సాయం కోసం కన్నవారి మొర
మైసూరు: చిత్రంలో కనిపించే చిన్నారికి పెద్ద జబ్బే సోకింది. ఆ జబ్బు నయం కావాలంటే రూ. 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కన్నవారు హడలిపోయారు. తమ బిడ్డను కాపాడేందుకు దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. వివరాలు.. మైసూరులో దేవరాజు మొహల్లాలో నివసించే హెచ్.నాగశ్రీ, ఎన్.కిశోర్ దంపతులకు 22 నెలల కీర్తన అనే కూతురు ఉంది.
కానీ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) అనే అరుదైన జబ్బు సోకిందని ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనివల్ల పాప ఎప్పుడూ నీరసంగా ఉంటుంది, కండరాలు బలహీనంగా ఉంటాయి, కనీసం ఆహారం నమలడం కూడా చేత కాదు. ఇక ఆడుకోవడం అనేదే ఉండదు.
ఈ జబ్బు రెండవ దశలోకి వచ్చిందని, పాప మరింత బలహీనమైందని వాపోయారు. జన్యు చికిత్స, అరుదైన ఇంజెక్షన్లతో వైద్యం చేయిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు, కానీ అందుకు రూ. 16 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. నిత్యం ఒక టానిక్ తాగాల్సి ఉంటుంది, ఒక్క బాటిల్ ధర రూ. 6 లక్షలని చెప్పారు. పేదవాళ్లయిన తమకు అంత స్తోమత లేదని, దాతలే ఆదుకోవాలని అభ్యర్థించారు. వివరాలకు చిన్నారి తండ్రి కిశోర్‌ని 9901262206 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment