ఆపరేషన్‌ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్‌లు మంచివేనా! | Beauty Injections: Purpose Procedure Risks Results | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్‌లు మంచివేనా!

Published Thu, Nov 9 2023 9:19 AM | Last Updated on Thu, Nov 9 2023 9:59 AM

Beauty Injections: Purpose Procedure Risks Results - Sakshi

పెళ్లి సంబంధం కుదరగానే వారి వారి స్థోమత మేరకు పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేయాలనే ఆలోచన చేస్తుంటారు పెద్దవాళ్లు. పెళ్లిలో కాబోయే అత్తగారి డిమాండ్‌ మేరకు వధువు అమ్మానాన్నలు నడుచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవల మరో కొత్త డిమాండ్‌ కూడా వచ్చి చేరింది.కాబోయే పెళ్లికూతురు వివాహ వేడుకలో దేదీప్యమానంగా వెలిగిపోవాలి. అందరూ ‘అందమైన కోడలిని సెలెక్ట్‌ చేసుకున్నారు అనే కితాబులు అందుకోవాలి. అందుకు, చికిత్స చేయించుకున్నా సరే!’ అంటున్నారు. మరి, కాబోయే వధువులు వేడుకకు సిద్ధం కావడానికి ఎలాంటి కేర్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అందం పట్ల తీసుకుంటున్న చికిత్సలు.. వికటిస్తున్న పరిమాణాలు ఏమిటి? భేష్‌ అనదగిన విధానాలేమిటి? అనే విషయాలపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి.

‘‘ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేస్తున్న సుష్మ పెళ్లి వచ్చే డిసెంబర్‌లో జరగనుంది. పెళ్లి ఫిక్స్‌ అయ్యాక అత్తగారు నవ్వుతూ – ‘అమ్మాయీ, నీ వంటి రంగు బ్రైట్‌ చేయించుకో. ఫెయిర్‌ నెస్‌ కోసం ఇంజెక్షన్లు మార్కెట్‌లో దొరుకుతాయని విన్నాను. వాటిని ట్రై చేయి. ఏ ట్రీట్‌మెంట్‌ అయినా తీసుకో. కానీ, పెళ్లి టైమ్‌కి అందంగా తయారవ్వాలి’ అని ఆర్డర్‌ వేసింది. ఆమె తన కోడలు పందిట్లో చందమామలా కనిపించాలని, కోడలు మొహం చూసి బంధుమిత్రులంతా నిశ్చేష్టులవ్వాలని కోరుకుంటుంది. ‘అత్తగారి డిమాండ్‌ ఇప్పుడు నాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటోంది సుష్మ.

ఇందుకోసం బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌తో పాటు చర్మ ఛాయలో కూడా తేడా వచ్చేలా మార్పులు చేసుకోవడానికి తెగ కష్టపడుతోంది. ‘పెళ్లి అంటేనే ఎంతో ఉత్సాహం. ఫొటోల్లో, వీడియోల్లో బాగా కనిపించాలని, అందరిలో ప్రత్యేకంగా వెలిగిపోవాలని నాకూ ఉంటుంది. ఇందుకు బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం, మేకప్‌ చేయించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్స్‌ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. పెళ్లి ఖర్చులే కాకుండా ఈ కొత్త తరహా ఖరీదైన ఖర్చు తలనొప్పిగా మారింది అంటున్నారు అమ్మనాన్నలు’ అని బాధపడుతోంది సుష్మ.


కాబోయే అత్తగారు కోరడంతో రూప (పేరు మార్చడమైంది) తన కంటి కింది భాగం లోతుగా ఉండటం వల్ల ‘అండర్‌ ఐ ఫిల్లర్‌’ ఇంజక్షన్‌ చేయించుకుంది. దీంతో కంటి కింది భాగంలో రక్తం గడ్డకట్టి, వాపు వచ్చి, బయటకు రాలేని పరిస్థితి. త్వరలో పెళ్లి. ఆ క్లాట్‌ అంత తొందరగా తగ్గదు. దిక్కుతోచని పరిస్థితి. 


శిల్ప అందం కోసం బొటాక్స్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంది. డోస్‌ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడానికి వీలు లేకుండా మారిపోయింది. అందం పెంచుకునే విషయంలో ఒకరో ఇద్దరు కాదు అమ్మాయిలు ఎప్పుడూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లి అంటే చెప్పనక్కర్లేదు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నుంచి ప్రతి సంబరాన్నీ పదిలపరుచుకోవడానికి ఎన్నో పాట్లు పడతారు. దీంట్లో భాగంగా బ్యూటీ కాన్షియస్‌ అమ్మాయిల్లోనూ, అబ్బాయిల్లోనూ పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది అంటున్నారు డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ స్వప్న ప్రియ. వాటిలో...

ఇంట్లో ప్రయోగాలు.. 
చాలా మంది అందానికి ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. సహజంగా లభించే వాటితో బ్యూటీప్యాక్‌లు వేసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా ఎంత సమయంలో ఎంత ప్రయోజనం ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే, కొంతమందికి స్కార్స్, పింపుల్స్, యాక్నె, డల్‌ స్కిన్, కలర్‌ ఛేంజ్, చుండ్రు... ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి చికిత్సనే సరైన మార్గం. ఆహారానికి సంబంధించినవి తప్పనిసరిగా పెళ్లికి రెండు నుంచి మూడు నెలల ముందు మార్పులు చేసుకోవాలి. సహజంగా చర్మంలో మార్పులు రావాలంటే పోషకాహారం మంచి ఎంపిక. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.  

బ్యూటీ స్పాలో చికిత్స మంచిదేనా?
స్కిన్‌ టైటనింగ్, రింకిల్స్, స్కిన్‌ హైడ్రేషన్‌.. వంటి ట్రీట్‌మెంట్స్‌ బ్యూటీ స్పాలలో చేయించుకుంటారు. దీనికి కూడా ముందు సరైన కౌన్సెలింగ్‌ అవసరం. ఒక్కో వ్యక్తి చర్మ తత్త్వం ఒక్కో విధంగా ఉంటుంది. ఈ విధానంలో చర్మం రికవరీ అవడానికి కూడా సమయం పడుతుంది. 

ఇంజక్షన్లు సరైనవేనా...
కృత్రిమంగా కొలాజన్, స్కిన్‌ బూస్టర్స్‌.. అని తీసుకుంటున్నారు. ఎవరో చెప్పారని కొంతమంది నర్సులను ఇంటికి పిలిపించుకొని ఇంజక్షన్లు చేయించుకుంటారు. మంచి లుక్‌ కోసం ట్రై చేయచ్చు. కానీ, వాటి డోసుల్లో తేడాలొస్తే మొత్తం తిరగబడుతుంది. 

ఆన్‌లైన్‌లో చూసి ...
సోషల్‌ మీడియా ప్రభావం వల్ల ఆన్‌లైన్‌లో బ్యూటీ ఉత్పత్తులు తెప్పించుకొని, అప్లై చేసుకోవడం చూస్తుంటాం. వాటి వల్ల ఇబ్బందుల పాలైన వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే, అవి వారికి ఎంత వరకు నప్పుతాయో తెలియదు. 

కెమికల్‌ పీలింగ్‌ 
కెమికల్‌ పీల్‌లో బయటి నుంచి చర్మంలోకి ఎలాంటి రసాయనాలు చొప్పించరు. మృతకణాలను తొలగిస్తారు, చర్మం పై పొర నుండి టానింగ్, పిగ్మెంటేషన్‌ తగ్గి కొత్త పొర కనిపిస్తుంది. అయితే, దీని ద్వారా చర్మంపై కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిపుణుల సలహా అవసరం. ఇంకొన్ని పీఆర్‌పీ చికిత్సలు చర్మ నిగారింపును తీసుకువస్తాయి. అయితే, వధువులు కాబోయే అమ్మాయిలు పెళ్లికి 3 నుండి 6 నెలల ముందు ఈ కాస్మెటిక్‌ విధానాలను ప్రారంభించాలి. ఎందుకంటే వారి సిట్టింగ్‌లలో కనీసం 3 వారాల గ్యాప్‌ ఉండాలి. 

లైటర్‌ టోన్‌లకు డిమాండ్‌
పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తమ ప్రీ–బ్రైడల్‌ విధానంలో రంగు ఫెయిర్‌గా మారడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి, సూర్యకిరణాల నుండి మన చర్మాన్ని మనం రక్షించుకోనప్పుడు, చర్మంలో పాచెస్‌ ఏర్పడతాయి. కొన్నిసార్లు సూర్యకాంతి కుడి వైపున, మరి కొన్నిసార్లు ఎడమ వైపున ఎక్కువగా పడుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలను దెబ్బతీస్తాయి. పిగ్మెంటేషన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో అంతటా ’చర్మపు రంగు’ ఒకే విధంగా ఉండదు. అంటే ముఖం మీద చాలా చోట్ల టాన్‌ ఉంటుంది. ఈవెన్‌ టో ని కలిగి ఉండాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖంపై సన్‌ స్క్రీన్‌ని అప్లై చేయడం చాలా ముఖ్యం. 

కాస్మొటిక్‌ ఫిల్లర్స్‌...
నిఖిత పెదవులు చాలా సన్నగా ఉంటాయి.  రంగు చాలా తక్కువ. ఒకరోజు ఆమె కాబోయే అత్తగారు  ఫోన్‌ చేసి ‘నీ ముఖంలో పెదవులు కనిపించడం లేదు. ఏదైనా చికిత్స తీసుకో’ అంది. దీంతో నిఖిత నర్సులను కాస్మెటిక్‌ ఫేషియల్‌ ఫిల్లర్లను ఆశ్రయించింది. దీనిని లిప్‌ ఫిల్లర్‌ అని కూడా అంటారు. దీర్ఘకాలిక ఫలితాల కోసం, ప్రతి 6 నుండి 8 నెలలకు ఇంజెక్షన్లు చేయాలి. కాస్మెటిక్‌ ఫేషియల్‌ ఫిల్లర్లే కాకుండా, హైలురానిక్‌ యాసిడ్‌ ఫిల్లర్‌ ఇంజక్షన్లు కూడా ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈ డెర్మా ఫిల్లర్‌లతో పెదవులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. పగుళ్లు రావు, పూర్తి పరిమాణంలో కనిపిస్తాయి. అలాగే, కొందరు అమ్మాయిలు అత్తింటి వారు బరువు తగ్గమన్నారు కదా అని లైపోసక్షన్‌ వంటి చికిత్సలు చేయించుకుంటారు. దీని వల్ల చర్మంపై చారలు ఏర్పడతాయి. అవి అంత త్వరగా పోవు. ముక్కు, పెదాలు, బ్రెస్ట్‌  సరిచేసుకోవడానికి కాస్మొటిక్‌ సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఏ చికిత్స అయినా కనీసం ఆరు నెలల ముందు చేయించుకుంటే వచ్చే సైడ్‌ఎఫెక్ట్‌నూ నివారించవచ్చు. 

సహజమైన మెరుపే మేలు
పెళ్లి 10–15 రోజులు ఉందనగా ఏ బ్యూటీ ట్రీట్‌మెంట్‌ చేయించుకోకూడదనే విషయం ముందు గ్రహించాలి. కనీసం ఆరు లేదా మూడు నెలల ముందు బ్యూటీ చికిత్సలు చేయించుకోవచ్చు. దీని ద్వారా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటే నివారించుకునే అవకాశం ఉంటుంది. కృత్రిమ అందాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎప్పుడైనా సహజమైన మెరుపును ఇచ్చే బ్యూటీ ట్రీట్‌మెంట్‌ మాత్రమే మంచిదని గమనించాలి. అయినా తప్పదు అనుకునేవారు స్కిన్‌ బూస్టర్స్, ఇతర ట్రీట్‌మెంట్‌ వైపుగా వెళ్లచ్చు. ఇందుకు నిపుణుల పర్యవేక్షణ అవసరం. 








డాక్టర్‌ స్వప్నప్రియ, డర్నటాలజిస్ట్‌


(చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement