సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీ వైరల్ రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీలో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే అందుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని దుయ్యబట్టారు. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో 4 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కావాలని కోరితే కేంద్రం కేవలం 21,551 ఇంజెక్షన్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నామన్నారు. టీకాల పంపిణీ తరహాలో రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీని కేంద్రం తన నియంత్రణలో పెట్టుకో వడం బాధాకరమన్నారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల మీడియాతో మాట్లా డుతూ మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన రోగులు హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఎక్కువగా చేరుతున్నందున ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కువగా పంపాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు చెప్పినా స్పందించలేదన్నారు. విపత్కర సమయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ముందుకు పోవాల్సింది పోయి ఇలా చేయడం బాధ కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రెమిడెసివర్ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని కోరారు. కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రానికి రెమిడెసివర్ ఇంజక్షన్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
ఆక్సిజన్ సరఫరా అంత దూరం నుంచా?
తెలంగాణకు బళ్లారి, విశాఖ, ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోందని, దగ్గర ఉన్న ప్లాంట్ల నుంచి కాకుండా 1,300 కి.మీ. దూరంలో ఉన్న ఒరిస్సా నుంచి కేంద్రం ఆక్సిజన్ కేటాయించిందని ఈటల విమర్శించారు. అలాగే చెన్నై నుంచి 20 టన్నులు, పెరంబదూర్ నుంచి 35 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించినా తమిళనాడు ప్రభుత్వం ఆ మేరకు కోటా ఇవ్వడం లేదన్నారు. తమిళనాడు తరహాలో తాము కూడా వ్యవహరిస్తే ఎలా ఉంటుందని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లకు కొంత కొరత ఉందన్న ఈటల... ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. రాష్ట్రానికి నిత్యం 384 టన్నుల ఆక్సిజన్ అవసరంకాగా ప్రస్తుతం 270 టన్నుల మేర ఆక్సిజన్ అందుతోందన్నారు.
గాంధీలో 600 మంది రోగులు ఐసీయూలో...
గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 600 మంది కరోనా రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని మంత్రి ఈటల చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగుల పరిస్థితి విషమించాక ప్రభుత్వ ఆస్పత్రులకు పంపడం మానుకోవాలన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ, కర్ణాటకలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని వివరించారు. రాష్ట్రంలో రోజుకు 2 లక్షల కోవిడ్ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల వెల్లడించారు. తెలంగాణలోని 104 కేంద్రాల్లో రోజుకు 30 వేల ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా మిగతా కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నట్లు వివరించారు. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. లక్షణాల తీవ్రతను బట్టి ఆస్పత్రుల్లో చేరాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 1,120 ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతిచ్చామని, ఆక్సిజన్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎస్ ఆధ్వర్యంలోని 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం నిత్యం ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివర్ ఇంజక్షన్ల పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తోందన్నారు.
చదవండి: భర్తకు కరోనా.. భయంతో ఉరేసుకున్న భార్య
Comments
Please login to add a commentAdd a comment