
కాలం చెల్లిన మందులు
260 రకాల మందులు, ఇంజక్షన్లు, సర్జికల్స్‌కు ముగిసిన గడువు
ఉపయోగపడనివి కొనుగోలు టీఎస్‌ఎంఐడీసీ నిర్వాకం
సిటీబ్యూరో: తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) అధికారుల అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ధర్మాసుపత్రులు దగా పడుతున్నాయి. రోగులకు అవసరం లేని... గడువు సమీపించిన నాసిరకం మందులు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేయడం... తీరా వాటి కాల పరిమితి దాటాక గుట్టుచప్పుడు కాకుండా తిప్పి పంపడం పరిపాటిగా మారింది. ఒక్క హైదరాబాద్‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లోనే రూ.4 కోట్ల విలువైన మందులు మురిగిపోయినట్లు తెలిసింది. వీటిలో డెక్స్‌స్ట్రోస్ ఐవీ ఇంజక్షన్లు, ట్రాకియోస్లోమీ ట్య్రూబ్స్, సెఫ్టాజిడిమ్ ఇంజక్షన్లు, క్లోరాంఫెనికాల్ ఆప్లీక్యాప్సుల్స్, మైకోనాజోల్ ఆయింట్‌మెంట్, మిైథైల్ కొబొలమిన్ టాబ్లెట్స్, జెంటామైసిన్, డిస్పోజబుల్ కస్కో స్పెక్యూలిమ్, లిగ్నోకైన్, విటమిన్ ఎ,డి క్యాప్స్ ఐపీ సహా మొత్తం 210 రకాల మందులు, డిస్పోజల్స్, 50 రకాల ఇంజక్షన్లు ఎక్స్‌పైర్ అయినట్లు తెలిసింది. వీటిలో ఇప్పటికే కొన్నిటిని సంబంధిత కంపెనీలకు తిప్పి పంపగా... మరికొన్ని స్టోర్‌లో మగ్గుతుండటం విశేషం. ఇదిలా ఉంటే... స్టోర్స్‌లో నిల్వ ఉన్న మందులు తీసుకెళ్లాలని... లేదంటే వచ్చే బడ్జెట్‌లో కోత పడుతుందని ఆస్పత్రుల్లోని ఫార్మసిస్టులకు బెదిరింపులకు దిగుతున్నారు. అధికారుల బెదిరింపులకు భయపడి అవసరం లేకపోయినా మందులు తీసుకెళ్లి స్టోర్స్‌లో నిల్వ చేస్తున్నారు. గడువు ముగిసిన మందులను కాల్చివేయాలన్నా...పూడ్చిపెట్టాలన్నా ...పీసీబీ అనుమతి తప్పనిసరి. దీంతో వీటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఫార్మసిస్టులు తలలు పట్టుకుంటున్నారు.
సరఫరా అస్తవ్యస్థం
ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రుల్లోనే కాదు... శివారులోని ఏరియా ఆస్పత్రులు... బస్తీల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మందుల సరఫరా అస్తవ్యస్థంగా ఉంది. ఖరీదైన మందుల సంగతేమో గానీ... బీపీ, షుగర్, బి కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకడం లేదు. ఫలితంగా వైద్యుడు రాసిన చీటీ పట్టుకుని ప్రైవేటు పార్మసీలను ఆశ్రర ుుంచాల్సి వస్తోంది. ఒక్కో ఏరియా ఆస్పత్రికి మందుల కోసం ప్రతి మూడు నెలలకోసారి రూ.3.5 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 145 రకాల మందులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ఆస్పత్రుల్లో 30-35 రకాలకు మించి దొరకడం లేదు. ఒక్కో గర్భిణికి 100 బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి. కానీ రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు లేకపోవడంతో పది రాస్తే..ఐదు మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. ఒకచోట మందుల కొరత ఉంటే... సమీప ఆస్పత్రిలోని నిల్వలను సర్ది పెట్టాలి. అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లు ఇండెంట్లు పంపి మందులు కొనుగోలు చేస్తున్నారు.
నాణ్యత ప్రశ్నార్థకం
దగ్గు, జలుబుతో బాధ పడుతున్న చిన్నారుల కోసం కొనుగోలు చేసిన సిరప్‌లలో ఫంగస్ ఉన్నట్లు ఇటీవల ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు గుర్తించారు. రాజేంద్రనగర్‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌కు వాటిని తిప్పి పంపడాన్ని బట్టి మందుల సరఫరా తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. మందులు, సర్జికల్స్ నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడం లేదు. టెండర్‌లో ఖచ్చితమైన నిబంధనలు ఉన్నా పాటించడం లేదు. చాలా మందు సీసాలకు మూతలు ఉండటం లేదు. సర్జికల్స్, బాటిళ్లు పగిలిపోతున్నాయి. రెండు, మూడు నెలల్లో గడువు ముగిస్తే మందులు సరఫరా అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జాతీయ పల్స్‌పోలియె ూ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో అవసరానికి మించి వ్యాక్సిన్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన వ్యాక్సిన్‌ను వదిలించుకునేందుకు మరోసారి వ్యాక్సినేషన్ చేపట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తుండగా... కొంతమంది వైద్యులు నిరాకరిస్తుండటం గమనార్హం.