
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబు వయసు 14 నెలలు. రొమ్ములో నెమ్ము ఉందని డాక్టర్లు చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. బాబు ఆరోగ్యం పట్ల చాలా ఆందోళనగా ఉంది. ఇలా ఛెస్ట్‌లో నెమ్ము ఎందుకు వస్తుంది? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. – ఎల్. ప్రవీణ, నెల్లూరు
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. నిమోనియాకు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అత్యంత ప్రధాన కారణాలు. కొన్నిసార్లు శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం చాలా ముఖ్యం.
జాగ్రత్తలివే...
∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే గుంపుగా జనం ఉన్నప్రాంతాలకు పిల్లలను పంపకూడదు.
∙తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి దూరంగా ఉంచాలి.
పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్‌ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్‌లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్‌తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) కూడా అవసరం.
బాబుకు మూత్రంలో ఎరుపు... ఎందుకిలా?
మా బాబుకి ఎనిమిదేళ్లు. రెండు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అన్ని రకాల పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ అన్నీ నార్మలే. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ అని చెప్పి యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు బాధ పడుతున్నాడు. వారం క్రితం కూడా మూత్రంలో రక్తం పడింది. మళ్లీ డాక్టర్ దగ్గరకెళితే పరీక్షలు చే శారు. ఆ రిపోర్ట్స్ కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, ఎందుకిలా రక్తం పడుతోంది?
– సువర్ణ, కందుకూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. స్కూల్‌కి వెళ్లే 2–5 శాతం మంది పిల్లల మూత్రంలో రోజూ రక్తం కనబడుతుంటుంది. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచనగా ఉంటుంది.
పిల్లల యూరిన్‌లో రక్తం కనబడానికి కొన్ని కారణాలు:
మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్‌లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చిందంటున్నారు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ క్యాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా క్యాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్‌మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి.
మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండాలి. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకొని మీరు మరోసారి మీ డాక్టర్‌తో చర్చించి, తగిన సలహా, చికిత్స తీసుకోండి.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment