ఒక బాల్యం నేలపాలు.. మూడు బాల్యాలు కటకటాలపాలు... | Verphy Kudi: Mum left girl to die to party for 6 days In Lodon | Sakshi
Sakshi News home page

ఒక బాల్యం నేలపాలు.. మూడు బాల్యాలు కటకటాలపాలు...

Published Wed, Aug 11 2021 8:38 PM | Last Updated on Thu, Aug 12 2021 7:42 AM

Verphy Kudi: Mum left girl to die to party for 6 days In Lodon - Sakshi

భార్యాభర్తల స్థితి నుంచి తల్లిదండ్రులవ్వటం అనేది ప్రకృతి సహజంగా జరుగుతున్న మార్పు. అంతవరకు ఆడుతూపాడుతూ ఉన్న జంట, ఒక్కసారిగా బాధ్యతగల తల్లిదండ్రులుగా మారిపోతారు. చంటిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నిద్రాహారాలకు దూరమౌతారు. ఇది సృష్టి ధర్మం.

ఇటీవల లండన్‌లో జరిగిన సంఘటన తల్లులు ముక్కున వేలేసుకునేలా చేసింది. సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. లండన్‌కి చెందిన 19 సంవత్సరాల వెర్ఫీ కుడీకి 20 నెలల పసి పాప ఉంది. చిన్న వయసులోనే బిడ్డకు జన్మనివ్వటం వల్లనేమో, ఆమె తన సరదాలకు దూరంగా ఉండలేకపోయింది. కుడీ తన పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకోవటం కోసం ఇంటి నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ఎలిఫెంట్‌ అండ్‌ క్యాజిల్‌కి వెళ్లారు. అక్కడే ఆరు రోజుల పాటు ఉండిపోయారు. ఆరు రోజుల పాటు ఆకలితో అలమటించి మరణించింది ఆ పసిపాప. తిరిగి వచ్చిన తనకు కుమార్తె చనిపోయి కనిపించింది. అందుకు తాను బాధపడట్లేదని, ఇది అతి సహజంగా జరిగిందంటున్నారు వెర్ఫీ కుడీ.

ఇది ఇలా ఉంటే...
ఖమ్మంలో గిరిజన  జాతికి చెందిన కవిత, కావ్య, రాణి అనే ముగ్గురు మహిళల మీద హత్యానేరం మోపబడింది. అక్కడి రైతులు పత్తి పంట పండిస్తున్నారనే కోపంతో వీరు ఆ రైతుల మీద హత్యా యత్నం తలపెట్టడంతో అక్కడి ఆదివాసీలకు జైలు శిక్ష వేశారు. అందులో ఈ ముగ్గురూ పసిపిల్లల తల్లులు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు తల్లులతో పాటు జైలు జీవితం అనివార్యంగా గడపాలి.

అక్కడ ఆ తల్లి తన వేడుక కోసం పసిబిడ్డను విడిచిపెట్టి, ఆమె మరణానికి కారణమయ్యారు. ఇక్కడ ఆవేశంలో చేసిన పనికి ఈ పసిపిల్లలు బలవుతున్నారు. నిండు నూరేళ్ల జీవితం మసకబారిపోతోంది. తల్లిదండ్రులతో గడపవలసిన బాల్యం ఒకచోట బాల్య దశలోనే ముగిసిపోయింది, మరోచోట బాల్యమంతా జైలులో గడవబోతోంది. ‘‘ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి టీనేజ్‌ తల్లుల సమస్యలపై దృష్టి సారించాలి. సరైన వయసు వచ్చేవరకు తల్లి కాకుండా చట్టాలు సవరించాలి. తల్లి కాబోయే ముందు రాబోయే సాధక బాధకాలు వివరంగా తెలియజేయాలి. సరైన పెంపకంలో పెరగని పిల్లలు ఏ మార్గంలో పయనిస్తారో చెప్పడం కష్టం. ఆ దుస్థితి ముందు తరాల వారికి రాకూడదంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కళ్ళు తెరవాలి’’ అంటున్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలర్‌ శ్రీమతి కె. శోభ.

తల్లిదండ్రుల లాలనలో బాల్యం అందంగా గడవాలి. వృద్ధాప్యంలో సైతం బాల్యాన్ని తలచుకునేలా ఉండాలి. అటువంటి బాల్యం మొగ్గలోనే వాడిపోవటం, జైలులో గడవటం... పిల్లల ఎదుగుదలకు అవరోధాలు. ‘‘జైలుకి వెళ్లిన ఆదివాసీలు తమ పిల్లల్ని తమతో పాటు తీసుకువెళ్లాలి. అందువల్ల ఆ పిల్లలు జైలు వాతావరణంలో పెరుగుతారు. వాళ్లని లోపల ఉంచే హక్కు ఎవరికీ లేదు. ముగ్గురు పాపంపుణ్యం తెలియని పిల్లల్ని అక్కడ ఉంచటం వల్ల వాళ్లకి ప్రపంచం తెలియదు. తల్లులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు. పిల్లల్ని బతికించుకోవటానికి వారు ఈ పనులు చేశామంటున్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వారు ‘అడవి మా హక్కు’ అన్నారు. తరతరాలుగా అది వారి హక్కు. ఒక ఆదివాసీ ఒక మాట అన్నారు, ‘చెరువులో నీళ్లు చేపలు తాగితే చెరువు ఎండిపోతుందా’ అని. ఆదివాసీలు చెట్లు కొట్టడం వల్ల అడవి తరిగిపోదు. ఆవేశంలో వారు చేసిన పనికి, ఆ తల్లుల కారణంగా పిల్లల్ని జైలులో పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. పిల్లలు స్వేచ్ఛను అనుభవించటం కోసం తల్లుల్ని వదిలేయాలి’’ అంటున్నారు సామాజిక వేత్త దేవి. ఇప్పుడు వెర్ఫీ కుడీకి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఖమ్మం మహిళలకు కూడా జైలు శిక్ష పడింది.
– వైజయంతి

ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి!
అంతులేని స్వేచ్ఛ, సమానత్వం పొంగిపొర్లే దేశం ఒకటి. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొనే దేశం మరోటి. రెండుచోట్లా బాధితులు పసివారే. దేశాల అభివృద్ధితో సంబంధం లేదని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి. తల్లి తన పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు. కానీ తల్లే తన పసికందు మరణానికి కారణమవడం విచారకరం. పైగా విచారణలో కూడా ఆమెలో బాధ, పశ్చాత్తాపం కనపడలేదట. మానసిక పరిపక్వత, శారీరక సామర్థ్యం లేకుండా అమాయకంగా ప్రేమలో చిక్కుకునే అమ్మాయిలు ఇలాగే ఉంటారు. రైతు మహిళల అరెస్టు సైతం ఇదే కోవకు వస్తుంది. తల్లులు జైలులో ఉంటే పాల బుగ్గల పసివారి సంగతి ఏమిటి ? ఇటీవలి కాలంలో తల్లుల కోపానికి బలవుతున్న పిల్లల సంఘటనలు అనేకం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం సరైన చదువు లేకపోవడం, సమస్యలపై అవగాహన లేకపోవడం.
- కె. శోభ , ఫ్యామిలీ కౌన్సెలర్‌

వారిని నిందించకూడదు..
పసిబిడ్డను నిర్లక్ష్యం చేయటాన్ని ఎవ్వరూ సమర్థించరు. అసలు 20 సంవత్సరాల లోపు వయసున్నవారు పిల్లల్ని కనకూడదు. అనివార్యంగా కన్నప్పటికీ వారికి బాధ్యతగా పెంచటం తెలియదు. వెర్ఫీ కుడీ చేసిన పనికి ఆమె మీద నింద మోపకూడదు. ఆడుకునే వయసులో తిరగాలనే కోరికను వదులుకోలేరు. వాళ్లకి బాధ్యత తెలీదు. బిడ్డను పెంచలేమనుకుంటే, బేబీ కేర్‌ సెంటర్లకు అప్పచెప్పాలి. అలా చేసి ఉంటే ఆ పసిపాప మొగ్గలోనే రాలిపోయేది కాదు కదా. ఇలా చేయటాన్ని సమర్థిస్తున్నామని కాదు. అదొక మార్గం మాత్రమే అని చెబుతున్నాం.
– దేవి, సామాజికవేత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement