
పంచశీలనగరలో చెట్లకు విషపు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఎండిపోయిన చెట్లు
కర్ణాటక ,బనశంకరి: పచ్చని చెట్లను ఓ దుండగుడు పొట్టనబెట్టుకున్నాడు. ఐదు చెట్లకు విషపూరిత ఇంజెక్షన్ వేయడంతో చెట్లు ఎండిపోయేలా చేశాడు. రాజరాజేశ్వరినగరలోని పంచశీలనగర నివాసి నరేంద్ర అనే వ్యక్తి తన ఇంటి ముందున్న ఐదు చెట్లకు విషపూరిత సూదులు వేశాడు. అతని భవనానికి ఎదురుగా ఐదు చెట్లు ఇంటి అందానికి అడ్డుగా ఉన్నాయని వాటిని నరికివేయించడానికి యత్నించాడు. స్థానికులు దీనిని వ్యతిరేకించారు. దీంతో ఎలాగైనా చెట్లను తొలగించాలని రాత్రికి రాత్రి విషపు ఇంజెక్షన్ అందించి చెట్లు ఎండిపోయేలా చేశాడని స్థానిక నివాసుల సంఘం నాయకులు బీబీఎంపీ అటవీ విభాగానికి ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి చెట్లను పరిశీలించగా విషపూరిత మందును ఎక్కించాడని ధ్రువీకరించారు. కట్టడం ముందుభాగంలో ఉన్న చెట్లతో తమకు అలర్జీ వస్తుందని నరేంద్ర కట్టుకథలు చెబుతున్నాడని సంఘం నాయకులు ఆరోపించారు. స్వచ్ఛమైన గాలిని అందించే చెట్ల వల్ల ఎలాంటి అలర్జీ ఏర్పడదన్నారు. చెట్లుకు విషం పెట్టిన నరేంద్ర తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment