‘అంతర’ం అవసరమా? | Medical and Health Department introduced by the Pregnant Injection Policy | Sakshi
Sakshi News home page

‘అంతర’ం అవసరమా?

Published Fri, Jan 26 2018 1:33 AM | Last Updated on Fri, Jan 26 2018 1:33 AM

Medical and Health Department introduced by the Pregnant Injection Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబ నియంత్రణలో కొత్త పద్ధతులు వివాదాస్పదమవుతున్నాయి. అవసరాలకు తగినట్లుగా కాకుండా అన్ని రాష్ట్రాలకూ ఒకే విధానం అమలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గర్భ నివారణ కోసం ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స, పిల్స్‌ (మాత్రలు), గర్భాశయ పరికరం (ఐయూడీ), కండోమ్‌ విధానాలు ఉన్నాయి. అయితే తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా కుటుంబ నియంత్రణలో మహిళల కోసం ‘అంతర’పేరిట మెడ్రాక్సిప్రొజెస్టరోన్‌ ఇంజెక్షన్‌ను తీసుకొచ్చింది. 2017 డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో 25 మంది మహిళలకు దీన్ని ఇప్పించింది. రూ.1,500 విలువైన ఇంజెక్షన్‌ను ఉచితంగానే అందిస్తోంది. తొలి దశ కోటా కింద రాష్ట్రానికి 17 వేల వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. గర్భం రాకుండా ఉండేందుకు మూడు నెలలకోసారి అంతర (మెడ్రాక్సిప్రొజెస్టరోన్‌) ఇంజెక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్షన్‌ను ఆపేసిన మూడు నెలల తర్వాత తిరిగి గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే జనాభా నియంత్రణ ఉన్న మన రాష్ట్రంలో ఇలాంటి విధానాల అమలు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

టీఎఫ్‌ఆర్‌ తక్కువగా ఉన్నా... 
దేశ సగటు టీఎఫ్‌ఆర్‌ (టోటల్‌ ఫర్టిలిటీ రేట్‌) ప్రస్తుతం 2.23 (ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ)గా ఉంది. 2024 నాటికి ప్రపంచంలోనే ఎక్కువ జనాభాగల దేశంగా భారత్‌ నిలుస్తుందనే అంచనాలున్న నేపథ్యంలో జనాభా నియంత్రణ కోసం కొత్త విధానాలను అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీంతో టీఎఫ్‌ఆర్‌ను 2.0కు తగ్గించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ‘అంతర’ను తీసుకొచ్చింది. జనాభా నియంత్రణ విషయంలో టీఎఫ్‌ఆర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు చెబుతున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్‌ వంటి 18 రాష్ట్రాల్లో టీఎఫ్‌ఆర్‌ రెండు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో మాత్రం టీఎఫ్‌ఆర్‌ రెండు కంటే తక్కువగా ఉంది. కానీ కేంద్రం మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా జనాభా నియంత్రణను అమలు చేయాలనుకుంటుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఎఫ్‌ఆర్‌ రెండు కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు సహా అన్నింటిలోనూ సమతూకం ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ప్రమాణాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో టీఎఫ్‌ఆర్‌ 1.8 ఉంది. ఇంకా తగ్గితే భవిష్యత్తులో జనాభాలో సమతూకం ఉండదనే ఆందోళన ఉంది. టీఎఫ్‌ఆర్‌ 1.57 ఉన్న చైనాలో దీన్ని పెంచేందుకు ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది. ఇద్దరు పిల్లలను కనాలనే దిశగా అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఎఫ్‌ఆర్‌ 2.0 కంటే తక్కువగా ఉన్న తెలంగాణలోనూ గర్భ నిరోధక సూదిమందు వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉత్తరాదిలో వాడకంపై వివాదం!
ఉత్తరాది రాష్ట్రాలలో అంతర ఇంజెక్షన్‌ వాడకంపై వివాదం నెలకొంది. మిషన్‌ పరివారం వికాస్‌ కార్యక్రమం పేరుతో టీఎఫ్‌ఆర్‌ మూడు కంటే ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాల్లోని 145 జిల్లాల్లో ఈ ఇంజెక్షన్‌ను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అయితే ఇంజెక్షన్‌ వాడిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి, రొమ్ము కేన్సర్‌ వస్తున్నాయని పలు స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తుండగా అధికార వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. ప్రైవేటు వైద్య రంగంలో ఇప్పటికే గర్భనిరోధక ఇంజెక్షన్‌ అందుబాటులో ఉందని, దీని వాడకం వల్ల ఎవరికీ ఎలాంటి దుష్పరిణామాలు రాలేదని చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement