అన్ని జబ్బులకూ ఒకటే మందు
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. అనేకచోట్ల మాత్రలు, సిరప్‌లు, సిరంజ్‌ల స్టాక్ నామమాత్రంగా కూడా లేదు. పలు ఆస్పత్రుల్లో ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో పాము, కుక్కకాటు నివారణ మందులు పాడయ్యాయి. కొన్ని చోట్ల అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోగులే బయట డబ్బులు పెట్టి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో మదనపల్లె అర్బన్ పీహెచ్‌సీల్లో చీకట్లోనే వైద్యం చేస్తున్నారు.
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో 94 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు, 15 ఏపీవీపీ ఆస్పత్రులు పని చేస్తున్నాయి. వీటిల్లో ఎక్కువచోట్ల పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. అయితే విద్యుత్ సదుపాయం లేకపోవడం, ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో మందులన్నీ పాడైపోయాయి. కొన్ని పీహెచ్‌సీల్లో అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. కొన్నిచోట్ల దగ్గు, అల్సర్‌కు సంబంధించిన సిరప్‌లు అందుబాటులో లేవు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో చాలా పీహెచ్‌సీల్లో సిరంజ్ తదితరాలు లే కపోవడంతో బయట తెచ్చుకోమని చీటీలు రాయిస్తున్నారు. ఈ క్రమంలో పేదలు ఇబ్బంది పడుతున్నారు. పీహెచ్‌సీల దుస్థితిపై ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైన తర్వాత చాలాచోట్ల మార్పు వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలో వైద్యాధికారులు స్పందించి కొరత ఉన్న మందులను తిరుపతి నుంచి తెప్పించారు. అనేక చోట్ల వైద్యులు విధులకు సకాలంలో హాజరవుతున్నారు. సత్యవేడులాంటి పెద్ద ఆస్పత్రుల్లో స్త్రీ వైద్య నిపుణుల కొరత నెలకొంది. ఆపరేషన్ సంబంధిత పరికరాలు, అనస్తీషియా ఇంజక్షన్ల కొరత ఉంది.
మదనపల్లె అర్బన్ పీహెచ్‌సీల్లో ఇంజక్షన్లు లేవు. అన్నింటికీ పారాసిట్‌మాల్ మాత్రలే దిక్కవుతున్నాయి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు. సీటీఎం, బొమ్మనపల్లె పీహెచ్‌సీల్లో సీజన్‌ల్ వ్యాధులకు మందులు తక్కువగా ఉన్నాయి. వైద్యులు పది మాత్రలు రాస్తే రెండు మాత్రమే ఇస్తున్నారు.
జీడీనెల్లూరు నియోజకవర్గంలో పీహెచ్‌సీల్లో పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో కార్వేటినగరం, ఎస్.ఆర్.పురంలో ఫ్రిజ్‌లు సరిగా పనిచేయడం లేదు. దీంతో మందులు పాడవుతున్నాయి.
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో సిరంజ్‌లూ లేవు. డ్లైకోపినాక్, పారాసిట్‌మాల్‌లాంటి మాత్రలు లేవు. కురబలకోట పీహెచ్‌సీలో కుక్క, పాముకాటు నివారణ మందులు లేవు. సిరంజ్‌లు బయట నుంచి తెచ్చుకోమని చీటీలు రాసిస్తున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో 8 పీహెచ్‌సీలు ఉన్నాయి. అవసరమైన మందులు ఉన్నాయి. ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైద్యవిధాన పరిషత్ అధికారులు స్పందించారు. తిరుపతి నుంచి చాలా మందులు తెప్పించారు. పెద్దపంజాణి మండలంలో డైక్లోపినాక్ మాత్రల కొరత ఉంది.
నగరి నియోజకవర్గంలో ఒక ఏరియా ఆస్పత్రి, నాలుగు పీహెచ్‌సీలు, ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. అన్నిచోట్లా మందు లు ఉన్నాయి.
సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో పారాసిట్‌మాల్ మాత్రలు, అనస్తీషియా ఇంజక్షన్లు లేవు.
పీలేరు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు ఉన్నాయి.
నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలు ఉన్నా యి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు.