ప్రతీకాత్మక చిత్రం
నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. మావారు తాగుతారు. తాగినప్పుడల్లా సెక్స్ కావాలని గొడవ చేస్తారు. అయితే మద్యం తాగి ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటే... ఆ సమయంలో విడుదలైన అండం ఆరోగ్యంగా ఉండదని, తద్వారా పిల్లలు రకరకాల వ్యాధులతో పుడతారని ఎవరో అనగా విన్నాను. అందుకే తాగి వున్నప్పుడు ఆయనకు దగ్గర కావాలంటే భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు?
– సునీత, గుడివాడ
మద్యం తాగడం అన్నది పుట్టబోయే పిల్లలకే కాదు... మీ భర్తకు కూడా మంచిది కాదు. ఆ అలవాటు వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వృషణాలు దెబ్బ తింటాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి కదలికలో, నాణ్యతలో తేడా వస్తుంది. మెల్లగా కోరికలు తగ్గిపోవడం, అంగస్తంభన లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీర్యకణాల నాణ్యత తగ్గడం వల్ల పిండం సరిగ్గా తయారవదు. అలాంటప్పుడు ఒక్కోసారి అబార్షన్ అవుతుంది. లేదంటే పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయి. అవయవ లోపాలు, జన్యు లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. కొందరు పిల్లలకు పుట్టిన తర్వాత ఐదేళ్లలోపు మతిమరుపు, బుద్ధిమాంద్యం, ఇతరత్రా మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. ఈ విషయాలన్నీ మీవారికి వివరించండి. మంచి భవిష్యత్తు కోసమైనా తాగుడు మానేయమని చెప్పండి. వినకపోతే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి.
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. పిల్లల మధ్య ఎడం కోసమని నేను డాక్టర్ సలహా మేరకు రెండేళ్లుగా హార్మోన్ ఇంజెక్షన్లు వాడుతున్నాను. అయితే అప్పట్నుంచీ పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. డాక్టర్‌ని సంప్రదిస్తే హార్మోన్ ఇంజెక్షన్లు వాడే చాలామందికి అలా అవుతుందని చెప్పారు. ఇక రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేద్దామని ఆరు నెలల క్రితం ఇంజెక్షన్లు ఆపేశాను. అయినా పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్‌ని కలిస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ తర్వాత నెలసరి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రావడం లేదు. నాకు మరో బిడ్డ కావాలంటే ఏం చేయాలి? – ఎన్.ప్రీతి, కర్నూలు
గర్భం త్వరగా రాకుండా ఉండటానికి depo provera అనే ప్రొజెస్టరాన్ హార్మోన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మూడు నెలలకు ఒకటి చొప్పున మూడు నాలుగు కంటే ఎక్కువసార్లు తీసుకోకూడదు. అంతకుమించి తీసుకోవడం వల్ల ఒక్కోసారి గర్భాశయ లోపలి పొర బాగా పల్చబడిపోయి, చాలా నెలలు లేదా సంవత్సరాలు పీరియడ్స్ రాకుండా పోతాయి. లేదంటే కొందరిలో ఎక్కువసార్లు వచ్చేయడం, ఎక్కువగా బ్లీడింగ్ కావడం, లేదంటే బ్లీడింగ్ మధ్యమధ్యలో కనబడటం వంటివి కూడా జరుగుతాయి. మీరు ఇప్పటికే రెండేళ్లు వాడేశారు కాబట్టి వాటిని ఆపి ఆరు నెలలు అయినా కూడా మీ శరీరంలో ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. అది పూర్తిగా పోయేవరకు ఆగాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని రోజుల పాటు ఈస్ట్రోజన్ హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. అలా అని కంగారు పడాల్సినదేమీ లేదు. మీరు మెల్లగా ప్లాన్ చేసుకుని, తప్పకుండా మరో బిడ్డను కనవచ్చు.
‘మూత్రనాళ ఇన్‌ఫెక్షన్’ అనేది ఎందుకు వస్తుంది? మన శరీరతీరువల్ల వస్తుందా? తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తుందా? ఈ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే రోజువారీ జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందా? మూత్రం రంగును బట్టి ఈ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చా? తెలియజేయగలరు.– కె.సుబ్బలక్ష్మి, తిరుపతి
మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్. ఆడవారిలో మూత్రం బయటకు వచ్చే రంధ్రం (యురెత్రా), కిందకే, యోని రంధ్రం, దాని కిందనే, మలద్వారం ఉంటాయి. చాలావరకు మలద్వారం నుండి బ్యాక్టీరియా, క్రిములు, పైకి పాకే అవకాశాలు చాలా ఉంటాయి. ఇవి యోనిలోకి కాని, మూత్ర ద్వారంలోకి పాకి, ఇన్‌ఫెక్షన్‌లను కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటం... వంటి కొన్ని సందర్భాలలో ఈ క్రిములు పెరిగి ఇన్‌ఫెక్షన్ రావటానికి కారణం అవుతాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలో, అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారిలో, ఈ క్రిములు పెరగకుండా రోగ నిరోధక శక్తి ఆపుతుంది. నీళ్లు బాగా తాగుతూ ఉంటే మూత్రంలో క్రిములు కొట్టుకుపోతాయి. లేకపోతే ఈ క్రిములు మెల్లగా పెరుగుతూ మూత్రం సంచి (యూరినరీ బ్లాడర్) నుంచి పైకి అంటే మూత్రం పైపులకు (యూరేటర్స్) తద్వారా కిడ్నీలకు పాకి, ఇన్‌ఫెక్షన్ బాగా వృద్ధి చెంది కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి, తద్వారా ప్రాణహాని వరకు చేరే అవకాశాలు ఉంటాయి. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు, మూత్రంలో మంట, మూత్రం ఎక్కువసార్లు వెళ్లాలనిపించడం, మూత్రం బాగా పసుపుపచ్చగా రావడం, పొత్తికడుపులో నొప్పి, నడుం నొప్పి, జ్వరం వంటి అనేక లక్షణాలు, ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటాయి. బిగుతుగా వుండే జీన్స్ ఎక్కువసేపు గంటల తరబడి వేసుకోవడం వల్ల కూడా, గాలి చొరబడక, ఇన్‌ఫెక్షన్ కలిగించే క్రిములు పైకి పాకి ఇబ్బంది కలిగించవచ్చు. మంచినీళ్లు రోజుకు కనీసం రెండు లీటర్లు తీసుకోవాలి. మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కి కడుక్కోవాలి. దాని ద్వారా మలద్వారంలోని క్రిములు ముందుకి పాకకుండా ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు వెళ్లిపోవాలి కాని, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపి పెట్టడం వల్ల కూడా కొంతమందిలో యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment