కలవరపరుస్తున్న సైకో..ఇంజెక్షన్‌తో దాడి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు రోజులుగా మహిళలు, యువతులకు ఇంజెక్షన్లతో పొడుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో శనివారం నుంచి బుధవారం వరకు 13 మంది మహిళలు, విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్లతో సైకో దాడి చేశాడు. ఈనెల 22న యండగండి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులపై దాడిచేసి గాయపర్చిన సైకో మంగళవారం మరో ఆరుగురు మహిళలపై దాడి చేశాడు. బుధవారం పెనుగొండ సమీపంలోని చెరుకువాడలో ఉదయం 6 గంటల వేళ వాకిలి ఊడ్చుతున్న గృహిణి కొమ్మిరెడ్డి హేమలత (27)కు ఇంజెక్షన్ పొడిచి పరారయ్యాడు. అదే మండలంలోని సిద్ధాంతంలో 6.30 గంటలకు కృష్ణకుమారి (16) అనే బాలికపై ఇంజెక్షన్‌తో దాడికి పాల్పడ్డాడు.
7.30కు పోడూరు మండలం కవిటం లో సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న విద్యార్థిని కొవ్వూరి తేజశ్రీ (17)కి వెనుకవైపుగా వచ్చి ఇంజెక్షన్ చేసి పరారయ్యాడు. వీరవాసరం మండలం కొణితివాడలో విద్యార్థిని కేతా విజయ(17)పై కూడా ఇదే విధంగా దాడిచేశాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు నలజర్లలోని గంటా చంటి (21) అనే మహిళపై సిరంజి గుచ్చి పరారయ్యాడు. బాధితులు స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, సైకో వినియోగిస్తున్నది ఇంజెక్షన్లు కాదని, అది స్టిచ్చింగ్ నీడిల్ మాత్రమేనని నార్త్ కోస్టల్ ఐజీ కుమార విశ్వజిత్ తెలిపారు. బాధితుల రక్తం ల్యాబ్‌లకు పంపగా, ఎటువంటి రసాయనాలు, మత్తుమందులు లేవని తేలిందని తెలిపారు.