
సూదిమందంటే మీకు భయమా? అయితే మీ ఇబ్బంది ఇక తీరినట్లే. ఎలాంటి నొప్పి, బాధ లేకుండా శరీరంలోకి జబ్బుల్ని నయం చేసే మందులను పంపించేందుకు మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సూదిమందుకు ప్రత్యామ్నాయంగా బుల్లిబుల్లి సూదులతో కూడిన బ్యాండ్ ఎయిడ్లు, లేజర్ ఆధారిత పరికరాలు వంటివి గతంలో బోలెడన్ని వచ్చినా.. అవేవీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఎంఐటీ శాస్త్రవేత్తల కొత్త పరికరం మాత్రం దీనికి భిన్నంగా త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. ‘ప్రైమ్’ అని పిలుస్తున్న ఈ యంత్రాన్ని జపనీస్ ఫార్మా కంపెనీ ‘తకేడా’ మార్కెట్‌లోకి తేనుంది. మామూలు ఇంజెక్షన్ల మాదిరిగానే ప్రైమ్‌లోనూ ద్రవరూపంలో ఉండే మందులనే వాడతారు. కాకపోతే సూదితో లోపలికి పంపించకుండా, మందును వాయురూపంలోకి మార్చి, పీడనానికి గురిచేసి చర్మ రంధ్రాల ద్వారా లోపలకు పంపుతారు.
ఇదెంత వేగంగా జరుగుతుందంటే... శరీరంలోకి వెళ్లేటప్పుడు మందు ప్రయాణించే వేగం సెకనుకు 656 అడుగులు. వెంట్రుక పరిమాణం కంటె సన్నటి గొట్టం ద్వారా ఇది చర్మం ద్వారా కణజాలంలోకి చేరిపోతుంది. వేగాన్ని నియంత్రించేందుకూ దీంట్లో ఏర్పాట్లు ఉన్న కారణంగా మందును శరీరంలో ఎంత లోతుకు కావాలంటే అంత లోతుకు చేర్చవచ్చు. వాడేసిన తరువాత మందు ఉన్న చిన్న పెట్టెను యంత్రం నుంచి బయటకు తీసి చెత్తబుట్టలో పడేస్తారు. మధుమేహానికి వాడే ఇన్సులిన్ మొదలుకొని వ్యాక్సిన్లు, హార్మోన్లను కూడా ఈ యంత్రం ద్వారా వాడవచ్చునని తకేడా అంటోంది. సూదితో పోలిస్తే తమ యంత్రం ద్వారా మందులు తీసుకోవడం ఎంతో సురక్షితమని, వాడి పడేసిన మందుల పెట్టెలతోనూ ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment