భవానీపురం (విజయవాడ పశ్చిమ): బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని విజయవాడ భవానీపురం పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పశ్చిమ ఏసీపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బరుసుపాడు మండలం ఎర్రబాలెంకు చెందిన బట్టు వెంకట సుబ్బారావు (33) కుటుంబం జీవనోపాధి నిమిత్తం విజయవాడలో స్థిరపడింది. తండ్రి ఆంజనేయులు ముఠా పనిచేస్తుండగా సుబ్బారావు ప్రస్తుతం ప్రైవేట్‌గా లా చేస్తున్నాడు. సుబ్బారావుకి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ‘పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్’ అనే నకిలీ ఐడీ కార్డ్ తయారు చేసి ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా నాలుగు సిమ్‌లు తీసుకుని.. ట్రూకాలర్ యాప్‌లో బీవీఎస్ రావు, సీఎంవో ఆఫీస్, బీవీఎస్ రావు సీఎం ఆఫీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం, పీఎస్ టు కలెక్టర్ పేర్లతో నమోదు చేశాడు.
ఆయా ఫోన్ నంబర్లతో మండల స్థాయి అధికారులతో మాట్లాడి ప్రజలకు కావాల్సిన పనులు చేయించి.. వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. అలాగే జర్నలిస్ట్ సంఘాలు, ఉన్నతాధికారులు ప్రచురించిన డైరీల్లోని ఫోన్ నంబర్లకు కూడా ఐయామ్ పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం అనే సందేశాలను పంపి వారితో పనులు చేయించుకుని డబ్బు గడించేవాడు. 20 రోజుల నుంచి చాలామంది సుబ్బారావుకు ఫోన్ చేసి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కావాలని, డబ్బు ఎంతైనా ఇస్తామని చెప్పడంతో జిల్లాలో ఉన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, డ్రగ్ కంట్రోలర్స్‌కు ఫోన్‌చేసి ఇంజక్షన్లు కావాలని చెప్పాడు. ఇలా అందిన ఇంజక్షన్లను కోవిడ్ పేషెంట్లకు అధిక ధరలకు అమ్మి లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇంజక్షన్ కావాలని ఫోన్‌చేసి అతడిని వలపన్ని పట్టుకున్నారు. అతడి వద్ద నాలుగు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, రూ.70వేల నగదు, మోటార్ సైకిల్, మూడు సెల్‌ఫోన్లు, నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
Published Sat, May 1 2021 5:37 AM | Last Updated on Sat, May 1 2021 5:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment