
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలతో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లపై కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇంజక్షన్ల కొరత సృష్టించేందుకు, ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా మందుల డిపోల వద్ద ఇంజక్షన్లు కొనడం మానేశాయి. మందుల డిపోల వద్ద గత రెండు రోజుల కొనుగోళ్లలో 30 శాతం తగ్గుదల చూస్తే ఇది స్పష్టమవుతోంది. కాగా, ఇన్నాళ్లూ మందుల డిపోల వద్దకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్లు తెచ్చుకునేవి. బ్లాక్‌మార్కెట్ నియంత్రణకు రంగంలోకి దిగిన ఔషధ నియంత్రణ శాఖ.. నిబంధనలు కఠినం చేసింది. అలాగే ఆస్పత్రులు కొని తెచ్చుకున్న ఇంజక్షన్లు సరిపోకపోతే.. లోటు ఉన్న ఇంజక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రెమ్‌డెసివిర్ కొరత నియంత్రణలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం లోటును భర్తీ చేస్తుంటే.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డిపోల నుంచి వారికి కావాల్సినవి కూడా కొనడం మానేశాయి. ఇలా చేసి కొరత చూపుతున్నాయని, బ్లాక్‌మార్కెట్‌కు అవకాశం ఉంటే డిపోల దగ్గర కొనేవారు అనే విమర్శలు వస్తున్నాయి.
ఇది సరైన పద్ధతి కాదు
ప్రైవేటు ఆస్పత్రులకు కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భాగస్వామ్యం అందిస్తోంది. బ్లాక్‌మార్కెట్‌ను నిలువరించేసరికి డిపోల దగ్గర కొనడం మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. బాగా నియంత్రణలోకి వచ్చిన పరిస్థితుల్లో ఇలాంటి ధోరణి వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది.
–రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ
Comments
Please login to add a commentAdd a comment