సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): బోసినవ్వులతో ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాప అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వేలల్లో ఒకరికి వచ్చే జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల ఎల్లెన్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడం హృదయాలను కలిచివేస్తోంది. చికిత్సకు రూ.16కోట్లు అవసరమని వైద్యులు చెప్పగా.. అంత స్థోమత లేని పాప తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. సహృదయం కలిగిన దాతలు ముందుకొస్తే తప్ప తమ పాపను దక్కదని వేడుకుంటున్నారు.
సత్వర వైద్యం అందకపోతే..
దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ ప్రైవేట్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి 2018లో వివాహం కాగా 14నెలల ఎల్లెన్ పాప ఉంది. పాప నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్టంగా లేకపోవడం, కిందకు వాలిపోతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన వారు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.
అయినా ఏమీ తెలియకపోవడంతో జన్యుసంబంధిత సమస్యగా అనుమానిస్తూ మరో రెండు పరీక్షలు నిర్వహించారు. అయినా చిన్నారి సమస్య బహిర్గతం కాలేదు. రోజురోజుకూ చిన్నారి కదల్లేని పరిస్థితికి చేరుతుండడంతో తల్లిదండ్రులు చెన్నైలోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తమ స్థోమతకు మించి అప్పులు చేసి గత ఏడాది డిసెంబర్ 7న జెనెటిక్ పరీక్షలు చేయిస్తే ఈ నెల 10న రిపోర్టులు వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఎల్లెన్ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతోందని.. నరాలు, కండరాలు బలహీనంగా అయ్యాయని వైద్యులు వెల్లడించారు.
సత్వర వైద్యం అందకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పడం... రానురాను చిన్నారి శరీర భాగాల్లో కదలికలు తగ్గుతుండడంతో తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం రోజుకు చిన్నారి మందులు, చికిత్స కోసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుండగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం.
రూ.కోట్లల్లో ఖర్చు...
చిన్నారి ఎల్లెన్‌కు నిర్వహించిన పరీక్షలలో జన్యుసంబంధిత వ్యాధిగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్‌జెన్స్‌మా)ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిల్లో ఇంత ఖర్చు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం చేస్తున్న వైద్యం అంతా తాత్కాలికమేనని వైద్యులు సూచించారు.
ఈ మేరకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఎల్లెన్‌కు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ – స్టెల్లా కోరుతున్నారు. కాగా, ఎల్లెన్‌కు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమె చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు 99085 89604 నంబర్‌లో సంప్రదించాలని ప్రవీణ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment