ్చిందని విన్నాను. ఈ ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా? – కేఆర్, నెల్లిమర్ల
పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నప్పుడు, కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, హార్మోన్‌ ఇంజెక్షన్, కాపర్‌–టి లేదా లూప్‌ వంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. హార్మోన్‌ ఇంజెక్షన్‌లో మెడ్రోక్సీప్రొజెస్టెరాన్‌ అసిటేట్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. ఇది అండాశయం నుంచి అండం విడుదల కాకుండా చేస్తుంది. వీర్యకణాలు గర్భాశయంలోకి వెళ్లకుండా గర్భాశయ ముఖద్వారం దగ్గర మ్యూకస్‌ ద్రవాలను చిక్కగా చేస్తుంది. ఈ ఇంజెక్షన్‌ ప్రతి మూడు నెలలకొకసారి తీసుకోవలసి ఉంటుంది. ఈ ఇంజెక్షన్‌ తీసుకున్నప్పుడు పీరియడ్స్‌ క్రమం తప్పి, బ్లీడింగ్‌ మధ్యమధ్యలో కనిపించవచ్చు. మూడు నాలుగు ఇంజెక్షన్‌ల తర్వాత, పీరియడ్స్‌ చాలా నెలల వరకు రాకపోవచ్చు. ఇవి ఆపిన తర్వాత మరలా ప్రెగ్నెన్సీ రావటానికి చాలా నెలలు పట్టవచ్చు. ఎందుకంటే మరలా అండం విడుదల కావడానికి కొందరిలో 10 నెలల సమయం పట్టవచ్చు. కొందరిలో ఈ ఇంజెక్షన్‌లు ఎక్కువ డోస్‌ తీసుకోవటం వల్ల ఎముకల్లో క్యాల్షియం తగ్గి ఎముకలు పెళుసుగా తయారుకావచ్చు. కొందరు బరువు పెరుగుతారు. మరికొందరిలో ఈ ఇంజెక్షన్‌ వల్ల తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం, డిప్రెషన్, నీరసం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ ఇంజెక్షన్‌ సరికాదనేది సూచన. డాక్టర్‌ని సంప్రదించి వారి సలహా మేరకు వేరే పద్ధతులని అనుసరించవచ్చు.

నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. ఈ మధ్య నా దంతాలు వదులైనట్లనిపిస్తున్నాయి. అంతేకాదు... పొద్దుట బ్రష్‌ చేస్తున్నప్పుడు రక్తం వస్తోంది. ముక్కులో నుంచి కూడా కొద్దిగా రక్తం వస్తోంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఇది సహజమేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు మా అత్తయ్య. దీని గురించి వివరంగా తెలియజేయగలరు.– బి.రేఖ, హైదరాబాద్‌
గర్భిణీ సమయంలో హార్మోన్లలలో మార్పుల వల్ల రక్త ప్రసరణ పెరిగి శరీరంలోని రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దానివల్ల అవయవాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. కాబట్టి రక్తనాళాలు ఉబ్బినట్లు ఉండి, ఎక్కువ తుమ్మినా, ముక్కు సలపడం, ముక్కులో చెత్తను వేళ్లతో తియ్యడం వంటి పనులు చేసినప్పుడు కొందరిలో రక్తనాళాలు చిట్లి, ముక్కు నుంచి కొద్దిగా బ్లీడింగ్‌ అవ్వవచ్చు. అలాగే దంతాలకు కూడా రక్తప్రసరణ పెరిగి, కొందరిలో హార్మోన్ల మార్పుల వల్ల దంతాల చిగురులు వాచినట్లు ఉండి, అక్కడ బ్యాక్టీరియా పెరిగి కూడా బ్లీడింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దంతాలను రోజుకు రెండుసార్లు మెత్తటి బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పునీటితో పుక్కిలించి ఊసి, మళ్లీ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. మరీ బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించి, రక్తం గడ్డకట్టే గుణంలో ఏమైనా సమస్య ఉందా..? లేదా ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా? వంటివి తెలుసుకోవడం మంచిది.

నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాను. అయితే గర్భిణులకు పిగ్మెంటేషన్‌ సమస్య ఎదురవుతుందని విన్నాను. ఇది ఎందుకు వస్తుంది? ప్రసవం తరువాత పోతుందా? ఇది రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? – జి.పార్వతి, చీపురుపల్లి, విజయనగరం
 హార్మోన్లలో మార్పుల వల్ల గర్భిణీలలో మెలనిన్‌ పిగ్మెంట్‌ ఎక్కువ తయారై ముఖంపై నల్లటి మచ్చలు, మెడ చుట్టూ నల్లగా అవ్వడం, శరీరంలో రక్తప్రసరణ పెరిగి, సన్న రక్తనాళాలు బయటకు ఎర్రగా కనిపించడం, పొట్టపైన నల్లటి గీతలు, చర్మం సాగే కొద్ది స్ట్రెచ్‌ మార్క్స్‌ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఏర్పడుతుంటాయి. చర్మం మీద పిగ్మెంటేషన్‌ మార్పులు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్లను బట్టి, ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడుతుంటాయి. ఈ మార్పులు అసలు రాకుండా ఉండటానికి ఎవరూ ఏం చెయ్యలేరు. కొన్ని పిగ్మెంటేషన్‌ మచ్చలు చాలా వరకు కాన్పు తర్వాత మెల్లగా తగ్గుతాయి. గర్భిణీ సమయంలో ఎక్కువ ఎండలో తిరగకుండా ఉండటమే మంచిది. ఎండ తగలడం వల్ల పిగ్మెంటేషన్‌ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవచ్చు. రోజు మొత్తంలో ముఖం రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవటం మంచిది. మంచినీళ్లు కనీసం మూడు లీటర్లు తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement