సాక్షి, హైదరాబాద్: నెలలు నిండిన గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు ప్రసవం చేసేందుకు సకాలంలో డాక్టర్ అందుబాటులో లేకపోతే..ఆ తర్వాత జరిగే పర్యవసానాలను ఊహించుకోవడానికి కష్టంగా ఉంది కదూ! కానీ, ఇప్పుడు ఆ బాధ అక్కర్లేదు. సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోయినా నర్సులే గర్భిణులకు సాధారణ ప్రసవాలను చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. యూనిసెఫ్ ప్రత్యేక సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ అంతర్జాతీయ ప్రమాణాలతో నర్సులకు శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదించింది. ఇక శిక్షణలో భాగంగా సాధారణ ప్రసవాలు ఎలా చేయాలో నర్సులకు ఏడాదిపాటు థియరీలోనూ, మరో ఏడాదిపాటు ప్రాక్టికల్స్‌లో నేర్పుతున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.1.54 కోట్లు కేటాయించగా, 2018–19 కోసం ఏకంగా రూ. 4.50 కోట్లు కేటాయించింది.
మూడు దశల్లో ఎంపిక
ఐదేళ్లు మించి అనుభవం కలిగిన నర్సులకు స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు నిర్వహించి ఈ శిక్షణకు 30 మందిని ఎంపిక చేశారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా సాధారణ ప్రసవాలు చేసేలా వీరికి అంతర్జా తీయ నిపుణులు, వివిధ దేశాల్లోని వైద్య బృందం శిక్షణనిచ్చింది. మరో 3బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలో మరికొంత మందిని ఎంపిక చేయనున్నారు. దేశంలోనే నర్సులకు ఇటువంటి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
సిజేరియన్లు తగ్గించేలా..
దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో సిజేరి యన్ ప్రసవాలు జరుగుతుండటం ఆందోళన కలి గిస్తోంది. తెలంగాణలో 60% ప్రసవాలు సిజేరి యన్ ద్వారా జరుగుతున్నాయని ప్రభుత్వ నివే దికలే చెబుతున్నాయి. వీటిని తగ్గించడంతో పా టుగా మాతాశిశు మరణాల రేటునూ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే యూనిసెఫ్ సహకారంతోపాటు ఫెర్నాండేజ్ గ్రూప్ భాగస్వామ్యంతో నర్సులకు ఈ విధమైన శిక్షణనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
శిక్షణ నాణ్యతను నిర్ధారించే ప్రజారోగ్య సంస్థ..
‘‘ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్‌వైవ్స్ (ఐసీఎం) ప్రమాణాల మేరకు ఈ శిక్షణ ఇస్తున్నాం. శిక్షణలో భాగంగా గర్భిణుల మానసిక పరిస్థితిని అంచనా వేసేలా సైకలాజికల్ కోర్సు, హైరిస్క్‌ను అంచనా వేయడం, డెలివరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్లను గుర్తించేలా వీరికి తర్ఫీదునిస్తున్నాం. నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే నేషనల్ ట్రైనింగ్ హబ్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడి శిక్షణ ప్రమాణాలను అంచనా వేసేలా బెంగళూరులోని ప్రజారోగ్య సంస్థను థర్డ్ పార్టీ అసెస్‌మెంట్‌గా నియమించాం ప్రతీ మూడు నెలలకోసారి ఆ సంస్థ శిక్షణ నాణ్యతను నిర్ధారిస్తుంది’’.
– డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment